Abn logo
Sep 23 2021 @ 23:46PM

ఎంపీపీ.. పీఠము‘ఢీ’!

సుసరాంలో ప్లకార్డులతో నిరసన తెలియజేస్తున్న ఉరజాం ఎంపీటీసీ శారద, భూషణరావు తదితరులు

- నేడు మండల ప్రజా పరిషత్‌ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు

- అధికార పార్టీలో బయటపడుతున్న విభేదాలు

- పదవే లక్ష్యంగా ఆశావహుల ప్రయత్నాలు

- పెద్దల మాట సైతం వినని అసంతృప్తులు

(శ్రీకాకుళం-ఆంధ్రజ్యోతి)

మండల పరిషత్‌ అధ్యక్ష(ఎంపీపీ) పదవికి అభ్యర్థుల ఎంపిక అధికారపార్టీ నేతలకు తలనొప్పిగా పరిణమించింది. జిల్లాపరిషత్‌, మండల ప్రాదేశిక ఎన్నికలను టీడీపీ బహిష్కరించగా.. వైసీపీ మెజార్టీ స్థానాలను కైవసం చేసుకుంది. శుక్రవారం 38 మండల పరిషత్‌ల అధ్యక్షుల ఎంపిక జరగనుంది. పరిషత్‌ పోరులో వైసీపీకి అధిక స్థానాలు రావడంతో.. కొన్నిచోట్ల ఎంపీపీ ఎన్నిక లాంఛనప్రాయమే అయినప్పటికీ మరికొన్ని చోట్ల మాత్రం వివాదాస్పదం కానున్నాయి. కొంతమంది ఎంపీటీసీ సభ్యులు ఎంపీపీ పదవిపై ఆశలు పెట్టుకోగా, పెద్దలు మరొకరికి పదవి కట్టబెట్టేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికార పార్టీలో విభేదాలు బయటపడుతున్నాయి. పదవే లక్ష్యంగా పెద్దల మాట  సైతం వినకుండా.. అసంతృప్తులు ఆందోళనలు చేపడుతున్నారు. క్యాంపు రాజకీయాలు సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆశావహులకు సర్దిచెప్పి.. పీఠముడి విప్పేందుకు జిల్లా నేతలు నానా పాట్లు పడుతున్నారు. 

జిల్లాలో 667 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, 66 స్థానాలు అధికారపార్టీకి ఏకగ్రీవమయ్యాయి. మరో 11 చోట్ల అభ్యర్థులు మరణించారు. దీంతో 590 స్థానాల్లో ఎన్నికలు నిర్వహించారు. ఇందులో 588 మంది అభ్యర్థులు గెలుపొందారు. 495 స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంది. 81 స్థానాల్లో టీడీపీ గెలుపొందింది. బీజేపీ, జనసేన చెరో ఒక స్థానం, ఇండిపెండెంట్‌ అభ్యర్థులు పది స్థానాల్లో గెలుపొందారు. ఓట్లకు చెదలు పట్టడంతో.. ఆమదాలవలస మండలం కట్యాచారిపేట, మందస మండలం అంబుగాం ఎంపీటీసీ స్థానాల ఫలితాలు నిలిచిపోయాయి. ఈ రెండు స్థానాలకు త్వరలో రీపోలింగ్‌ నిర్వహించనున్న విషయం తెలిసిందే. కాగా,  పరిషత్‌ ఫలితాలు వెల్లడైనప్పటి నుంచి ఎంపీపీ అభ్యర్థుల ఎంపికలో వైసీపీ ముఖ్య నేతలు నిమగ్నమయ్యారు. అసమ్మతి నేతలతో చర్చలు సాగించి.. బుజ్జగింపు చర్యలు చేపడుతున్నారు. మరోవైపు పదవి కోసం ఆశావహులు ఎవరి ప్రయత్నాలు వారు సాగిస్తున్నారు. ఈ క్రమంలో అధికారపార్టీలో కొందరు నాయకులు ఎవరికివారు యమునా తీరు అన్నచందంగా వ్యవహరిస్తున్నారు. మంత్రుల మాటను సైతం లెక్క చేయకుండా కొందరు ఎంపీటీసీ సభ్యులు ఎంపీపీ పదవే లక్ష్యంగా ఆందోళన చేపడుతున్నారు. కొన్ని మండలాల్లో విప్‌ జారీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే  పోలాకి, ఎచ్చెర్ల, పొందూరు, నందిగాం మండలాల్లో ఎంపీటీసీ సభ్యులు రెండు వర్గాలుగా విడిపోయారు. ఫలితాలు వెల్లడైన దగ్గర నుంచి క్యాంపు రాజకీయాలు కొనసాగుతుండడంతో జిల్లా ముఖ్యనేతలు ఏం చేయలేని పరిస్థితి నెలకొంది. పోలాకిలో ఎంపీపీ పదవి కోసం తమ్మినేని భూషణరావు.. తన స్వగ్రామం సుసరాంలో అనుచరగణంతో టెంట్‌ వేసి మరీ మంత్రికి వ్యతిరేకంగా నిరసన వెల్లబుచ్చారు. నందిగాం, కోటబొమ్మాళి మండలాల్లో స్థానిక ఎమ్మెల్సీ దువ్వాడ విప్‌ జారీ చేశామని చెబుతున్నారు. నందిగాంలో 16 ఎంపీటీసీ స్థానాల్లో 13 మందితో ఒక వర్గం క్యాంపు నిర్వహిస్తోంది. కోటబొమ్మాళిలో ఇద్దరు నాయకుల మధ్య హోరాహోరీ పోటీ ఉంది. సంతబొమ్మాళి ఎంపీపీగా మత్స్యకార మహిళకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆ మండల వైసీపీ ఎంపీటీసీ సభ్యులు కోరుతున్నారు. పలు చోట్ల పార్టీని నమ్ముకొని పనిచేసిన కార్యకర్తలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఎంపీటీసీ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు. అధిష్ఠానం, జిల్లా నేతలు ఎవరికి ప్రాధాన్యమివ్వనున్నారో.. మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. 


 ఎచ్చెర్లలో చెరిసగం 

ఎచ్చెర్ల ఎంపీపీ పదవిని ఇద్దరు ఎంపీటీసీ సభ్యులకు చెరిసగం చేసేందుకు అంగీకారం కుదరినట్టు విజయనరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌ తెలిపారు. ఈ మేరకు  విలేకరులతో ఆయన గురువారం సాయంత్రం టెలీఫోన్‌లో మాట్లాడారు. ఫరీద్‌పేట ఎంపీటీసీ సభ్యుడు మొదలవలస చిరంజీవి మొదటి రెండున్నరేళ్లు,  కొంగరాం ఎంపీటీసీ సభ్యురాలు జరుగుళ్ల విజయకుమారి చివరి రెండున్నరేళ్లు ఎంపీపీగా వ్యవహరిస్తారని చెప్పారు. దీనికి ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్‌ కూడా అంగీకరించారన్నారు. దీంతో ఎంపీపీ ఎంపిక వివాదం పరిష్కారమైందన్నారు. 


డిప్యూటీ సీఎం మాటతప్పారు!

- ఎంపీపీ పదవిమాకే ఇవ్వాలి

- ఉరజాం ఎంపీటీసీ సభ్యురాలు నిరసన

సుసరాం(పోలాకి), సెప్టెంబరు 23: ‘ఎంపీపీ పీఠాన్ని తమకు కట్టబెడతామని గతంలో హామీ ఇచ్చిన డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌ ఇప్పుడు మాటతప్పారు’ అని ఉరజాం ఎంపీటీసీ సభ్యురాలు తమ్మినాన శారద, ఆమె భర్త తమ్మినాన భూషణరావు(పూర్వపు మండల పరిషత్‌ సలహాదారు)లు ఆవేదన వ్యక్తం చేశారు. ‘సీఎం సారూ! న్యాయం చేయాలి’ అని కోరుతూ గురువారం తన అనుచరగణంతో సుసరాంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేసి ఉదయం నుంచి సాయంత్రం వరకూ నిరసన వ్యక్తం చేశారు. ఇచ్చిన మాటకు కృష్ణదాస్‌ కట్టుబడి ఉండాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సుసరాం ఎంపీటీసీగా గెలుపొందితే తమకు పోలాకి ఎంపీపీ పదవిని ఇస్తామని ఎన్నికల ముందు డిప్యూటీ సీఎం కృష్ణదాస్‌ చెప్పారన్నారు. తీరా గెలుపొందిన తరువాత వేరే వ్యక్తికి అధ్యక్ష పదవి ఇస్తున్నట్టు సామాజిక మాధ్యమాల్లో ప్రకటనలు ఇస్తున్నారని వాపోయారు. 48 గంటల వ్యవధిలోనే ఎంపీపీ పేరును మార్పు చేయడం దారుణమన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలని.. మాట తప్పని మడమతిప్పని నాయకత్వం కావాలని కోరారు. మా ఆవేదన ముఖ్యమంత్రికి తెలియాలనే ఈ నిరసనను శాంతియుతంగా నిర్వహిస్తున్నామని.. పార్టీని విడిచిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కాగా, ఎంపీపీ పీఠం కోసం డిప్యూటీ సీఎం కృష్ణదాస్‌కు వ్యతిరేకంగా వైసీపీ నాయకులు నిరసనకు దిగడం స్థానికంగా చర్చనీయాంశమైంది. వైసీపీలో వర్గవిభేదాలు బయటపడ్డాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.