జన మనోభిరాముడు!

ABN , First Publish Date - 2020-04-02T06:15:59+05:30 IST

శ్రీమద్రామాయణం మహా కావ్యంగా అవతరించిన వేదం. రామచంద్రుడు వేదాలు వెతికే ధర్మ స్వరూపం. రామాయణం మొత్తం అనుబంధాల కథ. తల్లితండ్రులకూ బిడ్డలకూ, అన్నదమ్ములకూ, ఆలుమగలకూ, స్నేహితులకూ

జన మనోభిరాముడు!

నేడు శ్రీరామ నవమి

పాలకులు పదవులతో కాదు, దర్పంతో కాదు, 

వంశ వారసత్వంతో కాదు...

అభిమానంతో.  ఆత్మీయతతో ముందు మనసులను గెలవాలనీ...

ఆ తరువాత మనుషులనూ పాలించాలని 

శ్రీరామకథ చాటి చెబుతుంది.


శ్రీమద్రామాయణం మహా కావ్యంగా అవతరించిన వేదం. రామచంద్రుడు వేదాలు వెతికే ధర్మ స్వరూపం. రామాయణం మొత్తం అనుబంధాల కథ. తల్లితండ్రులకూ బిడ్డలకూ, అన్నదమ్ములకూ, ఆలుమగలకూ, స్నేహితులకూ మధ్య ఉండే అనుబంధాలలోని తియ్యదనాన్నీ, మమకారాన్నీ యుగయుగాలకు వారసత్వంగా ఇచ్చింది. 


సాధారణంగా రాజుకూ, ప్రజలకూ మధ్య ఉండే బంధం ఏమిటనే విషయం గురించి చర్చ జరగదు. రాజుల ఇష్టానిష్టాలను ప్రజలు భరించక తప్పని పరిస్థితి. అలాంటిది ప్రజలే ప్రభువుని ఏరికోరి ఎంచుకొనే మహోజ్వల ఘట్టం అయోధ్య కాండలో తొలి సర్గలో కనిపిస్తుంది. 


మీ కోసం కాదు మా కోసం!

దశరథ మహారాజుకు వయోభారం కావడం వల్ల మునుపటి చురుకుదనం లేదు. రామచంద్రుణ్ణి గురించి మంచి మాటలు అడపాదడపా ఆయన చెవిన పడుతున్నాయి. రాముడు లోకాలు ఏలగల వీరుడైనా సౌమ్యంగా, శాంతంగా, గొప్ప నిగ్రహంగా ఉండేవాడు. రాజ్యంలో ఇంతమంది మనస్సుల్లో కొలువైన రాముణ్ణి చూచి దశరథుడు తండ్రిగా గర్వపడేవాడు. ఆనందపడేవాడు. రాజ్యభారం అప్పగించడానికి అదే తరుణమని భావించాడు. ఒక శుభ ముహూర్తంలో సామంతుల్ని, మంత్రుల్ని, అధికారుల్ని పిలిపించాడు. విశేషించి జన సమూహాలకు అత్యంత సన్నిహితంగా ఉండే పల్లెల నుంచి జానపదులను, పట్టణాల నుంచి పౌరులను పిలిపించాడు. 


నిండు సభను ఉద్దేశించి దశరథుడు మాట్లాడుతూ  ‘‘ఇక్ష్వాకు వంశీయులు అందరూ ప్రజల్ని కడుపున పుట్టిన బిడ్డల్లా సాకారు. కాపాడారు. వాళ్ల అడుగుజాడల్లో నేను నడిచి ఇన్నాళ్ళు రాజ్యభారం మోశాను. ఇప్పుడు వార్ధక్య భారం వల్ల కష్టంగా ఉంది. నా రాముడు శౌర్యవంతుడు. ఇంద్రియాలను జయించిన వాడు. మీ అందరి అనుమతితో పాలనా బాధ్యతలను అప్పజెప్పాలని అనుకుంటున్నాను. నా మాటల్లో స్వార్థం ఉండొచ్చు. మీరు స్వతంత్రంగా ఆలోచించండి. మీ నిర్ణయం శిరోధార్యం’’ అన్నాడు.


సభ మొత్తం హర్షధ్వానాలు మిన్నంటాయి. ‘‘మహారాజా! రామచంద్రమూర్తిని పట్టపుటేనుగు మీద శ్వేత ఛత్రం క్రింద ఒక మహారాజులా చూడాలని అనుకుంటున్నాం’’ అని అన్నారు యావన్మందీ.


‘‘ఇదేమిటి? నాకు ఎదురు చెప్పడం ఇష్టం లేక ఇలా అంటున్నారా? లేదా నా పరిపాలన మీద విసుగు వచ్చిందా? నిస్సంకోచంగా చెప్పండి’’ అని దశరథుడు అడిగాడు. 


‘‘రాముడి సద్గుణాలు తలుచుకుని మేమంతా పొంగి పోతాం. మళ్లీ మళ్లీ తలచుకుని పరవశించిపోతాం. ఆయన ప్రజలకు ఆనందం కలిగించడంలో చంద్రుడు. బుద్ధిలో బృహస్పతి. సత్య పరాక్రముడు. మాన్యులనైనా, సామాన్యులనైనా తానే ముందుగా నవ్వుతూ పలకరిస్తాడు. ఎవరికి దుఃఖం కలిగినా తాను కూడా దుఃఖపడతాడు. ఎవరి ఇంట సంతోషం నిండినా ‘కొడుకు పైకి రావడం చూసిన తండ్రిలా’ ఆనంద పడిపోతాడు. అందరితో ఆత్మీయంగా ఉంటాడు. వేద వేదాంగాలను క్షుణ్ణంగా చదువుకున్నాడు. గాంధర్వం, శిల్పం లాంటి కళలలో ఆయనకు స్వయంగా అభినివేశం ఉన్నది. మీకు తెలుసో తెలియదో మహారాజా! ఆయన రాజు కావాలని వృద్ధులు, స్త్రీలు... ఒక్కరేమిటి, ఆబాలగోపాలంు దేవతలకు మొక్కుకుంటున్నారు. మీ అభీష్టం కోసం ఆయన్ని రాజును చేస్తానని అంటున్నారు మేము మాత్రం మా అందరి కోసం పట్టాభిషేకం చేయించమంటున్నాం’’ అన్నారు పౌరులు, జానపదులు. 


దశరథుడి కళ్ళు ఆనందంతో నీటి చలమలు అయ్యాయి. ఈ సన్నివేశంలో రాజు కాకముందే ప్రజలతో మమేకమైన రాముడు కనిపిస్తాడు. అధికారం, దర్పం, హోదాలు ప్రదర్శించని నవ్వుతూ మాట్లాడే ఒక మంచి మనిషి కనిపిస్తాడు.  ప్రజల యోగ క్షేమాలలోనే రాజు యోగ క్షేమాలు ఉంటాయని గుర్తించిన తాత్త్వికుడు కనబడతాడు. 


చెట్లు కదలవు, పక్షులు తినవు!

ఇలాంటి ప్రస్తావన రామచంద్ర మూర్తి అడవికి వెళ్లే సమయంలో మళ్లీ వస్తుంది. రాముడు నగరం వదిలిన మరుక్షణం ద్విజులు అగ్నిహోత్రాలు ఆపేశారు. ప్రజలు పనులు మానేశారు. మావటి వాళ్ళు పెట్టిన ఆహారాన్ని ఏనుగులు కక్కేశాయి. రాముడి రథం వెళ్ళిన వైపు అయోధ్యలో పౌరులంతా బయలుదేరారు. 


‘‘మీరందరూ నా మీద ప్రేమాభిమానాలతో వస్తున్నారని తెలుసు. ఆ ప్రేమ భరతుడు మీద చూపండి. భరతుడు జ్ఞాన వృద్ధుడు, చక్కగా పాలించగలడు’’ అన్నాడు రాముడు. 


ఆ మాట విన్న ప్రజానీకం రాముని ధర్మ దీక్షతకు కన్నీరు మున్నీరు అయింది. వేద పండితులు అశ్వాల ముందు నిలిచి, ‘మీరు వెనక్కి మళ్ళి, రథాన్ని అయోధ్యకు తీసుకురమ్మ’ని  వేడుకున్నారు. ‘‘ఈ చెట్లు చూడవయ్యా... ఏడుస్తున్నాయి, నీ వెంబడి వచ్చేద్దామని చూస్తున్నాయి, వాటి వేళ్ళు వాటిని కదలనివ్వడం లేదు. చెట్ల మీద పక్షులు చూడవయ్యా ఆహారం మానేశాయి’’ అని చెప్పారు.  జనం ఎంత నచ్చజెప్పినా రాముడు వినడం లేదు.


సీతా రామక్ష్మణులు తమసా నది తీరానికి చేరుకున్నారు. వారిని. పౌరులు వెంబడిస్తూనే ఉన్నారు. అందరూ చెట్ల కింద రాత్రికి విశ్రాంతి తీసుకున్నారు.


‘‘రాజన్నవాడు ప్రజలకు బాధ కలిగితే తొలగించాలి. రాజే బాధకు కారణం కాకూడదు. వీళ్ళు మేలుకొనే లోపే తెల్లవారేటప్పటికీ వెళ్ళిపోదాం’’ అన్నాడు రాముడు, మనస్సు రాయి చేసుకొని.


పౌరులు నిద్రలేచారు తమ దురదృష్టాన్ని నిందించుకొన్నారు. ‘ఏం ముఖం పెట్టుకుని అయోధ్యకు వెళ్లాలి?’ అనుకున్నారు. కాళ్ళీడ్చుకుంటూ దుఃఖంతో అయోధ్య చేరారు. అయోధ్య నీళ్లు లేని సముద్రంలాగా ఉంది. చంద్రుడు లేని ఆకాశంలాగా ఉంది. ఏ ఇంట్లో అగ్ని హోత్రం లేదు. స్వాధ్యాయం లేదు. వర్తకులు అంగళ్లు తెరవలేదు. దేవాలయాలలో పూజా పునస్కారాలు లేవు. స్త్రీలు ‘ఏం ముఖం పెట్టుకుని తిరిగి వచ్చార’ని వచ్చిన వాళ్లను తిట్టారు. ‘‘రామయ్య పురుషులందరినీ, సీతమ్మ స్త్రీలందరినీ రక్షిస్తారు. రాముడు ఉన్నచోట అడవులు, పర్వతాలు, సరస్సులు అమృతానంద సంధాయకాలు అవుతాయి. రాముడు ఉన్నచోట పరాభవం ఉండదు. పదండి వెనక్కి వెళ్దాం, రాముణ్ణి వెతుక్కుంటూ...’’ అని స్త్రీలందరూ ముక్తకంఠంతో అన్నారు.


అయోధ్యలో దుఃఖం ఒక్కటే మిగిలింది. బెంగ పెట్టుకున్న ప్రజలు మిగిలారు. నగరమే విషాదంలో కూరుకుపోయింది. ఇదీ ప్రజల కోణం నుంచి రామ కథ. 


రాముడు- కౌసల్యా సుప్రజా రాముడు,  దశరథ రాముడు,  జానకి రాముడు మాత్రమే కాదు... సకల జన మనోభి రాముడు కూడా!  ప్రజల మనస్సుల్లో రాముడు ఎంత ఆత్మీయుడో ఈ రెండు సన్నివేశాలూ చెబుతాయి. 


అయోధ్యకాండ ఒకటి, రెండు సర్గలు చదివినవారు ఎవరైనా మంచి పరిపాలకులు అవుతారు.

 నందివెలుగు ముక్తేశ్వరరావు

Updated Date - 2020-04-02T06:15:59+05:30 IST