నేడే సింహాద్రి అప్పన్న చందనోత్సవం

ABN , First Publish Date - 2021-05-14T05:17:17+05:30 IST

కరోనా నేపథ్యంలో వరుసగా రెండో ఏడాది కూడా వరాహ లక్ష్మీనృసింహస్వామి నిజరూపాన్ని దర్శించుకునే భాగ్యం భక్తులకు లభించని పరిస్థితులు నెలకొన్నాయి.

నేడే సింహాద్రి అప్పన్న చందనోత్సవం

కరోనా నేపథ్యంలో పరిమిత వైదిక సిబ్బందితో ఉత్సవ నిర్వాహణ

వరుసగా రెండో ఏడాది భక్తులకు లభించని నిజరూప దర్శనం 


సింహాచలం, మే 13: కరోనా నేపథ్యంలో వరుసగా రెండో ఏడాది కూడా వరాహ లక్ష్మీనృసింహస్వామి నిజరూపాన్ని దర్శించుకునే భాగ్యం భక్తులకు లభించని పరిస్థితులు నెలకొన్నాయి. శుక్రవారం సింహాద్రి నాథుని చందనోత్సవాన్ని పరిమిత సంఖ్యలో ఆలయ వైదిక సిబ్బందితో నిర్వహించాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణంగా ఈఓ సూర్యకళ స్వీయ పర్యవేక్షణలో అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఈఓ విడుదల చేసిన పత్రికా ప్రకటన ప్రకారం పాలక మండలి చైర్‌పర్సన్‌ సంచయిత తప్ప పాలక మండలి సభ్యులు లేదా ఇతర రాజకీయ, అధికార ప్రముఖులు ఎవరినీ అనుమతించరు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సహకారాన్ని అందించాల్సిందిగా ఈఓ కోరారు. ఆమె పేర్కొన్న వివరాల ప్రకారం...శుక్రవారం తెల్లవారుజామున మూడు గంటలకు సుప్రభాత సేవతో స్వామిని మేల్కొలిపి విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనము, రుత్విక్వరుణము జరిపిన అనంతరం వేదమంత్రోచ్ఛారణలు, నాదస్వరాలాపనల నడుమ చందనోత్సవాన్ని సంప్రదాయం ప్రకారం జరుపుతారు. చందన ఒలుపు తర్వాత స్వామి హృదయం, శిరస్సులపై చందనపు ముద్దలను ఉంచుతారు. ఆలయ ఆచారం ప్రకారం ఉదయం 6 నుంచి 6.30 గంటల నడుమ అనువంశిక ధర్మకర్తలైన పూసపాటి వంశీయులు, ధర్మకర్తల మండలి చైర్‌పర్సన్‌ సంచయితకు తొలిదర్శనం కల్పిస్తారు. స్వామి వారికి ప్రభుత్వం తరపున ఉదయం 6.30 గంటల నుంచి 7 గంటల నడుమ రాష్ట్ర పర్యాటక, యువజన సర్వీసులు, సాంస్కృతిక శాఖా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పట్టు వస్త్రాలను సమర్పిస్తారు. రాత్రి 7 నుంచి 8 గంటల నడుమ శ్రీవైౖష్ణవ సిబ్బందితో సంప్రదాయబద్ధంగా సహస్ర ఘటాభిషేకాన్ని నిర్వహిస్తారు. అనంతరం ప్రత్యేక ఆరాధనలు జరిపి మూడు మణుగుల చందనాన్ని తొలివిడతగా స్వామికి సమర్పిస్తారు. ప్రజా ప్రతినిధులు, పాలక మండలి సభ్యులు, అధికారులను, మీడియా ప్రతినిధులను నిజరూప దర్శనానికి అనుమతించే ప్రసక్తే లేదని ఆలయ అధికారులు ప్రకటించారు. ఇదిలావుండగా అడివివరం గ్రామానికి చెందిన పలువురు వృద్ధులు, దేవస్థానం విశ్రాంత ఉద్యోగులు స్వామి వారి నిజరూప దర్శనం కలగపోవడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆలయ చరిత్రలోనే ఇటువంటి పరిస్థితి రెండవ ఏడాది కూడా రావడం చాలా దురదృష్టకరమన్నారు.

Updated Date - 2021-05-14T05:17:17+05:30 IST