వర్జీనియా ఆకు క్యూరింగ్‌కు కొత్త బ్యారన్‌

ABN , First Publish Date - 2021-02-26T05:23:42+05:30 IST

పొగాకు రైతులకు ఖర్చు తగ్గించుకునే సాధనం దొరికింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నడిచే సరికొత్త బ్యారన్‌ అందుబాటులోకి వచ్చింది. బ్రెజిల్‌ టెక్నాలజీతో మెటాలిక్‌ బ్యారన్‌తో అన్నీ ఆదా చేసుకోవచ్చు. పొగాకు సాగులో ప్రధానమైన కూలీల ఖర్చును ఈ బ్యారన్‌ద్వారా తగ్గించుకోవచ్చు. అలాగే అల్లిక అవసరం లేనందున కర్ర, పురి కొనుగోలు అవసరం లేదు. బ్యారన్‌లో గొట్టాలు, టైర్లు లేనందున ప్రతి ఏటా బ్యారన్‌ మరమ్మతుల కోసం వేలాది రూపాయలు వెచ్చించాల్సిన అవసరం ఉండదు.

వర్జీనియా ఆకు క్యూరింగ్‌కు కొత్త బ్యారన్‌
శింగరబొట్లపాలెంలో ఏర్పాటుచేసిన మెటాలిక్‌ బ్యారన్‌

  పొగాకు రైతుకు ఆశాదీపం

ఆధునిక సాంకేతికతతో పాటు కూలీల ఖర్చు తక్కువ

బ్రెజిల్‌ టెక్నాలజీతో మెటాలిక్‌ బ్యారన్లు

టైర్లు, గొట్టాలు, అల్లిక లేని క్యూరింగ్‌ విధానం 

శింగరబొట్లపాలెంలో ప్రయోగాత్మకంగా ఏర్పాటు 

పొగాకు బోర్డు వైస్‌ చైర్మన్‌ శివారెడ్డి నిర్మించిన 

మెటాలిక్‌ బ్యారన్‌ని ప్రారంభించిన చైర్మన్‌, ఈడీ 

కందుకూరు, ఫిబ్రవరి 25: పొగాకు సాగులో సరికొత్త అధ్యాయం. వర్జీనియా పొగాకు క్యూరింగ్‌లో సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం రైతులకు అందుబాటులోకి వచ్చింది. బ్రెజిల్‌ నుంచి దిగుమతి చేసుకున్న మెటాలిక్‌ బ్యారన్‌ (లూజ్‌ లీప్‌ బ్యారన్‌)  ద్వారా క్యూరింగ్‌లో ఆధునిక సాంకేతికతకు అవకాశం కల్పించే ఈ బ్యారన్‌ పొగాకు రైతుకి ఆశాదీపంగా కనిపిస్తోంది. బ్యారన్‌లో గొట్టాలు, టైర్లు, అల్లుడు కర్ర అవసరం లేకుండా కేవలం ట్రేలలో ఆకుని పెట్టి క్యూరింగ్‌ చేసుకునేందుకు అవకాశం కల్పించే ఈ మెటాలిక్‌ బ్యారన్‌ రైతుకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నారు. పొగాకు రె లుపు తర్వాత అల్లకం చేయాల్సిన పని లేనందున నైపుణ్యం కలిగిన కూలీల అవసరం బాగా తగ్గుతుంది. అయితే ఆ బ్యారన్‌కు పెట్టుబడి కాస్తంత ఎక్కువే. అయితే వ్యవసాయ రాయితీ ఇస్తే రైతులకు ఉపయోగమని రైతులంటున్నారు. దానికి బోర్డు చైర్మన్‌కు కూడా పరిశీలిస్తామని ప్రకటించడం ఆశావహంగా ఉంది

 పొగాకు రైతులకు ఖర్చు తగ్గించుకునే సాధనం దొరికింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నడిచే సరికొత్త బ్యారన్‌ అందుబాటులోకి వచ్చింది. బ్రెజిల్‌ టెక్నాలజీతో మెటాలిక్‌ బ్యారన్‌తో అన్నీ ఆదా చేసుకోవచ్చు. పొగాకు సాగులో ప్రధానమైన కూలీల ఖర్చును ఈ బ్యారన్‌ద్వారా తగ్గించుకోవచ్చు. అలాగే అల్లిక అవసరం లేనందున కర్ర, పురి కొనుగోలు అవసరం లేదు. బ్యారన్‌లో గొట్టాలు, టైర్లు లేనందున ప్రతి ఏటా బ్యారన్‌ మరమ్మతుల కోసం వేలాది రూపాయలు వెచ్చించాల్సిన అవసరం ఉండదు. దీంతో పొగాకు క్యూరింగ్‌ వ్యయం సగానికి సగం తగ్గటమే గాక పొగాకులో అన్యపదార్థాలు చేరే అవకాశం కూడా గణనీయంగా తగ్గుతుంది. బ్రెజిల్‌ టెక్నాలజీని పొగాకు బోర్డు, ఐటీసీ, ఇతర ప్రధాన ట్రేడింగ్‌ కంపెనీల ఆర్థిక సహాయంతో ఇక్కడికి దిగుమతి చేసి మెటాలిక్‌ బ్యారన్‌లు ఏర్పాటు చేయిస్తున్నారు. ఇప్పటికే ఉత్తరాది తేలిక నేలల్లో నాలుగు ఈ తరహా బ్యారన్లు ఏర్పాటుకాగా దక్షిణాదిలో మొదటిసారిగా కందుకూరు-1 వేలంకేంద్రం పరిధిలోని శింగరబొట్లపాలెంలో మెటాలిక్‌ బ్యారన్‌ను ఏర్పాటుచేశారు. పొగాకు బోర్డు వైస్‌ చైౖర్మన్‌ గుండాల కొండారెడ్డి (శివారెడ్డి) ఈ బ్యారన్‌ని ఏర్పాటు చేయగా బుధవారం బోర్డు ఛైర్మన్‌ యడ్లపాటి రఘునాథబాబు, ఈడీ అద్దంకి శ్రీధర్‌బాబులు ఈ బ్యారన్‌ని పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రారంభించారు. 


ఆటోమ్యాటిగ్గా ఉష్ణోగ్రత హెచ్చుతగ్గులు 

ఈ బ్యారన్‌లో నిర్దేశిత ఉష్ణోగ్రత వద్ద తొలుత పుల్ల ద్వారా క్యూరింగ్‌ చేస్తారు. ఆటోమ్యాటిక్‌గా సెన్సార్ల ద్వారా విద్యుత్‌ మోటార్లు, ఫ్యాన్లు, బ్లోయర్లు పనిచేసి ఉష్ణోగ్రత హెచ్చు తగ్గులను అదే క్రమబద్ధీకరించుకుంటుంది. బ్యారన్‌లో క్యూరింగ్‌ అయ్యే పొగాకుకి నిరంతరాయంగా సమ ఉష్ణోగ్రత అందుతుంది. దీనివల్ల నాణ్యమైన పొగాకు దిగుబడి వస్తుంది. బ్యారన్‌ నిర్మాణం మొత్తం లోపల, బయట మెటల్‌తో నిర్మించటం, లోపల గొట్టాలు అవసరం లేకపోవటంతో అగ్నిప్రమాదాలు సంభవిస్తాయన్న భయమే లేదు. పొగాకు విడి ఆకులను మెటాలిక్‌ ట్రేలలో అమర్చి వాటిని బ్యారన్‌ లోపలి భాగంలో స్టాండ్లను ఏర్పాటుచేసి దానిపై ఉంచుతారు. దీంతో పొగాకు రేకల్లో పెట్టడం, కట్టలు కట్టడంలాంటి శ్రమ లేకుండా పోవటమే గాక గ్రేడింగ్‌కి కూడా కట్టలు విప్పే పనిలేనందున అక్కడా సగానికి సగం కూలీల ఖర్చు తగ్గుతుంది. ఈ బ్యారన్‌లో ఒక విడతలో రెండు ప్రధాన బ్యారన్లలో క్యూరింగ్‌ చేసేంత పొగాకుకు అవకాశం ఉండటమేగాక క్యూరింగ్‌ వ్యవధి కూడా రెండురోజులు కలిసొస్తుంది. దీంతో పొగతోటల్లో ఆకులు పండిపోతాయన్న భయం లేదని పక్వానికి రాగానే ఆకులు రెలుచుకోవచ్చునని బోర్డు అధికారులు, ఐటీసీ ప్రతినిధులు ఈ సందర్భంగా వివరించారు. 


లాభాలెన్నో..

పొగాకుని ఐరన్‌ ట్రేలలో ఉంచి క్యూరింగ్‌ చేయటం వల్ల 50శాతం కూలీల అవసరం తగ్గుతుంది

రెండింతల వర్జీనియా పొగాకుని క్యూరింగ్‌ చేయవచ్చు

స్థలం కూడా చాలా తక్కువ అవసరం పడుతుంది. ఐదరు వందల చదరపు గదులు సరిపోతుంది.

క్యూరింగ్‌ పూర్తయిన నాలుగైదు గంటల్లో పైనుంచి నీరు స్ర్పే చేసి సరైన పదును అందించి అన్‌లోడ్‌ చేసుకుని మండె వేసుకోవచ్చు.

ఆకు లోడింగ్‌, అన్‌ లోడింగ్‌కి కూడా 50శాతం కూలీల అవసరం తగ్గుతుంది

క్యూరింగ్‌కి కర్ర వినియోగం కూడా సగానికి సగం తగ్గుతుంది

ఆకు అల్లకపోవటం, సరైన పదునులో ఆకుని దించటం వల్ల చూర ఉత్పత్తి తగ్గి ఆకు వృథా తగ్గి రైతుకి ఆదాయం వస్తుంది

పూర్తిస్థాయి సామర్థ్యంతో క్యూరింగ్‌ చేస్తే సీజన్‌కి రైతు రూ.లక్ష వరకు ఆదా చేసుకోవచ్చు 


ఇబ్బందులు ఉన్నాయి..

ఈ మెటాలిక్‌ బ్యారన్‌ ఏర్పాటుకి రూ.10లక్షల వరకు ఖర్చవుతుంది.

ప్రస్తుతం ప్రయోగాత్మకంగా ఏర్పాటుచేసిన బ్యారన్‌కి పొగాకు బోర్డు, ఐటీసీ, జీపీఐ లాంటి సంస్థలు ఆర్థిక సహాయం అందించినప్పటికీ మిగిలిన రైతులకు అలాంటి ప్రోత్సాహం లభిస్తుందన్న గ్యారంటీ లేదు. బోర్డు ద్వారా, కేంద్ర రాష్ట్రప్రభుత్వాలు అమలుచేస్తున్న వ్యవసాయ యాంత్రీకరణ  పథకాల ద్వారా రైతుకి లబ్ది చేకూరేలా ప్రయత్నిస్తామని బోర్డు ఛైర్మన్‌ ప్రకటించినప్పటికీ ఆచరణ లోకి రావటం ఆలస్యం కావచ్చు.

పొగాకు క్యూరింగ్‌ సమయంలో నిరంతరంగా ఫ్యాన్లు పనిచేయాల్సి ఉన్నందున విద్యుత్‌ సదుపాయం తప్పనిసరి, విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడితే ఇబ్బందిలేకుండా జనరేటర్‌ కూడా ఏర్పాటు చేసుకోవాల్సి ఉంది.


నిర్మాణ వ్యయం తగ్గితే రైతుకు ఉపయోగం :


మెటాలిక్‌ బ్యారన్‌తో పొగాకు రైతు ఎంతో మేలు. అయితే దీని నిర్మాణ వ్యయం రూ.10లక్షల దాటుతోంది. సామాన్య రైతులు భరించలేని పరిస్థితి. మెటాలిక్‌ మెటీరియల్‌ మార్పు చేయడం, ఇతరత్రా అవకాశం ఉన్న మేర నిర్మాణ వ్యయం తగ్గించగలిగితే రైతులు ఈ బ్యారన్ల నిర్మాణానికి ముందుకొస్తారు. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు అమలు చేస్తున్న వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో దీనిని భాగం చేయాలి. బోర్డు కూడా నిర్మాణానికి సహాయపడాలి.

- జీ.శివారెడ్డి, పొగాకు రైతు, బోర్డు వైస్‌ చైర్మన్‌



Updated Date - 2021-02-26T05:23:42+05:30 IST