నేడు కరోనా వ్యాక్సినేషన్‌

ABN , First Publish Date - 2021-01-16T06:27:34+05:30 IST

కరోనా వ్యాక్సిన్‌ పంపిణీకి ఉమ్మడి జిల్లాలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. శనివారం ఉదయం తొమ్మిది చోట్ల వ్యాక్సినేషన్‌ ప్రారంభం కానుంది.

నేడు కరోనా వ్యాక్సినేషన్‌
నల్లగొండలో ఏర్పాట్లు పరిశీలిస్తున్న అధికారులు

ఉమ్మడి జిల్లాలో తొమ్మిది చోట్ల, 270 మందికి 

18 నుంచి మిగిలిన సిబ్బందికి

పూర్తిగా ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే, వైద్య, ఆరోగ్య సిబ్బందికే

సూర్యాపేటలో మంత్రి జగదీష్‌రెడ్డి, నల్లగొండలో ప్రారంభించనున్న మండలి చైర్మన్‌ సుఖేందర్‌ రెడ్డి

నల్లగొండ, జనవరి 15 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): కరోనా వ్యాక్సిన్‌ పంపిణీకి ఉమ్మడి జిల్లాలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. శనివారం ఉదయం తొమ్మిది చోట్ల వ్యాక్సినేషన్‌ ప్రారంభం కానుంది. నల్లగొండ జిల్లాలో నల్లగొండ పట్టణంలోని జిల్లా కేంద్ర ఆస్పత్రి, పానగల్‌ ఆరోగ్య కేంద్రం, మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రిలో వ్యాక్సినేషన్‌ ప్రారంభంకానుంది. నల్లగొండలో ఉదయం 10.30 గంటలకు జిల్లా కేంద్ర ఆస్పత్రిలో ఈ కార్యక్రమాన్ని మండలి చైౖర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, కలెక్టర్‌ పీజే పాటిల్‌ లాంఛనంగా ప్రారంభించనున్నారు. నల్లగొండ జిల్లాకు 127 కరోనా వాయిల్స్‌ వచ్చాయి. తొలి విడతలో ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు సిబ్బంది సుమారు 22వేల మందికి వ్యాక్సిన్‌ ఇవ్వనున్నారు. వ్యాక్సిన్‌తో దుష్ప్రభావాలు ఏర్పడితే ఎదుర్కొనేందుకు ప్రతి కేంద్రంలో ఒక బూత్‌ను ఏర్పాటు చేశారు. ఒక వాయిల్‌లో 10 డోసులు ఉంటాయి. మొదటి రోజు ఒక్కో కేంద్రంలో 30 మంది చొప్పున, 90 మందికి వ్యాక్సిన్‌ ఇవ్వనున్నారు. మొత్తం ఉమ్మడి జిల్లాలో తొమ్మిది చోట్ల, 270 మందికి తొలిరోజు వ్యాక్సిన్‌ ఇస్తారు. మిగిలిన సిబ్బందికి ఈనెల 18 నుంచి వ్యాక్సిన్‌ అందజేస్తారు. సూర్యాపేటలో వ్యాక్సినేషన్‌ను మంత్రి జగదీ్‌షరెడ్డి ప్రారంభించనున్నారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం సూర్యాపేటలో మంత్రి జగదీ్‌షరెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. యాదాద్రి జిల్లాలో మూడు కేంద్రాల్లో ప్రధాని నరేంద్రమోదీ వర్చువల్‌ విధానంలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రసంగిస్తారు. అందుకు భువనగిరి జిల్లా కేంద్ర ఆస్పత్రి, అర్బన్‌ హెల్త్‌సెంటర్‌, చౌటుప్పల్‌ ఏరియా ఆస్పత్రి, బీబీనగర్‌ మండలం కొండమడుగు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాట్లు చేశారు. జిల్లాకు చేరిన వ్యాక్సిన్‌ డోసులను ప్రత్యేక జాగ్రత్తల మధ్య ఆయా కేంద్రాలకు చేరవేసే వాహనాలను యాదాద్రి జిల్లా కలెక్టర్‌ అనితా రామచంద్రన్‌ జెండా ఊపి ప్రారంభించారు. యాదాద్రి జిల్లాకు తొలివిడతగా 1,160 డోసుల వ్యాక్సిన్‌ వచ్చింది. జిల్లాలోని ప్రతీ కేంద్రంలో రోజు 30 డోసుల వ్యాక్సిన్‌ ఇవ్వనున్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు జిల్లాలోని 24 కేంద్రాలు, ఆ తర్వాత ఎంపిక చేసిన ప్రైవేటు ఆస్పత్రుల్లో వ్యాక్సిన్‌ ఇవ్వనున్నారు. కాగా, వ్యాక్సిన్‌పై అనుమానాలు, అపోహలు వద్దని కలెక్టర్‌ అనితా రామచంద్రన్‌ కోరారు. సూర్యాపేట జిల్లా కేంద్రానికి 470 డోస్‌ల వ్యాక్సిన్‌ చేరుకుంది. ప్రతి వ్యక్తికి రెండు దఫాలుగా వ్యాక్సిన్‌ ఇవ్వనున్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జరనల్‌ ఆస్పత్రి, సూర్యాపేట రాజీవ్‌నగర్‌లోని అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌లో వ్యాక్సిన్‌ ఇవ్వనున్నారు.  హుజూర్‌నగర్‌ ఏరియా ఆస్పత్రిలో పని చేస్తున్న ఆరోగ్య సిబ్బందికి వ్యాక్సిన్‌ ఇవ్వనున్నట్లు డీఎంహెచ్‌వో కర్పూరపు హర్షవర్థన్‌ తెలిపారు. కాగా, హుజూర్‌నగర్‌లో వాక్సిన్‌ పంపిణీ ఏర్పాట్లను డిప్యూటీ డీఎంహెచ్‌వో నిరంజన్‌ పరిశీలించారు. చౌటుప్పల్‌ పట్టణంలోని సీహెచ్‌సీలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సెంటర్‌కు వచ్చిన వ్యాక్సిన్‌ డోసులను తంగడపల్లి పీహెచ్‌సీ వైద్యాధికారి శివప్రసాద్‌రెడ్డి స్వీకరించారు. వ్యాక్సినేషన్‌ బాక్స్‌లను ఆర్డీవో ఎస్‌.సూరజ్‌కుమార్‌ పరిశీలించారు. అంతకుముందు ఏర్పాట్లను మునిసిపల్‌ చైర్మన్‌ వెన్‌రెడ్డి రాజు, కమిషనర్‌ రామదుర్గారెడ్డి పరిశీలించారు. చౌటుప్పల్‌ సీహెచ్‌సీలో తొలిరోజు 490కి వ్యాక్సిన్‌ ఇవ్వనున్నారు.


విజయవంతం చేయాలి 

కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి కోరారు. శుక్రవారం సూర్యాపేట కలెక్టరేట్‌లో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 16న వ్యాక్సినేషన్‌ మొదటి విడత కార్యక్రమం ప్రారంభించనున్నట్లు చెప్పారు. తొలుత గుర్తించిన వారికి ప్రాధాన్య క్రమంలో వ్యాక్సిన్‌ ఇవ్వాలని వైద్యాధికారులను ఆదేశించారు. సూర్యాపేట జిల్లాలో తొలి విడతగా మూడు కేంద్రాల్లో ప్రతీ కేంద్రంలో 30 వ్యాక్సిన్ల చొప్పున ఇవ్వాలన్నారు. సమావేశంలో కలెక్టర్‌ టి.వినయ్‌కృష్ణారెడ్డి, సూర్యాపేట, హుజూర్‌నగర్‌ ఆర్డీవోలు రాజేంద్రకుమార్‌, వెంకట్‌రెడ్డి, డీఎంహెచ్‌వో హర్షవర్థన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-16T06:27:34+05:30 IST