నేడే రంజాన్‌

ABN , First Publish Date - 2021-05-14T07:49:05+05:30 IST

దేశవ్యాప్తంగా ముస్లింలు శుక్రవారం రంజాన్‌ పండుగను చేసుకోనున్నారు. 30 రోజుల ఉపవాస దీక్షల అనంతరం ఈ దఫా ఇళ్లలోనే రంజాన్‌ ప్రార్థనలు జరగనున్నాయి

నేడే రంజాన్‌

ఇళ్లల్లోనే జరగనున్న ప్రార్థనలు 

ఇఫ్తార్‌లు లేని దీక్షలు తొలిసారి 

ముఖ్యమంత్రి కేసీఆర్‌, గవర్నర్‌ తమిళిసై శుభాకాంక్షలు


హైదరాబాద్‌, మే 13 (ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా ముస్లింలు శుక్రవారం రంజాన్‌ పండుగను చేసుకోనున్నారు. 30 రోజుల ఉపవాస దీక్షల అనంతరం ఈ దఫా ఇళ్లలోనే రంజాన్‌ ప్రార్థనలు జరగనున్నాయి. ఈద్గాలు, మసీదుల్లో ప్రార్థనలు చేసుకోవడానికి వీల్లేదని ఇప్పటికే తెలంగాణ వక్ఫ్‌బోర్డు స్పష్టం చేసింది. దాంతో ఇళ్లలోనే ప్రార్థనలు జరుగనున్నాయి. వందేళ్లలో ఒక్క ఇఫ్తార్‌ విందు లేకుండా ఉపవాస దీక్షలు ముగియడం ఇదే తొలిసారి. గతేడాది కరోనా నిబంధనలకు లోబడి ఇఫ్తార్‌ విందులు జరగగా... ఈసారి ఒక్క ఇఫ్తార్‌ లేకుండానే ఉపవాస దీక్షలు పూర్తయ్యాయి. కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉండడంతో ఏటా ఆనవాయితీగా నిర్వహించే ఇఫ్తార్‌ విందులకు రాష్ట్ర ప్రభుత్వం, గవర్నర్‌ కూడా దూరంగా ఉన్నారు. మరోవైపు రంజాన్‌ పండుగ సందర్భంగా ముస్లింలకు గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందరరాజన్‌ శుభాకాంక్షలు తెలిపారు. దానధర్మాలు, సోదరభావం, కరుణ, ప్రేమ, శాంతికి రంజాన్‌ సూచిక అని  ఆమె గుర్తుచేశారు. కరోనా నిబంధనలకు లోబడి పండుగ చేసుకోవాలని కోరారు. రంజాన్‌ పర్వదినం సందర్భంగా ముస్లింలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఉపవాస దీక్షలతో రంజాన్‌ మాసం శాంతి, ప్రేమ, దయ సౌభ్రాతృత్వ గుణాలను పంచుతుందని, తెలంగాణలో గంగా జమునా తహజీబ్‌కు రంజాన్‌ పర్వదినం ప్రతీక  అన్నారు. కాగా, బసవేశ్వరుని జయంతి సందర్భంగా వీరశైవ లింగాయత్‌లకు సీఎం కేసీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. మనుషుల నడుమ అసమానతలనుపెంచే కుల, వర్ణ, లింగ వివక్షతలను వ్యతిరేకించిన బసవేశ్వరుడు అభ్యుదయవాదిగా, పాలనాదక్షుడుగా నాటికాలంలో పేరొందారన్నారు. లింగాయత్‌ల సంక్షేమం కోసం కృషి చేస్తామని పేర్కొన్నారు. 

Updated Date - 2021-05-14T07:49:05+05:30 IST