Abn logo
Sep 27 2021 @ 01:00AM

నేడు భారత బంద్‌

భారత బంద్‌ను జయప్రదం చేయాలని సీపీఎం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహిస్తున్న దృశ్యం

బీజేపీయేతర పార్టీలు, ప్రజా సంఘాలు ఏకం

మూతపడనున్న ప్రభుత్వ, ప్రైవేట్‌, కార్పొరేట్‌ విద్యాసంస్థలు

వాణిజ్య సముదాయాలు కూడా...

మధ్యాహ్నం 2 గంటల వరకూ డిపోలకే ఆర్టీసీ బస్సులు పరిమితం

అనంతపురం, సెప్టెంబరు 26(ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ రైతు సంఘాలు సోమవారం భారత బం ద్‌ పాటించనున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాలోని బీజేపీయేతర పార్టీలు, కార్మిక, కర్షక, ప్రజా, విద్యార్థి సంఘాలు ఏకమయ్యాయి.  జిల్లాలో బంద్‌ ను విజయవంతం చేసేందుకు నేతలు సమాయత్తమయ్యారు. అధికార వైసీపీతో పాటు ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం, కాంగ్రెస్‌, జనసేన, వామపక్షాలు, వాటి అనుబంధ సంఘాల శ్రేణులు సోమవారం ఉదయం నుంచే రోడ్డెక్కేందుకు  సన్నద్ధమయ్యాయి. రైతు వ్యతిరేక చట్టాలు, విద్యుత రెగ్యులేటరీ బిల్లు రద్దు డిమాండ్‌తో పాటు ప్రైవేటీకరణ ఆపాలని, పెట్రోల్‌ డీజల్‌ రేట్లు తగ్గించాలన్నదే ఆ వర్గాల ప్రధాన డిమాండ్‌. ఆ మేరకు భారీ ర్యాలీలతో కేంద్ర ప్రభుత్వానికి నిరసన తెలపాలనే యోచనలో ఆయా రాజకీయ, ప్రజా సంఘాల నేతలు ఉన్నారు.  భారత బంద్‌ నేపథ్యంలో జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్‌, కార్పొరేట్‌ పాఠశాలలు, కళాశాలలతో పాటు వాణిజ్య సముదాయాలు మూతపడనున్నాయి. బంద్‌కు అన్ని వర్గాలు స్వచ్ఛందంగా సహకరించాలని ఇప్పటికే వామపక్షాలు విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే.  బంద్‌ను దృష్టిలో ఉంచుకొని జిల్లాలోని 923 ఆర్టీసీ బస్సులు మధ్యాహ్నం 2 గంటల వరకూ డిపోలకే పరిమితం కానున్నాయి. ఆ మేరకు ఆర్టీసీ అధికారులు ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ఆ తరువాతనే బస్సులు రోడ్డెక్కనున్నాయి.