నేడే అమీ.. తుమీ

ABN , First Publish Date - 2021-04-01T07:43:31+05:30 IST

పశ్చిమ బెంగాల్‌ రాజకీయ భవిష్యత్‌ను తేల్చే కీలక సంగ్రామానికి సర్వం సిద్ధమయ్యింది. ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత

నేడే అమీ.. తుమీ

  • నందిగ్రామ్‌ విజేత ఎవరు?
  • బెంగాల్‌ భవితను తేల్చే రెండో దశ

కోల్‌కతా, మార్చి 31: పశ్చిమ బెంగాల్‌ రాజకీయ భవిష్యత్‌ను తేల్చే కీలక సంగ్రామానికి సర్వం సిద్ధమయ్యింది. ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత మమతా బెనర్జీ పోటీచేస్తున్న నందిగ్రామ్‌తో పాటు మరో 29 నియోజవర్గాల్లో ఈ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం ఆరుగంటల దాకా పోలింగ్‌ జరగనుంది.


తూర్పు, పశ్చిమ మిడ్నపూర్‌, దక్షిణ 24 పరగణాలు, బంకురా జిల్లాల్లో విస్తరించి ఉన్న ఈ నియోజవర్గాల్లోని మొత్తం 10,620 పోలింగ్‌ స్థానాలూ సమస్యాత్మకమైనవిగా ఎలక్షన్‌ కమిషన్‌ ప్రకటించడం చూస్తే పరిస్థితులు ఎంత ఉద్రిక్తంగా ఉన్నాయో అర్థమవుతుంది. మొత్తం 646 కంపెనీల కేంద్ర బలగాలు కేవలం ఈ 30 నియోజకవర్గాల్లో బందోబ్‌స్తకే దింపారు.




బెంగాల్లో మమత రాజకీయ ఉత్థానానికి కారణమైన ప్రదేశం నందిగ్రామ్‌! మూడోసారి అధికారంలోకి రావాలన్న గట్టి ప్రయత్నంలో ఉన్న మమతకు నందిగ్రామ్‌లోనే పెనుసవాల్‌ ఎదురవుతున్న విషయం తెలిసిందే. సుదీర్ఘకాలం ఆమెకు ముఖ్య అనుచరుడిగా మసలిన, ఈ ప్రాంతంలో విశేష ప్రాబల్యమున్న సువేందు అధికారి ఆమెకు ప్రత్యర్థిగా మారి, బీజేపీ తరఫున బరిలో నిలిచారు. 2016లో 62 శాతం ఓట్లతో నెగ్గిన అధికారి మమతకు ముచ్చెమటలు పోయిస్తున్నట్లు క్షేత్రస్థాయి నివేదికలు చెబుతున్నాయి. మమత ఆమె ఆధారపడుతున్నది ఎక్కువగా ముస్లిం ఓట్లపైన... అయితే గతంలో మాదిరి అవి గుండగుత్తగా ఆమెకు పడే సూచనల్లేవు.


అటు కాంగ్రెస్‌- లెఫ్ట్‌, ఒవైసీ, ఇంకోవైపు అబ్బాస్‌ సిద్దిఖీ నేతృత్వంలోని ఐఎ్‌సఎఫ్‌... వీటితో టీఎంసీ ఈ ఓట్లను పంచుకోవాలి.  కేవలం ముస్లిం ఓట్‌బ్యాంక్‌నే నమ్ముకుంటే కుదరదని నిర్ణయించుకున్న మమత.. మొక్కని దేవుడంటూ లేదు. నేను హిందువుని అని పరోక్షంగా తెలియపరుస్తూ తన గోత్రం పేరు (శాండిల్య)ను కూడా ఆమె సభల్లో వినిపించారు. దీనిని బీజేపీ అవహేళన చేసింది. ‘ఓ పక్క ఆమె గోత్రం పేరు చెబుతారు. మరోపక్క జై శ్రీరామ్‌ అనడాన్ని వ్యతిరేకిస్తారు. గతంలో రాహుల్‌ కూడా ఇలానే గోత్రాన్ని చెప్పుకుని ఎన్నికల్లో ఓడిపోయారు’’ అని కేంద్ర మంత్రి జావడేకర్‌ ఎద్దేవా చేశారు. మమత దీన్ని కౌంటర్‌ చేశారు.


‘ఓ కోవెలకు వెళ్లినపుడు పూజారి అడిగారు ఏ గోత్రమని... నేను మా, మాటీ, మను ష్‌... అని చెప్పాను’ అని వివరించారు. సువేందు అధికారికి కూడా ఈ పోరాటం రాజకీయంగా జీవన్మరణ సమస్య. మధ్యప్రదేశ్‌లో జ్యోతిరాదిత్య సిందియాకు ఇచ్చిన గౌరవాన్ని బీజేపీ బెంగాల్లో సువేందుకిచ్చింది. సింధియా మాదిరిగా సువేందు ఈ ప్రాంతంలో తన పలుకుబడితో బీజేపీ అత్యధిక సీట్లు గెలుచుకోవడానికి దారులు వేయాలన్నది అంతర్గతంగా ఒప్పందం. దీనికి ముందు నందిగ్రామ్‌లో ఆయన మమతను ఓడించాలి కూడా!


ఈ ప్రయత్నంలో ఓడితే ఆయన రాజకీయ భవితకు పెద్ద ఫుల్‌స్టాప్‌ పడుతుంది. ఒకవేళ గెలిచారా... బెంగాల్‌ బీజేపీ నేతల్లో అత్యంత ప్రభావశీల నేతగా ఆవిర్భవిస్తారు. సీఎం పదవి వరించినా ఆశ్చర్యపోనక్కరలేదు. ఈ దఫా పోలింగ్‌ జరిగే అనేకసీట్లు వ్యవసాయ ప్రాంతాలు. గ్రామీణ స్థాయిలో ఇప్పటికీ మమతకు ఆదరణ ఉంది. నిరుద్యోగం, ఓబీసీ జాబితాలో హిందూ వెనుకబడ్డ కులాలను చేర్చకపోవడం, అస్తిత్వవాదం, బెంగాలీ జాతీయవాదం.. ఈ ఎన్నికల్లో కీలకాంశాలు. 



Updated Date - 2021-04-01T07:43:31+05:30 IST