నేడు హాలియాకు సీఎం కేసీఆర్‌

ABN , First Publish Date - 2021-08-02T07:31:55+05:30 IST

నాగార్జున సాగర్‌ ఉప ఎన్నిక సందర్భంగా ఇచ్చిన హామీల ప్రగతిపై సమీక్షించేందుకు నల్లగొండ జిల్లాలోని హాలియాకు సోమవారం సీఎం కేసీఆర్‌ రానున్నారు.

నేడు హాలియాకు సీఎం కేసీఆర్‌

నల్లగొండ, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): నాగార్జున సాగర్‌ ఉప ఎన్నిక సందర్భంగా ఇచ్చిన హామీల ప్రగతిపై సమీక్షించేందుకు నల్లగొండ జిల్లాలోని హాలియాకు సోమవారం సీఎం కేసీఆర్‌ రానున్నారు. ఈ సందర్భంగా రెండు గంటల పాటు అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించనున్నారు. నాగార్జున సాగర్‌ నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుంచి 10 మంది ప్రజాప్రతినిధులు సమీక్ష సమావేశానికి హాజరయ్యేలా ఆహ్వానాలు పంపారు. వీరితో పాటు జిల్లా ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొననున్నారు. టీఆర్‌ఎస్‌ తరఫున ప్రధాన రహదారికి ఒకవైపు ప్రతి గ్రామం నుంచి 100 మంది చొప్పున పార్టీ నేతలు, కార్యకర్తలను నిలబెట్టి సీఎంకు స్వాగతం పలికేలా ఏర్పాట్లు చేశారు.


అప్పట్లో ఇచ్చిన హామీలివే..

ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య హఠాన్మరణంతో ఈ ఏడాది ఏప్రిల్‌ 17న నాగార్జునసాగర్‌ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి నోముల భగత్‌ తరఫున నిర్వహించిన ప్రచార సభలో సీఎం కేసీఆర్‌ అనేక హామీలు ఇచ్చారు. నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా ప్రతి పంచాయతీకి రూ.20లక్షలు, మండల కేంద్రాలకు రూ.30లక్షలు, మునిసిపాలిటీలకు రూ.కోటి చొప్పున నిధులు కేటాయిస్తానని ప్రకటించారు. తిరుమలగిరి మండలంలోని నెల్లికల్లు ఎత్తిపోతల పథకాన్ని రూ.600కోట్లతో నిర్మించి 25వేల ఎకరాలకు ఏడాదిలోగా సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు.


వీటికి సంబంధించి జీవోలు జారీ అయినా.. ఇంకా నిధులు మంజూరు కాలేదు. స్థానికంగా పోడు భూములు సాగు చేసుకుంటున్న 2 వేల మంది గిరిజనులకు పట్టాలు ఇస్తామని ప్రకటించారు. నాగార్జునసాగర్‌లోని ఎన్‌ఎ్‌సపీ క్వార్టర్స్‌లో నివసిస్తున్న వారికి యాజమాన్య హక్కులు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. ఈ రెండు హామీలకు సంబంధించి ఎలాంటి ఉత్తర్వులు విడుదల కాలేదు. సాగర్‌ ఎడమకాల్వ ఆయకట్టు రైతులకు సాగునీటి సమస్య తలెత్తకుండా సీతారామ ఎత్తిపోతల ద్వారా పాలేరు రిజర్వాయర్‌ నుంచి పెద్దదేవులపల్లి రిజర్వాయర్‌కు గోదావరి నీటిని ఎత్తిపోసే పథకానికి శ్రీకారం చుడతామన్నారు. ఈ హామీ ఇంకా ప్రతిపాదనల దశలోనే ఉంది. హాలియాలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీ మేరకు.. స్థానిక జూనియర్‌ కళాశాల ప్రాంగణంలోనే డిగ్రీ కళాశాల మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ ఏడాది అడ్మిషన్లు తీసుకుంటున్నారు. ఈ హామీల ప్రగతిపై సీఎం కేసీఆర్‌ సమీక్షించనున్నారు. 


నిరసన బాటలో కాంగ్రెస్‌, బీజేపీ

మూడు నెలలు దాటినా సీఎం ఇచ్చిన హామీలు అమలు కాకపోవడాన్ని నిరసిస్తూ హాలియాలో సోమవారం సీఎం కార్యక్రమాన్ని అడ్డుకుంటామని కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు శంకర్‌నాయక్‌ ప్రకటించారు. మరోవైపు, నెల్లికల్లు ఎత్తిపోతల పథకం శిలాఫలకం వద్ద బీజేపీ నేతలు ఆదివారం నిరసన చేపట్టారు. శిలాఫలకం వద్ద ఓ కుర్చీ వేసి, దానిపై కేసీఆర్‌ అని రాసిపెట్టారు. ఎత్తిపోతల పథకాన్ని ఏడాదిలోగా కుర్చీ వేసుకొని పూర్తి చేస్తానని సీఎం కేసీఆర్‌ ప్రకటించారని, దాన్ని గుర్తు చేస్తూ ఆయనకు కుర్చీని బహుమతిగా అందజేస్తామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్‌రెడ్డి తెలిపారు. 

Updated Date - 2021-08-02T07:31:55+05:30 IST