నేడు గొర్రెల పంపిణీ

ABN , First Publish Date - 2021-01-16T06:31:17+05:30 IST

మొదటి విడతలో పెండింగ్‌లో ఉన్న గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, జగదీష్‌ రెడ్డి నల్లగొండలో శనివారం ప్రారంభించనున్నారు.

నేడు గొర్రెల పంపిణీ
ఏర్పాట్లను పరిశీలిస్తున్న కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌

హాజరు కానున్న మంత్రులు తలసాని, జగదీ్‌షరెడ్డి 

కేటీఆర్‌ పర్యటన రద్దు

సాగర్‌ ఉప ఎన్నికపై జిల్లా ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం

నల్లగొండ, జనవరి 15(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): మొదటి విడతలో పెండింగ్‌లో ఉన్న గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, జగదీష్‌ రెడ్డి  నల్లగొండలో శనివారం ప్రారంభించనున్నారు. నల్లగొండ జిల్లాలో గొల్ల, కురుమ, యాదవ  సంఘాలు 499 ఉండగా, అందులో 70,633 మంది సభ్యులున్నారు. మొత్తం 56,860 కుటుంబాలు ఉండగా, 2017-18లో తొలి విడత 32,358 యూనిట్లు మంజూరు కాగా 26,159 యూనిట్లు పంపిణీచేశారు. ఇంకా 6,198 యూనిట్లు పంపిణీ చేయాల్సి ఉంది. అందులో 2,103 సంఘాలు డీడీలు తీశాయి. నల్లగొండ జిల్లాలో ఆరు నియోజకవర్గాలు పూర్తిగా, తుంగతుర్తి నియోజకవర్గంలోని శాలిగౌరారం ఉండగా, ప్రతీ నియోజకవర్గానికి 40 యూనిట్ల చొప్పున, తుంగతుర్తికి 10 చొప్పున మొత్తం 254 సంఘాలకు ఈనెల 16న గొర్రెలను పంపిణీ చేయనున్నారు. జిల్లాకేంద్రంలోని సాగర్‌రోడ్డులోని బత్తాయి మార్కెట్‌లో ఈకార్యక్రమాన్ని ఖరారుచేయగా, స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో జనసమీకరణ చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రులతోపాటు మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, డిప్యూటీ చైర్మన్‌ నేతి విద్యాసాగర్‌ తదితరులు పాల్గొననున్నారు. ఈ మేరకు ఏర్పాట్లను కలెక్టర్‌ పీజే.పాటిల్‌, ఎస్పీ రంగనాథ్‌ పరిశీలించారు. కాగా, ఈ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్‌ హాజరుకావల్సి ఉండగా, ఆయన పర్యటన రద్దయింది. అయితే నాగార్జునసాగర్‌ ఉప ఎన్నిక నేపథ్యంలో కేటీఆర్‌ పర్యటనపై ఉత్కంఠ ఏర్పడింది. అయితే సాగర్‌ నేతల మధ్య సమన్వయం కోసం 16న సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్‌లో వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఆధ్వర్యంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల సమావేశం ఖరారైంది.  

Updated Date - 2021-01-16T06:31:17+05:30 IST