నాడు గోదావరి నేడు కృష్ణా ఝరి!

ABN , First Publish Date - 2021-04-07T07:25:47+05:30 IST

అప్పుడెప్పుడో... గోదావరి తీరం నుంచి కోకా సుబ్బారావు! ఇప్పుడు... కృష్ణా జిల్లాకు చెందిన జస్టిస్‌

నాడు గోదావరి నేడు కృష్ణా ఝరి!

  •  తొలి తెలుగు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ కోకా సుబ్బారావు
  •  రాజమహేంద్రిలో న్యాయవాదుల కుటుంబంలో జననం
  •  ఆంధ్ర రాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు సీజేగా సేవలు
  •  భారత సీజే పదవి వదులుకుని రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ

అప్పుడెప్పుడో... గోదావరి తీరం నుంచి కోకా సుబ్బారావు! ఇప్పుడు... కృష్ణా జిల్లాకు చెందిన జస్టిస్‌ ఎన్వీ రమణ! భారత ప్రధాన న్యాయమూర్తులుగా నియమితులైన తెలుగు వారు వీరిద్దరే! అయితే... జస్టిస్‌ కోకా సుబ్బారావు సుప్రసిద్ధ న్యాయవాద కుటుంబానికి చెందిన వారు. జస్టిస్‌ రమణ కుటుంబంలో ఎవ్వరికీ న్యాయవాద నేపథ్యమే లేదు. పైగా... ఆయనది దిగువ మధ్య తరగతి రైతు కుటుంబం! సుప్రీం చీఫ్‌ జస్టిస్‌గా  జస్టిస్‌ రమణ నియామకం నేపథ్యంలో... జస్టిస్‌ కోకా సుబ్బారావును తెలుగు వారంతా గుర్తుకు తెచ్చుకుంటున్నారు.


(రాజమహేంద్రవరం/న్యూఢిల్లీ - ఆంధ్రజ్యోతి)

కోకా సుబ్బారావు రాజమహేంద్రవరంలో 1902 జూలై 15న విద్యావంతుల కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి సుబ్రహ్మణ్యేశ్వరనాయుడు ప్రముఖ న్యాయవాది. మామయ్య పి.వెంకట రమణారావు కూడా న్యాయవాదే. ఆయన ప్రకాశం పంతులు వద్ద జూనియర్‌గా ప్రాక్టీసు చేసి తర్వాత మద్రాస్‌ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. తండ్రి, మామల పంథాలోనే సుబ్బారావు కూడా నడిచారు. మద్రాసు లా కాలేజీలో న్యాయ శాస్త్రం చదివారు. రాజమండ్రిలో న్యాయవాదిగా ప్రాక్టీసు చేశారు. ఆ తర్వాత మద్రాసు హైకోర్టులోన్యాయమూర్తి అయ్యారు.


1953లో ఆంధ్ర రాష్ట్రం ఆవిర్భవించి... గుంటూరులో హైకోర్టు ఏర్పడినప్పుడు ప్రకాశం పంతులు పట్టుపట్టి మరీ జస్టిస్‌ కోకా సుబ్బారావు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యేలా చేశారు. 1956లో  హైదరాబాద్‌లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుకు తొలి ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగారు. 1958లో సుప్రీంకోర్టు జడ్జిగా నియమితులయ్యారు. 1966 జూన్‌ 30 సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయ్యారు. తెలుగు వాడికి అత్యున్నత స్థానం దక్కడం అదే మొదటిసారి.


అయితే... 1967లో ఆయన తన పదవికి రాజీనామా చేశారు. నాలుగో రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల అభ్యర్థిగా బరిలో నిలిచారు. కాంగ్రెస్‌ అభ్యర్థి జాకీర్‌ హుస్సేన్‌ చేతిలో ఓడిపోయారు. కోకా సుబ్బారావు 1976 మే 6న బెంగళూరులో తుదిశ్వాస విడిచారు. జస్టిస్‌ కోకా సుబ్బారావు నివాసం రాజమండ్రిలోని ఉల్లితోటవారి వీధిలో ఏనుగుల బొమ్మల సందులో ఉండేది. ఇప్పుడు ఆయన కుటుంబానికి సంబంధించిన వారెవరూ ఇక్కడ లేరు. 



ఎందరో తెలుగు వారు... 

జస్టిస్‌ కోకా సుబ్బారావు తర్వాత అనేకమంది తెలుగు వారు సుప్రీంకోర్టు న్యాయమూర్తులయ్యారు. వారిలో జస్టిస్‌ పెన్మెత్స సత్యనారాయణ రాజు, జస్టిస్‌ పి.జగన్మోహన్‌ రెడ్డి, జస్టిస్‌ ఓ. చిన్నప్ప రెడ్డి, జస్టిస్‌ కె. జయచంద్రారెడ్డి, జస్టిస్‌ బి.పి. జీవన్‌ రెడ్డి, జస్టిస్‌ ఎం.జగన్నాథ రావు, జస్టిస్‌ పి. వెంకటరామ రెడ్డి, జస్టిస్‌ బి. సుదర్శన్‌ రెడ్డి, జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌ తదితరులు ఉన్నారు. వీరిలో ఎవరికీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయ్యే అవకాశం దక్కలేదు.


ప్రస్తుతం సుప్రీంకోర్టులో జస్టిస్‌ ఎన్వీ రమణకాక జస్టిస్‌ లావు నాగేశ్వరరావు, జస్టిస్‌ ఆర్‌. సుభాష్‌ రెడ్డి న్యాయమూర్తులుగా ఉన్నారు. 2022 జూన్‌లో జస్టిస్‌ లావు నాగేశ్వరరావు, 2022 జనవరిలో జస్టిస్‌ సుభాష్‌ రెడ్డి పదవీ విరమణ చేస్తారు. అందువల్ల వారికి ప్రధాన న్యాయమూర్తి పదవి దక్కే అవకాశాలు లేవు. వెరసి... జస్టిస్‌ రమణ తర్వాత మరో తెలుగు వాడు భారత ప్రధాన న్యాయమూర్తి అయ్యే అవకాశాలు సమీప భవిష్యత్తులో లేవని చెప్పవచ్చు.


Updated Date - 2021-04-07T07:25:47+05:30 IST