నేడే టీకా

ABN , First Publish Date - 2021-01-16T06:00:57+05:30 IST

కొవిడ్‌ మహమ్మారిని అంతమొందించే టీకా ఎప్పుడొస్తుందా అని ఇన్నాళ్లు ఎదురుచూశాం. ఆ టీకా మరో కొన్ని గంటల్లో అందుబాటులోకి రానుంది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మార్గదర్శకాలతో మెదక్‌ జిల్లాలో రెండు కేంద్రాల్లో నేడు టీకా వేయనున్నారు.

నేడే టీకా

వ్యాక్సినేషన్‌ పంపిణీ ప్రారంభం

జిల్లాలో రెండు కేంద్రాల ఏర్పాటు 

తొలిరోజు 60 మంది వైద్య సిబ్బందికి టీకా

18వ తేదీ నుంచి 24 కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌  

జిల్లాకు చేరుకున్న 790 డోసులు


మెదక్‌ అర్బన్‌, జనవరి 15 : కొవిడ్‌ మహమ్మారిని అంతమొందించే టీకా ఎప్పుడొస్తుందా అని ఇన్నాళ్లు ఎదురుచూశాం. ఆ టీకా మరో కొన్ని గంటల్లో అందుబాటులోకి రానుంది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మార్గదర్శకాలతో మెదక్‌ జిల్లాలో రెండు కేంద్రాల్లో నేడు టీకా వేయనున్నారు. శనివారం మెదక్‌ జిల్లా కేంద్ర ఆసుపత్రితో పాటు నర్సాపూర్‌ ఏరియా ఆసుపత్రిలో కరోనా టీకాను ప్రారంభించేందుకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మొదటి రోజు 30 మందికి టీకా వేయనున్నారు. మొత్తం ఐదు రోజుల్లో తొలి దశలో గుర్తించిన వారికి టీకా వేయడం పూర్తి చేస్తారు. జిల్లాకు మొత్తం 790 డోసులు వచ్చినట్లు జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ వెంకటేశ్వర్‌రావు తెలిపారు. డీఎంహెచ్‌వో కార్యాలయంలో ఏర్పాటు చేసిన కోల్డ్‌ స్టోరేజీలో వ్యాక్సిన్‌ను భద్రపరిచారు.

మొదటి రోజు రెండు కేంద్రాల్లో 

నేడు వ్యాక్సిన్‌ పంపిణీకి జిల్లా కేంద్ర ఆసుపత్రి, నర్సాపూర్‌ ప్రాంతీయ ఆసుపత్రిలో ఏర్పాట్లు చేశారు. ఈ రెండు కేంద్రాల్లో ఒక్కో ఆసుపత్రిలో 30 మంది చొప్పున మొదటి రోజు టీకాను వేయనున్నారు. ఈనెల 18 నుంచి 24 కేంద్రాల్లో రోజు ఒక్కో కేంద్రంలో 100 మంది చొప్పున వ్యాక్సిన్‌ ఇస్తారు. 16 నుంచి మొదలయ్యే తొలి విడత కొవిడ్‌ టీకా పంపిణీలో మొదట జిల్లా వైద్య ఆర్యోగశాఖ అధికారులు, ప్రాథమిక, పట్టణ ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు పారామెడికల్‌, సిబ్బంది తీసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం 4,221 మందిని గుర్తించారు. అయితే వారిలో 3,284 మంది ప్రభుత్వ వైద్య సిబ్బంది కాగా 787 మంది ప్రైవేటు వైద్యులున్నారు. వారికి సంబంధించిన డేటాను కొవిడ్‌ పోర్టల్‌లో ఇప్పటికే నమోదు చేశారు. అయితే ఈ తొలివిడతలో 3,284 మంది ప్రభుత్వ వైద్య సిబ్బందికి మాత్రమే టీకా వేయనున్నారు. మిగిలిన వారికి తర్వాత ఇస్తారు. మెదక్‌ జిల్లా కేంద్ర ఆసుపత్రిలో 186, నర్సాపూర్‌ ప్రాంతీయ ఆసుపత్రిలో 101 మంది ప్రభుత్వ వైద్య సిబ్బందిని గుర్తించారు. తొలి విడత 16 నుంచి 22 వరకు ఈ టీకా పంపిణీ ప్రక్రియ కొనసాగుతుంది.

ప్రధాని ప్రసంగం అనంతరం ప్రారంభం

తొలి రోజున ఉదయం ప్రధాని మోదీ ప్రసంగిస్తారు. అనంతరం జిల్లాలో ఏర్పాటు చేస్తున్న 2 కేంద్రాల్లో టీకా పంపిణీని జడ్పీ చైర్‌పర్సన్‌, ఎమ్మెల్యే,  ప్రజాప్రతినిధులు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రారంభిస్తారు. ఉదయం 10.30 తర్వాత టీకా వేయడం మొదలవుతుందని జిల్లా వైద్యాధికారి తెలిపారు. 18 నుంచి 24 కేంద్రాల్లో వరుసగా నాలుగు రోజులపాటు టీకాను పంపిణీ చేస్తారు. 

ఫోన్‌కి టీకా సందేశం

జిల్లాలో వ్యాక్సినేషన్‌ వేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ వెంకటేశ్వర్‌రావు తెలిపారు. మెదక్‌ జిల్లా కేంద్ర ఆసుపత్రిలో ఆయన ఏర్పాట్లను పరిశీలించి అనంతరం మాట్లాడుతూ తొలి రోజు కరోనా వ్యాక్సినేషన్‌ కోసం మెదక్‌, నర్సాపూర్‌ ఆసుపత్రుల్లో టీకా పంపిణీ ప్రారంభం కానుందని తెలిపారు. ఇప్పటికే గుర్తించిన వారి వివరాలను కొవిడ్‌ పోర్టల్‌లో నమోదు చేశామని పేర్కొన్నారు. వారి ఫోన్‌కి టీకా పంపిణీకి సంబంధించిన సందేశం ముందు రోజు పంపిస్తామని తెలియజేశారు. అది అందుకున్నవారు కేటాయించిన కేంద్రానికి వచ్చి టీకా వేయించుకోవాలని సూచించారు. ప్రతి కేంద్రంలో రెండు ఏఈఎ్‌ఫఐ కిట్లు అందుబాటులో ఉంచామని తెలిపారు.

వ్యాక్సిన్‌ ఎంతో సురక్షితం : జిల్లా వైద్యాధికారి

నర్సాపూర్‌, జనవరి 15 : వ్యాక్సిన్‌ ఎంతో సురక్షితమని ఎవరూ దీని గురించి భయపడాల్సిన అవసరం లేదని జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్‌రావు తెలిపారు. జిల్లాలో మెదక్‌, నర్సాపూర్‌ ఆసుపత్రుల్లో మొదటి రోజు కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేయడానికి అన్ని ఏర్పాట్లను చేసినట్లు పేర్కొన్నారు. శుక్రవారం నర్సాపూర్‌ ఏరియా ఆసుపత్రిలో ఏర్పాట్లను డీఆర్డీఏ పీడీ శ్రీనివాస్‌, డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్‌ విజయకుమారితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి మాట్లాడుతూ మొదటగా వైద్య సిబ్బందికి వ్యాక్సిన్‌ వేయనున్నట్లు తెలిపారు. నర్సాపూర్‌లో శనివారం ఉదయం 10.30 గంటలకు వ్యాక్సిన్‌ వేసే కార్యక్రమం ప్రారంభిస్తామని, నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, అధికారులను ఆహ్వానించామని చెప్పారు. రెండో దశలో పారిశుధ్య సిబ్బంది, పోలీసులు, మూడో దశలో 50 ఏళ్లు దాటిన వారికి వ్యాక్సిన్‌ వేయనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి డాక్టర్‌ విజయ్‌కుమార్‌, నర్సాపూర్‌ ఆసుపత్రి సూపరిండెంట్‌ డాక్టర్‌ మిర్జాఅలీబేగ్‌తో పాటు సిబ్బంది పాల్గొన్నారు. 



Updated Date - 2021-01-16T06:00:57+05:30 IST