నేడే సిరి ‘శంబర’ం

ABN , First Publish Date - 2022-01-25T04:39:31+05:30 IST

శంబర పోలమాంబ జాతరలో కీలక ఘట్టం సిరిమాను ఊరేగింపునకు సర్వం సిద్ధమైంది. మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు సిరిమాను కదలనుంది. దీని కోసం దేవదాయ శాఖ, రెవెన్యూ, పోలీసు అధికారులు ఏర్పాట్లు చేశారు.

నేడే సిరి ‘శంబర’ం
సిద్ధమైన సిరిమాను రథం(ఇనసెట్‌)లో పూజలందుకుంటున్న పోలమాంబ అమ్మవారు


మధ్యాహ్నం 2 గంటలకు ఊరేగింపు ప్రారంభం
ఆంక్షల మధ్య అమ్మవారి దర్శనం
వైభవంగా తొలేళ్లు


 శంబర పోలమాంబ జాతరలో కీలక ఘట్టం సిరిమాను ఊరేగింపునకు సర్వం సిద్ధమైంది. మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు సిరిమాను కదలనుంది. దీని కోసం దేవదాయ శాఖ, రెవెన్యూ, పోలీసు అధికారులు ఏర్పాట్లు చేశారు. కొవిడ్‌ నిబంధనలను అనుసరించి అమ్మవారి దర్శనానికి విడతల వారీగా రావాలని భక్తులకు పోలీసులు పిలుపునిచ్చారు. తొలేళ్లు వైభవంగా ముగిశాయి. పండగ తొలిరోజైన సోమవారం భక్తులు ఓ మోస్తరుగా అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

మక్కువ/సాలూరు రూరల్‌, జనవరి 24:
శంబర పోలమాంబ సిరిమాను ఉత్సవ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ ఏడాది మరోసారి ఆంక్షల నడుమ సంప్రదాయబద్ధంగా నిర్వహించడానికి అధికారులు సమాయత్తమయ్యారు. జాతరలో తొలి అంకమైన పోలమాంబ తొలేళ్ల ఉత్సవం సోమవారం రాత్రి వైభవంగా ముగిసింది. అమ్మవారి ముందు ఉంచి పూజించిన విత్తనాలను పలువురు రైతులు స్వీకరించారు. పండగను పరస్కరించుకుని గ్రామమంతా కోలాహలంగా మారింది. వీధుల్లో విద్యుత దీపాల కాంతులు పరుచుకున్నాయి. చుట్టాలు, బంధువులతో ఇళ్లన్నీ కళకళలాడుతున్నాయి. సిరిమాను ఉత్సవానికి బస్సులను నడపడం లేదు. ఆటోలకు కూడా అనుమతి లేదు. బైక్‌లు, సొంతకార్లను అనుమతించనున్నారు. జాతరలో పోలీస్‌ బందోబస్తును ఓఎస్‌డీ ఎన్‌.సూర్యచంద్రరావు, పార్వతీపురం డీఎస్పీ ఎ.సుభాష్‌లు పర్యవేక్షిస్తున్నారు. పార్వతీపురం సబ్‌ కలెక్టర్‌ భావ్నా సోమవారం ఏర్పాట్లను పరిశీలించారు. తాగునీరు, వైద్యశిబిరాలను ఎక్కడికక్కడ ఏర్పాటు చేశారు. వనంగుడి, చదురుగుడి, రామాలయం, అంగన్‌వాడీ కేంద్రం తదితర చోట్ల ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఫీడర్‌ అంబులెన్స్‌లు, 108 వాహనాలను అందుబాటులో ఉంచారు. అగ్నిమాపక దళాలను మోహరించారు. వాహన పార్కింగ్‌ ఏర్పాట్లు చేశారు. క్యూలైన్లు పూర్తి చేశారు. ఉచిత, రూ.10, రూ.50 దర్శనాలను ఏర్పాటు చేశారు. చిన్నారులకు ఉచితంగా అందించడానికి పాలు సిద్ధం చేశారు. ఉచిత ప్రసాద పంపిణీ కూడా ఉంటుంది. పది వేల లడ్డూలు, 3 వేల పులిహోర ప్యాకెట్లను సిద్ధం చేస్తున్నట్టు ఈవో లక్ష్మీనగేష్‌ చెప్పారు. దర్శనానికి వచ్చే భక్తులకు శానిటైజర్స్‌, భౌతిక దూరం, డబుల్‌ మాస్క్‌లు ధరించేలా చర్యలు తీసుకుంటున్నట్టు ఆయన తెలిపారు. పారిశుధ్య నిర్వహణ పనుల్లో 180 మంది సిబ్బంది నిమగ్నమై ఉన్నారు.
 బస్సులు, ఆటోలను నియంత్రించడానికి ఆరు చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామని సాలూరు సీఐ ఎల్‌.అప్పలనాయుడు చెప్పారు. మామిడిపల్లి, పాతబొబ్బిలి, చినభోగిల, కొత్తవలస డ్యాం, ఎస్‌.పెద్దవలస దారి, శంబర బీసీ హాస్టల్‌ వద్ద చెక్‌పోస్టులను ఏర్పాటు చేశామన్నారు.
 జాతరకు 600 మంది పోలీసులతో భద్రతా ఏర్పాటు చేస్తున్నారు. సిరిమానోత్సవం నాడు రెండు డ్రోన్‌ కెమెరాలతో భద్రతను పర్యవేక్షించనున్నారు. ఎస్పీ దీపికాపాటిల్‌ సోమవారం శంబరలో భద్రతా ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. అమ్మవారిని దర్శించుకున్నారు.


సిరిమాను ఊరేగింపు ఇలా..
 ఊరేగింపునకు ఈ ఏడాది 35 అడుగుల సిరిమానును సిద్ధం చేశారు. ఆర్‌అండ్‌బీ డీఈ సుబ్బారావు, ఏఈ కమలాకరరావు, అటవీశాఖాధికారులు సిరిమాను తయారీని సోమవారంపరిశీలించారు. దీని సామర్థ్యాన్ని మరోసారి మంగళవారం ఉదయం పరిశీలించి ధ్రువీకరణ పత్రాన్ని అందజేయనున్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు సిరిమానోత్సవం ప్రారంభమవుతుందని దేవస్థానం ఈవో లక్ష్మీనగేష్‌ తెలిపారు. ఈ ఏడాది జన్ని పేకాపు భాస్కరరావు (జగది) సిరిమానుఅధిరోహిస్తారని చెప్పారు. ఆయన్ను చదురు గుడి నుంచి సాడేపు కుటుంబీకులు భుజాలపై మోసుకొని వస్తారు. అనంతరం సిరిమానును అధిరోహిస్తారు. అప్పటికి మంగళవాయిద్యాల మధ్య ఘటాలన్నీ సిరిమాను దగ్గరకు వస్తాయి. సిరిమాను తొలుత గిరడ వారింటికి, అనంతరం కుప్పిలి, పూడి వారిళ్లకు వెళ్లి పూజలు అందుకుంటుంది. ఘటాలు దక్షిణ దిక్కుగా, సిరిమాను తూర్పు దిక్కుగా  వెళతాయి. ఈ రెండు పణుకు వీధిలో కలుస్తాయి. అక్కడ పొడిపిరెడ్డి కుటుంబీకులు, తీళ్ల వారి వారసులుగా ఉన్న అక్యాన కుటుంబీలు ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం సిరిమాను వెనక్కు మళ్లి గొల్లవీధి, కొత్తవీధి మీదుగా పెద్దమ్మ గుడి వద్దకు వెళ్తుతుంది. అక్కడ భక్తుల నుంచి పూజలు అందుకుంటుంది. తిరిగి నడివీధికి చేరుకొని ఆగిపోతుంది. అక్కడ సాడేపు కుటుంబీలు మళ్లీ జన్ని పేకాపు భాస్కరరావు (జగది)ను సిరిమాను నుంచి కిందకు దించి భుజాలపై చదురుగుడికి తీసుకు వెళతారు. సిరిమానోత్సవంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు రోప్‌పార్టీని ఏర్పాట్లు చేశారు. భారీ భద్రత నడుమ ఊరేగింపు సాగనుంది.


Updated Date - 2022-01-25T04:39:31+05:30 IST