Abn logo
Jul 8 2020 @ 04:23AM

‘రాజకీయ’ మైదానం

స్వరాజ్య మైదానంలో రాజకీయ క్రీడ

అంబేడ్కర్ ఉద్యానవనం ఏర్పాటుకు ప్రభుత్వ నిర్ణయం

ఉద్యానవనం పేరుతో పలు నిర్మాణాలు

నేడు శంకుస్థాపన చేయనున్న సీఎం జగన్

నగరవాసులకు ఉన్న ఏకైక విశాల ప్రాంగణం ఇదే


(ఆంధ్రజ్యోతి, విజయవాడ): విజయవాడ నగరం నడిబొడ్డున ఉన్న స్వరాజ్య మైదానంలో మరోసారి రాజకీయ క్రీడకు తెరలేచింది. ఇక్కడ అంబేడ్కర్‌ ఉద్యానవనాన్ని ఏర్పాటు చేయాలని వైసీపీ సర్కార్‌ నిర్ణయించింది. 125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహంతోపాటు అంబేడ్కర్‌ స్మారక కేంద్రం, లైబ్రరీ, ఓ అధ్యయన కేంద్రం, ఓపెన్‌ ఎయిర్‌ థియేటర్‌ను ఇక్కడ నిర్మించనున్నారు. దీంతో ప్రస్తుతం నగరవాసులకు అందుబాటులో ఉన్న సుమారు ఎనిమిదెకరాల విశాల ప్రాంగణం ఇకపై గత చరిత్రగా మిగిలిపోనుంది. 


విజయవాడ నగరానికి ఉన్న ఏకైక విశాల ప్రాంగణం స్వరాజ్య మైదానంగా ప్రాచుర్యంలో ఉన్న పీడబ్ల్యూడీ గ్రౌండ్‌. ఒకనాడు 21.36 ఎకరాల్లో ఉన్న ఈ మైదానం అనేక ఆక్రమణలు, నిర్మాణాల కారణంగా సుమారు ఎనిమిదెకరాలు మాత్రమే మిగిలింది. నగరం నడిబొడ్డున నగరవాసులకు అందుబాటులో ఉన్న ఏకైక ఖాళీ స్థలం ఇదొక్కటే. ఈ స్థలంలో టీడీపీ హయాంలో సిటీ స్క్వేర్‌ నిర్మించాలని నిర్ణయించారు. కానీ నగరవాసుల నుంచి వెల్లువెత్తిన నిరసనలతో ఆ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఇప్పుడు వైసీపీ సర్కార్‌ దృష్టి దీనిపై పడింది.

 

అక్కడ కాదని.. ఇక్కడ

టీడీపీ ప్రభుత్వ హయాంలో అమరావతిలోని శాఖమూరులో అంబేద్కర్‌ స్మృతివనాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించి, శంకుస్థాపన కూడా చేశారు. 2018 ఏప్రిల్‌ 14న అప్పటి సీఎం చంద్రబాబు అంబేద్కర్‌ స్మృతివనానికి శంకుస్థాపన చేశారు. 15 ఎకరాల్లో రూ.210 కోట్లతో దీన్ని ఏర్పాటు చేసేందుకు సంకల్పించారు. నిధుల కేటాయింపు జరిగింది. పనులూ ప్రారంభించారు. ఇక్కడ 125 అడుగుల ఎత్తైన అంబేద్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతోపాటు అంబేద్కర్‌ మెమోరియల్‌ పార్కు, కన్వెన్షన్‌ సెంటర్‌, అంబేద్కర్‌ సాహిత్యంతో కూడిన లైబ్రరీ ఏర్పాటు చేసి, ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని నిర్ణయించారు.


ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఆ పనులను అటకెక్కించి, స్వరాజ్య మైదానంలో అంబేడ్కర్‌ ఉద్యానవనానికి శ్రీకారం చుట్టడం విమర్శలకు తావిస్తోంది. ఇది రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. నగరంలో సభలు నిర్వహించుకునేందుకు, పుస్తక మహోత్సవాలు నిర్వహించుకోవడానికి, వేసవిలో ప్రజలకు ఆహ్లాదాన్ని పంచే ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేయాలన్నా ఈ మైదానమే దిక్కు. గాంధీనగర్‌లో జింఖానా మైదానం ఉన్నా, అది రెండు ఎకరాల్లోపే ఉంటుంది. అంబేడ్కర్‌ ఉద్యానవనం ఏర్పాటు చేస్తే అందుబాటులో ఉన్న ఈ ఒక్క స్థలం నగరవాసులకు అందుబాటులో లేకుండా పోతుంది.  


ఘనమైన చరిత

ఎన్నో ఉద్యమాలు పురుడు పోసుకుంది ఇక్కడే.. ఎందరో ప్రముఖులు నడయాడిన నేల ఇది. ఎన్నో ఉత్సవాలకు, ప్రత్యేకించి ప్రతి ఏటా నిర్వహించే పుస్తక మహోత్సవాలకు ఇదే కేంద్రం. మాజీ ప్రధానులు జవహర్‌లాల్‌ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ, చంద్రశేఖర్‌, పీవీ నరసింహరావు, వాజ్‌పేయిలు ఈ మైదానంలో నిర్వహించిన బహిరంగ సభల్లో పాల్గొని, తమ ప్రసంగాలతో ప్రజలను ఉత్తేజితుల్ని చేశారు. ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేయడానికి ముందు ఇక్కడే లక్షలాది మంది అభిమానులతో భారీ బహిరంగ సభను నిర్వహించారు.


కమ్యూనిస్టు యోధులు  పుచ్చపల్లి సుందరయ్య, చండ్ర రాజేశ్వరరావు, ప్రకాష్‌ కరత్‌, ఇంద్రజిత్‌ గుప్తా వంటి నేతల బహిరంగ సభలకు వేదికగా ఈ మైదానం నిలిచింది. ప్రతి ఏడాదీ జనవరిలో పుస్తక మహోత్సవాలను, వేసవిలో ఎగ్జిబిషన్లును నిర్వహించేది ఇక్కడే. ఈ మైదానంలో అడుగుపెడితే మూడు పోరాటాల పుటలు కనిపిస్తాయి. ఒకనాడు స్వాతంత్య్ర పోరాటం, అనంతర కాలంలో జై ఆంధ్రా ఉద్యమం.. ఆ తరువాత కాలంలో జరిగిన సమైక్యాంధ్ర ఉద్యమం.. అన్నింటికీ ఇది కేంద్రం. బ్రిటీష్‌ వారి కాలం నుంచీ పీడబ్ల్యూడీ గ్రౌండ్‌గా ఉన్న దీని పేరును, నగర పాలక సంస్థపై కమ్యూస్టులు జెండా ఎగురవేసిన తర్వాత స్వరాజ్య మైదానంగా మార్చారు. బందరు రోడ్డుకు మహాత్మాగాంధీ రోడ్డుగా, పీడబ్ల్యూడీ గ్రౌండ్‌కు స్వరాజ్య మైదానంగా అప్పట్లోనే నామకరణం చేశారు. 


ఏకపక్ష నిర్ణయాలు తగవు

అంబేడ్కర్ 125 అడుగుల విగ్రహం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం హర్షణీయం. గత టీడీపీ ప్రభుత్వం అమరావతిలో స్మృతివనాన్ని ఏర్పాటు చేసి, అక్కడ అంబేడ్కర్ 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అక్కడ పార్కు నిర్మాణం కూడా జరుగుతోంది. అక్కడే పనులు కొనసాగించాలి. స్వరాజ్య మైదానం నగరవాసులకు అందుబాటులో ఉన్న ఏకైక అతిపెద్ద ఖాళీ స్థలం. అంబేడ్కర్ స్మృతివనాన్ని శాఖమూరులోనే ఏర్పాటు చేయాలి. నగరవాసులకు తెలియకుండా సీఎం జగన్ ఏకపక్షంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం తగదు.

- వడ్డె శోభనాద్రీశ్వరరావు, మాజీ మంత్రి


ఇక్కడ నిర్మాణాలు వద్దు

స్వరాజ్యమైదానంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టడానికి వీల్లేదు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా నేతలకు ఈ మైదానమే ఎందుకు కనిపిస్తుందో అర్థం కావడం లేదు. ఎన్టీఆర్ దీన్ని ప్రైవేటు సంస్థలకు లీజుకు ఇవ్వాలని నిర్ణయించారు. ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో వెనక్కి తగ్గారు. చంద్రబాబు కన్వెన్షన్ సెంటర్ నిర్మించే పనిని విదేశీ సంస్థలకు కట్టబెట్టాలనుకున్నారు. చివరికి ఆయనా వెనుకడుగు వేశారు. విజయవాడకు ఎంత చరిత్ర ఉందో, స్వరాజ్యమైదానానికీ అంతే చరిత్ర ఉంది. దీనిని పరిరక్షించుకునేందుకు నగరవాసులంతా రాజకీయాలకు అతీతంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది.

- కె. సుబ్బరాజు, మాజీ ఎమ్మెల్యే

Advertisement
Advertisement
Advertisement