నేడే టీకా

ABN , First Publish Date - 2021-01-16T05:34:02+05:30 IST

కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమం శనివారం నుంచి ప్రారంభం కానుంది. అందుకోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసింది. తొలి విడత 24వేల మంది వైద్య, ఆరోగ్య సిబ్బందికి టీకా వేయనున్నారు. అందుకోసం జిల్లావ్యాప్తంగా 22 కేంద్రాలను ఎంపిక చేశారు. అక్కడికి బుధవారమే ప్రత్యేక వాహనాల్లో వ్యాక్సిన్‌ను తరలించారు.

నేడే టీకా
కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న కలెక్టర్‌ పోలా భాస్కర్‌


తొలివిడత కొవిడ్‌ 

వ్యాక్సినేషన్‌ అంతా సిద్ధం

22 కేంద్రాల్లో ఏర్పాట్లు 

24వేల మంది ఎంపిక

ఒంగోలు రిమ్స్‌, బాలాజీనగర్‌లో 

లాంఛనంగా ప్రారంభం 

జిల్లాకు వచ్చిన 3100 వయల్స్‌


ఒంగోలు (కలెక్టరేట్‌), జనవరి 15 : కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమం శనివారం నుంచి ప్రారంభం కానుంది. అందుకోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసింది. తొలి విడత 24వేల మంది వైద్య, ఆరోగ్య సిబ్బందికి టీకా వేయనున్నారు. అందుకోసం జిల్లావ్యాప్తంగా 22 కేంద్రాలను ఎంపిక చేశారు. అక్కడికి బుధవారమే ప్రత్యేక వాహనాల్లో వ్యాక్సిన్‌ను తరలించారు. 


27వేల మందికి సరిపడా వయల్స్‌ 

జిల్లాకు ప్రభుత్వం 3100 వయల్స్‌ను పంపింది. వీటితో 27వేల మందికి టీకా వేసే అవకాశం ఉంది. ప్రస్తుతం అధికారులు 24వేల మందిని మాత్రమే గుర్తించారు. దీంతో అదనంగా మరో 2వేల మందిని గుర్తించి టీకా వేయాలని కలెక్టర్‌ భాస్కర్‌ ఆదేశించారు. 


నేడు రిమ్స్‌లో ప్రారంభం

ఒంగోలులోని రిమ్స్‌లో శనివారం ఉదయం 9గంటలకు ఈ వ్యాక్సినేషన్‌ ప్రక్రియను ప్రారంభించేందుకు అధికారులు అంతా సిద్ధంచేశారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఎంపిక చేసిన సిబ్బందికి వ్యాక్సినేషన్‌ వేసిన అనంతరం పరిశీలనలో ఉంచేందుకు ప్రత్యేక గదులను  కూడా ఏర్పాటు చేశారు. వ్యాక్సినేషన్‌ కేంద్రాల వద్ద   108 అంబులెన్స్‌తోపాటు, ప్రత్యేకంగా వైద్యులను కూడా నియమించారు. మరోవైపు ఆయా కేంద్రాల వద్ద పర్యవేక్షణ బాధ్యతలను పలుశాఖల అధికారులకు అప్పగించారు.  


జూమ్‌ యాప్‌ ద్వారా కలెక్టర్‌ సమీక్ష

వ్యాక్సినేషన్‌పై కలెక్టర్‌ పోలా భాస్కర్‌ శుక్రవారం సాయంత్రం వైద్య, ఆరోగ్యశాఖాధికారులు, రిమ్స్‌, పీహెచ్‌సీల వైద్యులతోపాటు, పలు కీలక శాఖల అధికారులతో జూమ్‌ యాప్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. వ్యాక్సినేషన్‌కు ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులను కలెక్టర్‌ ఆదేశించారు.  వీడియో కాన్ఫరెన్స్‌లో జాయింట్‌ కలెక్టర్‌ టీఎస్‌ చేతన్‌, డీఎంహెచ్‌వో డాక్టర్‌ రత్నావళితోపాటు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-01-16T05:34:02+05:30 IST