జెట్‌ టేకాఫ్‌కు లైన్‌ క్లియర్‌

ABN , First Publish Date - 2021-06-23T09:18:01+05:30 IST

ఆర్థిక సమస్యలతో రెండేళ్ల క్రితం మూతపడ్డ జెట్‌ ఎయిర్‌వేస్‌ మళ్లీ రెక్కలు తొడగనుంది. ఈ ప్రైవేట్‌ ఎయిర్‌లైన్స్‌ దివాలా పరిష్కార ప్రక్రియలో భాగంగా జలాన్‌-కల్రాక్‌ కన్సార్షియం సమర్పించిన బిడ్‌కు జాతీయ కంపెనీల..

జెట్‌ టేకాఫ్‌కు   లైన్‌ క్లియర్‌

 ఎయిర్‌లైన్స్‌ దివాలా 

పరిష్కార ప్రణాళికకు ఆమోదం తెలిపిన ఎన్‌సీఎల్‌టీ

జప్రణాళిక అమలుకు 90 రోజుల గడువు  


ముంబై: ఆర్థిక సమస్యలతో రెండేళ్ల క్రితం మూతపడ్డ జెట్‌ ఎయిర్‌వేస్‌ మళ్లీ రెక్కలు తొడగనుంది. ఈ ప్రైవేట్‌ ఎయిర్‌లైన్స్‌ దివాలా పరిష్కార ప్రక్రియలో భాగంగా జలాన్‌-కల్రాక్‌ కన్సార్షియం సమర్పించిన బిడ్‌కు జాతీయ కంపెనీల చట్టం ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) ముంబై బెంచ్‌ ఆమోదం తెలిపింది. ఈ నెల 22 నుంచి 90 రోజుల్లో పరిష్కార ప్రణాళికను అమలు చేయాలని బెంచ్‌ ఆదేశించింది. ప్రణాళిక అమలుకు మరింత సమయం అవసరమైన పక్షంలో జలాన్‌-కల్రాక్‌ కన్సార్షియం ట్రైబ్యునల్‌ను సంప్రదించవచ్చని స్పష్టం చేసింది. ఈ కన్సార్షియం బిడ్‌కు ఎయిర్‌లైన్స్‌ రుణదాతల కమిటీ (సీఓసీ) గత ఏడాది అక్టోబరులోనే ఆమోదం తెలిపింది.  అప్పుల సంక్షోభం కారణంగా 2019, ఏప్రిల్‌ 17న జెట్‌ ఎయిర్‌వేస్‌ సేవలు నిలిచిపోయాయి. ఎయిర్‌లైన్స్‌కు రుణాలిచ్చిన ఎస్‌బీఐ నేతృత్వ కన్సార్షియం రూ.8,000 కోట్లకు పైగా బకాయిలను రాబట్టుకునేందుకు అదే ఏడాది జూన్‌లో దివాలా పిటిషన్‌ దాఖలు చేశాయి. 


స్లాట్ల కేటాయింపుపై డీజీసీఏదే నిర్ణయం:

జెట్‌ ఎయిర్‌వే్‌సకు ఆయా ఎయిర్‌పోర్టుల్లోని గత ల్యాండింగ్‌ స్లాట్లను తిరిగి కేటాయించే విషయంలో మాత్రం డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) నిర్ణయం తీసుకుంటుందని ఎన్‌సీఎల్‌టీ బెంచ్‌ పేర్కొంది. జెట్‌ ఎయిర్‌వేస్‌ కార్యకలాపాల పునరుద్ధరణకు స్లాట్ల కేటాయింపే కీలకం కానుంది. 2019 ఏప్రిల్‌లో సేవలు నిలిచిపోయాక జెట్‌ స్లాట్లను విమాన శాఖ ఇతర ఎయిర్‌లైన్స్‌కు కేటాయించింది. అప్పట్లో ఎయిర్‌ ఇండియా తర్వాత అత్యధిక స్లాట్లు కలిగింది ఈ ఎయిర్‌లైన్సే.  


ఎయిర్‌ ట్యాక్సీ ఆపరేటర్‌గా ప్రారంభం:

1993 మే 5న ఎయిర్‌ ట్యాక్సీ ఆపరేటర్‌గా జెట్‌ ఎయిర్‌వేస్‌ ప్రారంభమైంది. తొలుత నాలుగు బోయింగ్‌ 737-300 విమానాలను లీజుకు తీసుకుని సేవలను ఆరంభించింది. 1995లో పూర్తి స్థాయి ఎయిర్‌లైన్స్‌గా అవతారమెత్తింది. 2004లో విదేశీ విమానయాన సేవలను ప్రారంభించింది. 


సగానికి పైగా తగ్గిన షేరు ధర:

రెండేళ్ల క్రితం విమాన సేవలను నిలిపివేసినప్పటి నుంచి ఇప్పటివరకు జెట్‌ ఎయిర్‌వేస్‌ షేరు ధర సగానికి పైగా (58.57 శాతం) పతనమైంది. సేవల నిలిపివేతకు ముందు రోజు (2019 ఏప్రిల్‌ 16) ఎయిర్‌లైన్స్‌ షేరు ధర బీఎ్‌సఈలో రూ.241.85గా ఉండగా.. ప్రస్తుతం 99.45 వద్ద ట్రేడవుతోంది.కంపెనీ మార్కెట్‌ విలువ కూడా రూ.1,617.27 కోట్ల నుంచి రూ.1,129.73 కోట్లకు పడిపోయింది. 


డిసెంబరు నాటికి సేవలు షురూ 

అన్నీ సక్రమంగా జరిగితే జెట్‌ ఎయిర్‌వేస్‌ విమానాలు ఈ ఏడాది చివరికల్లా తిరిగి టేకాఫ్‌ తీసుకోవచ్చని  దివాలా పరిష్కార నిపుణుడు   ఆశిష్‌ చావ్‌చారియా ఆశాభావం వ్యక్తం చేశారు. స్లాట్ల కేటాయింపు సమస్య ఎప్పటికల్లా కొలిక్కి వచ్చేది ఇప్పుడే చెప్పలేమన్నారు.  

Updated Date - 2021-06-23T09:18:01+05:30 IST