నేడు 324 కేంద్రాల్లో టీకాలు

ABN , First Publish Date - 2021-01-18T08:01:25+05:30 IST

రాష్ట్రంలో కొవిడ్‌ టీకా కేంద్రాల, లబ్ధిదారుల సంఖ్య పెంచాలని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది. తొలి రోజు టీకా కార్యక్రమం ఎలాంటి ఇబ్బందులూ లేకుండా సజావుగా సాగడం, వ్యాక్సిన్‌ తీసుకున్న 24 గంటల

నేడు 324 కేంద్రాల్లో టీకాలు

ప్రతి కేంద్రంలో 50 మందికి చొప్పున

16200 మందికి వ్యాక్సిన్‌ వేసే ఏర్పాట్లు

టీకా తీసుకున్నవారిలో కనిపించని ఇబ్బందులు

జిల్లాల నుంచి నివేదికలందిన నేపథ్యంలో..

కేంద్రాల, లబ్ధిదార్ల సంఖ్య పెంచుతూ నిర్ణయం


హైదరాబాద్‌, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొవిడ్‌ టీకా కేంద్రాల, లబ్ధిదారుల సంఖ్య పెంచాలని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది. తొలి రోజు టీకా కార్యక్రమం ఎలాంటి ఇబ్బందులూ లేకుండా సజావుగా సాగడం, వ్యాక్సిన్‌ తీసుకున్న 24 గంటల తర్వాత కూడా ఎవరికీ ఎలాంటి అనారోగ్య సమస్యలూ లేకపోవడమే ఇందుకు కారణం. సోమవారం నిర్వహించాల్సిన టీకా కార్యక్రమంపై.. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు ఆదివారం సమీక్ష నిర్వహించారు. తొలి రోజు 140 కేంద్రాల్లో టీకా వేయగా.. సోమవారం వాటికి అదనంగా మరో 184 కేంద్రాల్లో.. అంటే, మొత్తం 324 కేంద్రాల్లో టీకాలు వేయాలని ఈ భేటీలో నిర్ణయించారు. అలాగే మొదటి రోజు ఒక్కో కేంద్రంలో 30 మందికే ఇవ్వగా.. ఆ సంఖ్యను 50కి పెంచారు. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా 324 కేంద్రాల్లో 16200 మందికి సోమవారంనాడు టీకాలు ఇచ్చేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదలచేశారు. ఆ మార్గదర్శకాల ప్రకారం..

  • జనవరి 16న ప్రారంభమైన కేంద్రాలను సోమవారం కూడా కంటిన్యూ చేయాలి. చివరి లబ్ధిదారునికి టీకా చేరేవరకు ఆయా కేంద్రాలను కొనసాగించాలి.
  • ప్రతి జిల్లాల్లో కొత్తగా ఇతర చోట్ల కూడా టీకా కేంద్రాలను గుర్తించాలి. ఇవన్నీ కూడా పెద్దగా, విశాలంగా ఉండే ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. 
  • బోధనాస్పత్రులు, జిల్లా, ఏరియా ఆస్పత్రుల్లో టీకా కేంద్రాలు ఉండేలా చూసుకోవాలి. అవసరమైతే పీహెచ్‌సీల్లో కూడా ఏర్పాట్లు చేసుకోవాలి.
  • పెద్దాస్పత్రుల్లో  కనీసం నాలుగు కేంద్రాలు ఉండేలా చూసుకోవాలి.
  • కొత్త టీకా కేంద్రాలకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా జనవరి 17 వరకే జరిగిపోవాలి. 
  • జిల్లాల్లో సోమవారం నిర్వహించే టీకా కార్యక్రమ ప్రణాళికను డీఎంహెచ్‌వోలు విధిగా ప్రజారోగ్య సంచాలకుడికి పంపాలి. 


హైదరాబాద్‌లో అత్యధికం

వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయంతో 30 జిల్లాల్లో వ్యాక్సిన్‌ కేంద్రాలు పెరగనున్నాయి. హైదరాబాద్‌లో తొలి రోజు 14 కేంద్రాలుండగా.. సోమవారం మరో 28 కేంద్రాల్లో టీకా వేయనున్నారు. అంటే మొత్తం 42 చోట్ల వ్యాక్సినేషన్‌ జరుగుతుంది. గ్రేటర్‌ హైదరాబాద్‌ (హైదరాబాద్‌(42)+ రంగారెడ్డి (14)+ మేడ్చల్‌ (59)) పరిధిలో అయితే.. కేంద్రాల సంఖ్య 34నుంచి ఏకంగా 115కి పెరగనుంది. ఇక.. హైదరాబాద్‌ తర్వాత అత్యధికంగా సోమవారం నల్గొండలో 18 కేంద్రాల్లో టీకాలు వేయనున్నారు. అక్కడ తొలి రోజు మూడే కేంద్రాలుండగా, ఆ సంఖ్యను 18కి పెంచారు. మేడ్చల్‌ జిల్లాల్లో మాత్రం మొదటి రోజున ఉన్న 11 కేంద్రాలే ఉన్నాయి. సిరిసిల్ల, యాదాద్రిభువనగిరి జిల్లాల్లో కూడా తొలి రోజు ఉన్న కేంద్రాలనే కొనసాగిస్తున్నారు. పెద్దపల్లి, గద్వాల, నారాయణపేట్‌, వనపర్తి జిల్లాల్లో అదనంగా ఒక్క కేంద్రాన్ని మాత్రమే పెంచారు.


జిల్లాల నుంచి నివేదికలు

వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ తొలిరోజున తెలంగాణ వ్యాప్తంగా 140 కేంద్రాల్లో 3962 మంది కొవిషీల్డ్‌ టీకాలు తీసుకున్నారు. తొలి రోజు 11 మందికి చిన్నపాటి అనారోగ్య సమస్యలు తలెత్తగా.. వారికి అక్కడే వైద్య సిబ్బంది చికిత్స అందించారు. టీకా తీసుకున్న 24 గంటల తర్వాత ఎవరికైనా ఏవైనా అనారోగ్య సమస్యలు తలెత్తాయా అన్న అంశంపై ఆదివారం అన్ని జిల్లాల నుంచి వైద్య ఆరోగ్యశాఖ వివరాలు తెప్పించుకుంది. ఏ జిల్లాలోనూ ఎవరికీ అనారోగ్య సమస్యలు తలెత్తలేదని జిల్లాల నుంచి వైద్యాధికారులు నివేదికలు పంపారు.


ఒకే చోట 3, 4 కేంద్రాలు..

హైదరాబాద్‌లోని గాంధీ, ఉస్మానియా, నిమ్స్‌లో సోమవారంనుంచి నాలుగేసి.. నిలోఫర్‌లో మూడు.. ఫీవర్‌, పేట్లబురుజు, సుల్తాన్‌బజార్‌ ఆస్పత్రుల్లో రెం డేసి టీకా కేంద్రాలు అందుబాటులోకి రానున్నాయి.


సోమ, మంగళ, గురు శుక్రవారాల్లోనే..

తెలంగాణలో సోమ, మంగళ, గురు, శుక్రవారాల్లోనే రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్‌ ఉంటుందని, బుధ, శనివారాల్లో సాధారణ వైద్యసేవలు, టీకాల కార్యక్రమం ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించుకుందని కేంద్రం వెల్లడించింది. ఆదివారం ఎటువంటి కార్యక్రమం నిర్వహించట్లేదు. 

Updated Date - 2021-01-18T08:01:25+05:30 IST