నేడు అన్నాడీఎంకే కీలక సమావేశం

ABN , First Publish Date - 2021-01-09T15:34:03+05:30 IST

రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార అన్నాడీఎంకే కీలక భేటీకి సిద్ధమైంది. ఇప్పటికే వరుసగా అధికారంలోకి వచ్చిన అన్నాడీఎంకే మూడోమారు కూడా అధికార పీఠాన్ని కైవసం

నేడు అన్నాడీఎంకే కీలక సమావేశం

పొత్తులపై నిర్ణయాలు

సీఎం అభ్యర్థిగా ఎడప్పాడికి గ్రీన్‌సిగ్నల్‌

మార్గదర్శక కమిటీకి ఆమోదం

శశికళ ఆగమనంపైనా చర్చ?


చెన్నై: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార అన్నాడీఎంకే కీలక భేటీకి సిద్ధమైంది. ఇప్పటికే వరుసగా అధికారంలోకి వచ్చిన అన్నాడీఎంకే మూడోమారు కూడా అధికార పీఠాన్ని కైవసం చేసుకునేందుకు అనుస రించాల్సిన వ్యూహం, ప్రణాళికాలపై చర్చించేందుకు అన్నాడీఎంకే నేతలు శనివారం భేటీ కానున్నారు. అన్నాడీఎంకే కార్వ నిర్వాహక మండలి, సర్వసభ్య మండలి సమావేశాలు శనివారం ఉదయం వానగరం లోని శ్రీవారు వెంకటాచలపతి కల్యాణమండపంలో జరుగనున్నాయి. ఉదయం 8.50 గంటలకు ప్రారంభం కానున్న ఈ సమావేశంలో ఎన్నికల పొత్తులకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. పార్టీ ఉపనమన్వయకర్త, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, సమన్వయకర్త, ఉప ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వం సమక్షంలో పార్టీ ప్రిసీడియం చైర్మన్‌ మధుసూదన్‌ ఈ సమావేశానికి అధ్యక్షత వహించను న్నారు. ఇటీవల పార్టీలో 11 మంది సభ్యులతో ఏర్పాటైన మార్గదర్శక కమిటీకి సర్వసభ్య మండలి ఆమోదం ప్రకటించనుంది.రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడక ముందే అన్నాడీఎంకే, డీఎంకే, మక్కల్‌ నీదిమయ్యం పార్టీల నేతలు తీవ్రస్థాయిలో ప్రచారం సా గిస్తున్నారు.అన్నాడీఎంకే తరపున ముఖ్యమంత్రి పళని స్వామి రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో పర్యటిస్తున్నారు.


సీఎం అభ్యర్థిపై తీర్మానం...

ఇదిలా వుండగా అన్నాడీఎంకే సీఎం అభ్యర్థిగా ప్రస్తుత ముఖ్యమంత్రి పళనిస్వామిని ప్రకటించడం పై కూటమిలో మిత్రపక్షంగా ఉన్న బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తమను సంప్రదించకుండా సీఎం అభ్యర్థిని ఎలా ప్రకటిస్తారనే ధోరణితో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మురుగన్‌ సహా ఆ పార్టీ నాయకులు పలువురు విమర్శిస్తున్నారు. జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీయే) తరపున పోటీ చేయనున్న సీఎం అభ్యర్థిని బీజేపీ అధిష్టానం త్వరలో ప్రకటిస్తుం దని బీజేపీ నేతలు చెబుతున్నారు. బీజేపీ నేతల వైఖరిపై అన్నాడీఎంకే డిప్యూటీ సమ న్వయకర్తగా ఉన్న కేపీ మునుసామి, మంత్రి డి.జయకుమార్‌ తదితరులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.ఈ పరిస్థి తులలో శనివారం జరిగే సర్వసభ్య మండలి సమావేశంలో సీఎం అభ్యర్థిగా పళనిస్వామిని ఆమోదిస్తూ సభ్యులంతా కలిసి ఏకగ్రీవ తీర్మానాన్ని ప్రతిపాదించి ఆమోదించనున్నారు.


పొత్తులపై చర్చలు...

సర్వసభ్య మండలి సమావేశంలో వివిధ పార్టీలతో పొత్తుల విషయంపై సమగ్రంగా చర్చించనున్నారు. కొత్త పార్టీలను కూటమిలో చేర్చుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కూడా చర్చించనున్నారు. కూటమిలో మిత్రపక్షాలైన పీఎంకే, డీఎండీకే పార్టీలు కూటమికి నాయకత్వం వహిస్తున్న అన్నాడీఎంకేపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తుండటంతో ఆ రెండు పార్టీల నేతలను సంతృప్తి పరిచే దిశగా చేపట్టాల్సిన చర్యలపై పార్టీ సీనియర్‌ నేతలు చర్చించి, మిత్రపక్షాలకు సీట్ల కేటాయింపుపై కూడా నిర్ణయం తీసుకోనున్నారు.బీజేపీ38 నియోజకవర్గాల లో పోటీ చేసేందుకు రూపొందించిన అభ్యర్థుల జాబితాపై పార్టీ సీనియర్‌ నేతలు ఈ సమావేశంలో చర్చిస్తారని తెలుస్తోంది. ఇదే విధంగా పీఎంకే కూడా తమకు డిప్యూటీ సీఎం పదవి కావాలని, 40 సీట్లు కేటాయించాలని, వన్నియార్లకు 20 శాతం రిజర్వేషన్లు కల్పించాలని పట్టుబడుతుండటంపై కూడా ఈపీఎస్‌, ఓపీఎస్‌ సీనియర్‌ మంత్రులు సమగ్రంగా చర్చలు జరుపున్నారు.


3700 మంది హాజరు...

సర్వసభ్య మండలి సమావేశానికి 3700 మంది సభ్యులకు ఆహ్వానాలు పంపారు. వీరందరినీ కరోనా నిరోధక నిబంధనల మేరకు సమావేశ మందిరంలోకి అనుమతించనున్నారు. సమావేశంలో పాల్గొనేవారంతా ముందస్తు కరోనా వైద్యపరీక్షలు జరుపుకుని, తమకు పాజిటివ్‌ లక్షణాలు లేవని స్థానిక వైద్యుల నుంచి ధ్రువీకరణ పొందాలని, వాటిని తీసుకునే సమావేశానికి హాజరుకావాలని పది రోజులకు ముందే అన్నాడీఎంకే అధిష్టానవర్గం ఆదేశించింది.  


జంట నాయకత్వానికే అధికారం...

ఈ సమావేశంలో పార్టీ ఉప సమన్వయకర్త, ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, సమన్వయ కర్త, ఉప ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వంకు సర్వాధికారాలు కల్పించాలని తీర్మానం చేసి ఆమోదించ నున్నారని తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పొత్తులపై నిర్ణయాధికారాన్ని ఇద్దరికీ కట్టబెడుతూ ఆ తీర్మానంలో ప్రతిపాదించనున్నారు.  


శశికళ విడుదలపై...

మాజీ ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు శశికళ ఈ నెల 27న విడుదలవుతుండటంతో ఆమె రాక పార్టీపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే విషయంపై కూడా ఈ సమావేశంలో సమగ్రంగా చర్చించనున్నారు. సర్వసభ్య మండలి సమావేశం ప్రారంభానికి ముందు గత యేడాది కాలంలో మృతి చెందిన పార్టీ నాయకులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, జాతీయ నాయకులకు నివాళులర్పించేలా సంతాప తీర్మానాలు చేస్తారు. ఆ తర్వాత పార్టీ సీనియర్‌ నాయకులు అసెంబ్లీ ఎన్నికల వ్యూహరచనలపైనా, కొత్త పార్టీలను కూటమిలో చేర్చుకునే విషయంపైనా తమ అభిప్రాయా లను వ్యక్తం చేస్తూ ప్రకటించనున్నారు.   శశికళ జైలు నుండి విడుదలై చెన్నైకి తిరిగి రాగానే అన్నాడీఎంకేలోని కొందరు అసంతృప్త శాసనసభ్యులు పార్టీని వీడనున్నారని ప్రసార మాధ్యమాల్లో ఇప్పటికే ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఇదిలావుండగా సర్వసభ్య మండలి సమావేశంలో శశికళ ను మళ్ళీ పార్టీలో చేర్చుకోవాలని కొంతమంది సభ్యులు ఒత్తిడి చేయనున్నారని తెలుస్తోంది ఈ విషయంపై కూడా పార్టీ నేతలు ఎడప్పాడి, పన్నీర్‌సెల్వం సభ్యులందరి అభిప్రాయాలను అడిగి తెలుసుకుని ఆ తర్వాతే నిర్ణయాన్ని ప్రకటించనున్నారని తెలుస్తోంది. 


సాయంత్రం సమీక్ష...

అన్నాడీఎంకే కార్యనిర్వాహక మండలి, సర్వసభ్య మండలి సమావేశాలు ముగిసిన తర్వాత రాయపేటలోని ఆ పార్టీ ప్రధాన కార్యాలయలో సమీక్షా సమావేశం జరుగనుంది. అన్నాడీఎంకే ఉప సమన్వయ కర్త, ముఖ్యమంత్రి ఎడప్పాడి, సమన్వయకర్త, ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం అధ్యక్షతన జరుగనున్నా ఈ సమావేశంలో మంత్రివర్గ సభ్యులందరూ పాల్గొంటారు. ఈ సమావేశమైన తర్వాత ఎడప్పాడి, పన్నీర్‌సెల్వం మీడియా ప్రతినిధులతో సమావేశమై కొన్ని ప్రకటనలు చేసే అవకాశం ఉంది.

Updated Date - 2021-01-09T15:34:03+05:30 IST