ఆస్తుల నమోదుకు నేడే ఆఖరు

ABN , First Publish Date - 2020-10-20T07:16:22+05:30 IST

మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో వ్యవసాయేతర ఆస్తుల వివరాలను ధరణి పోర్టల్‌లో నమోదు చేసుకునేందుకు ఇచ్చిన గడువు మంగళవారంతో ముగియనున్నది

ఆస్తుల నమోదుకు నేడే ఆఖరు

కరీంనగర్‌ కార్పొరేషన్‌లో 84.83శాతం నమోదు 

కొత్తపల్లి మున్సిపాలిటీలో 98శాతం 

చొప్పదండిలో 92శాతం 

హుజురాబాద్‌ లో 79శాతం, జమ్మికుంటలో 80శాతం, 

మరో 15 రోజులు గడువు పెంచే అవకాశం

 

కరీంనగర్‌ టౌన్‌, అక్టోబర్‌ 19: మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో వ్యవసాయేతర ఆస్తుల వివరాలను ధరణి పోర్టల్‌లో నమోదు చేసుకునేందుకు ఇచ్చిన గడువు మంగళవారంతో ముగియనున్నది. ఈ నెల 1వ తేదీ నుంచి ఇంటింటికి వెళ్లి ఆస్తుల వివరాలను 10 రోజుల్లో నమోదు చేయాలని ఆదేశించడంతో పట్టణాలు, నగరాల్లో అధికారులంతా సర్వేతో బిజీబిజీ అయ్యారు. సర్వర్‌ డౌన్‌ వంటి ఆన్‌లైన్‌ సమస్య లతో పాటు ఆస్తుల వివరాలను ఇచ్చేందుకు ప్రజలు సహకరించక పోవడంతో 10వ తేదీ వరకు నమోదు పూర్తికాక పోవడంతో ఈ నెల 20వ తేదీ వరకు పూర్తి చేయాలని ఆదేశించారు. మొదట్లో కొంత మందకొడిగా సాగిన ధరణి సర్వే గడువు సమీపిస్తున్న కొద్ది వేగం పెరిగింది. కార్పొరేటర్లు, కౌన్సిలర్ల సహకారంతో ఆస్తుల వివరాలను నమోదు చేశారు. ధరణి పోర్టల్‌లో ఆస్తుల వివరాల నమోదుకు కేవలం 24 గంటల సమయం మాత్రమే మిగిలి ఉండగా చాలా మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల్లో నమోదు పూర్తికాక పోవడంతో గడువు మరో 15 రోజులు పొడిగిస్తారని భావిస్తున్నారు. కరీంనగర్‌ కార్పొరేషన్‌ పరిధిలో 72వేల ఇళ్లకు సంబంధించిన ఆస్తుల వివరాలను పోర్టల్‌లో నమోదు చేయాల్సి ఉండగా సోమవారం రాత్రి వరకు 60,129 ఇళ్లకు సంబంధించిన వివరాలను నమోదు చేశారు. 84.83శాతం నమోదు పూర్తికాగా మిగిలినవి పూర్తిచేసేందుకు కార్పొరేషన్‌లో ప్రత్యేక కౌంటర్‌ ఏర్పాటు చేయడంతో పాటు ఉదయం 7 గంటల నుంచే సర్వే చేయాలని కమిషనర్‌ ఆదేశాలు జారీ చేయడంతో గడువులోగా 100శాతానికి ఒకటిరెండు తక్కువ కావచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.


గతంలో ఎప్పుడో ఇంటి యజమాని కొనుగోలు చేసిన స్థలంలో కట్టిన ఇళ్లు ఆయన లేదా ఆమె పేరుతో ఉండగా ప్రస్తుతం వారు మరణించగా వారి కుటుంబసభ్యులు వారి పేర్లను మార్పిడి చేసుకోక పోవడంతో వాటి వివరాలను పోర్టల్‌లో నమోదు చేసేందుకు అంగీకరించడం లేదు. అలాగే ఆస్తుల యజమానులు ఇక్కడ లేక పోవడం, వారి ఆధార్‌నెంబర్లు దొరకక పోవడం, సర్వర్‌ డౌన్‌ కావడం తదితర కారణాలతో 3 నుంచి 5శాతం దరఖాస్తులు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నట్లు తెలిసింది. జిల్లాలోని హుజురాబాద్‌ మున్సిపాలిటీలో 79శాతం ఆస్తులను నమోదు చేయగా జమ్మికుంట మున్సిపల్‌లో 80శాతం మేరకు పూర్తయినట్లు తెలిసింది. చొప్పదండి మున్సిపాలిటీలో 4,608 ఇళ్లకు సంబంధించిన ఆస్తుల వివరాలను నమోదు చేసేందుకు 4,268 కుటుంబాల వివరాలు అంటే 97.62శాతం ధరణి పోర్టల్‌లో నమోదు చేశారు. కొత్తపల్లి మున్సిపాలిటీలో 3,278 ఇళ్ళ వివరాలను నమోదు చేయాల్సి ఉండగా 3,180 ఇళ్లకు సంబంధించిన ఆస్తుల వివరాలను పోర్టల్‌లో నమోదు చేశారు. మిగిలిన వాటిని కూడా మంగళవారం పూర్తిచేస్తామని అధికారులు చెబుతున్నారు.  


మంత్రి గంగుల ఆస్తుల వివరాలు నమోదు 

రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్‌  సోమవారం ధరణి పోర్టల్‌లో ఆస్తుల వివరాలు నమోదు చేసుకున్నారు. మున్సిపల్‌ కమిషనర్‌ వల్లూరి క్రాంతి నగరంలోని క్రిస్టియన్‌ కాలనీలో గల మంత్రి నివాసానికి వెళ్లి వివరాలను నమోదు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆస్తులపై హక్కు కల్పించడంతోపాటు భవిష్యత్‌లో ఎలాంటి సమస్యలు రాకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం ధరణి పోర్టల్‌లో వ్యవసాయేతర ఆస్తుల వివరాల నమోదు చేపట్టిందన్నారు. సర్వేకు ప్రజలు సంపూర్ణ సహకారం అందిస్తున్నారన్నారు. కొన్ని చోట్ల 100శాతం పూర్తికాగా, మరికొన్ని చోట్ల 90శాతం వరకు పూర్తయిందని, మిగిలిన 10శాతం కూడా నమో దు ప్రక్రియను పారదర్శకంగా పూర్తిచేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ చిల్ల శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-20T07:16:22+05:30 IST