శుభాలకు పునాది ఉగాది

ABN , First Publish Date - 2021-04-13T05:43:18+05:30 IST

ఉగాది అంటేనే తెలుగువారికి పెద్ద పండుగ. తెలుగుదనాన్ని అడుగడుగునా ప్రతిబింబించే సంప్రదాయలకు వేదిక ఉగాది పండుగ. నలుగుపెట్టి అమ్మ చేయించే తలంటుస్నానాలు, జీవిత సారాన్ని తెలియజేసేలా తీపి, చేదు, పులుపు, వగరు మొదలైన షడ్రుచుల సమ్మేళనంతో తెలుగువారికే సొంతమనిపించేలా తయారుచేసిన ‘ఉగాది పచ్చడి’, నేటి నుంచి ఎవరెవరి జాతకాలు ఎలా మారబోతున్నాయి.., పంటలు ఎలా పండనున్నాయి వంటివి పంచాంగ పఠనంతో చెప్పే వేదపండితులు.., పండుగ ప్రాశస్త్యాన్ని, ప్రకృతి రమణీయతను తమ పద్య, గద్య కవితల ద్వారా హృద్యంగా వర్ణించే కవిసమ్మేళనాలు..

శుభాలకు పునాది ఉగాది

తెలుగువారికి తొలి పండుగ

 నేడు ఉగాది పండుగ

 

ఒంగోలు (కల్చరల్‌), ఏప్రిల్‌ 12 : ఉగాది అంటేనే తెలుగువారికి పెద్ద పండుగ. తెలుగుదనాన్ని అడుగడుగునా ప్రతిబింబించే సంప్రదాయలకు వేదిక ఉగాది పండుగ. నలుగుపెట్టి అమ్మ చేయించే తలంటుస్నానాలు, జీవిత సారాన్ని తెలియజేసేలా తీపి, చేదు, పులుపు, వగరు మొదలైన షడ్రుచుల సమ్మేళనంతో తెలుగువారికే సొంతమనిపించేలా తయారుచేసిన ‘ఉగాది పచ్చడి’, నేటి నుంచి ఎవరెవరి జాతకాలు ఎలా మారబోతున్నాయి.., పంటలు ఎలా పండనున్నాయి వంటివి పంచాంగ పఠనంతో చెప్పే వేదపండితులు.., పండుగ ప్రాశస్త్యాన్ని, ప్రకృతి రమణీయతను తమ పద్య, గద్య కవితల ద్వారా హృద్యంగా వర్ణించే కవిసమ్మేళనాలు.. ఇన్ని ప్రత్యేకతల అచ్చ తెలుగు పండుగ ‘ఉగాది’. ప్రతి సంవత్సరం చైత్ర శుక్ల పాడ్యమిని ఉగాది పర్వదినంగా యావత్‌ తెలుగువారు జరుపుకోవటం ఆనవాయితీ. ఈ రోజునుంచి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుండగా,  దీనిని ప్లవ నామ సంవత్సరంగా పిలుస్తారు.

 పంచాగ శ్రవణం 

 ఉగాది పండుగ రోజున విశేషంగా చెప్పుకోదగిన కార్యక్రమం ‘పంచాంగ శ్రవణం’. శ్రవణం అంటే వినటం. అంటే నూతన పంచాంగం ప్రకారం సంవత్సరంలో ఏఏ రాశులవారికి ఏఏ ఫలితాలు కలుగనున్నాయి, వర్షాలు మొదలైన ప్రకృతి వనరుల లభ్యత ఏవిధంగా ఉంటుంది, శుభకార్యాలకు మంచి ముహూర్తాలు ఎప్పుడెప్పుడు ఉన్నాయి వంటివి ఈ పంచాగం ద్వారా పండితులు మనకు తెలియజేస్తారు.  

నేడు వివిధ దేవస్థానాలలో పంచాంగ శ్రవణాలు

  తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో వలేటివారిపాలెం శ్రీ కోదండరామ స్వామి దేవస్థానంలో పంచాంగ శ్రవణ కార్యక్రమం జరుగుతుంది. జిల్లా కేంద్రమైన ఒంగోలు శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామి దేవస్థానంలో రాత్రి 7.30కు పంచాంగ శ్రవణం కార్యక్రమం జరుగుతుందని ఆలయ ఇవో వేమూరి గోపీనాథ్‌, ధర్మకర్తల మండలి అధ్యక్షుడు ఈదుపల్లి గురునాఽథరావు తెలిపారు. అదేవిధంగా స్థానిక శ్రీగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానం, లాయర్‌పేట సాయిబాబా మందిరం, శ్రీ కోదండరామ స్వామి దేవస్థానం వంటి పలు దేవాలయాలలో సైతం పంచాంగ శ్రవణ కార్యక్రమాలు ఏర్పాటయ్యాయి. 

కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలి

అయితే ప్రస్తుతం సమాజాన్ని పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారి తిరిగి విజృంభిస్తున్న నేపథ్యంలో ఉగాది పండుగ జరుపుకునే విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పలువురు అధికారులు, వైద్యులు సూచిస్తున్నారు.  ముఖ్యంగా పండుగకు అవసరమైన పూలు, కూరగాయలు కొనే విషయంలో మార్కెట్‌ వంటి రద్దీ ప్రదేశాల్లో, దర్శనానికి వెళ్లినపుడు దేవాలయాలలో తప్పనిసరిగా మాస్కు ధరించాలని, భౌతికదూరాన్ని పాటించాలని వారు సూచిస్తున్నారు. పండుగ జరుపుకోవటం ఎంత ముఖ్యమో, ఆరోగ్యం పట్ల జాగ్రత్త కూడా అంతే ముఖ్యమని వారు సూచిస్తున్నారు.


Updated Date - 2021-04-13T05:43:18+05:30 IST