నేడు వరల్డ్‌ హ్యాండ్‌ హైజీన్‌ డే.. చేతులు కడగండి... ప్రాణాలు కాపాడుకోండి!

ABN , First Publish Date - 2020-05-05T13:26:27+05:30 IST

కొవిడ్‌ -19 కాలంలో కనీసం 20 సెకన్ల పాటు చేతులను శుభ్రంగా కడుక్కోవడం ద్వారా వైరస్‌ బారిన పడకుండా కాపాడుకోవచ్చన్నది ఎంత నిజమో...

నేడు వరల్డ్‌ హ్యాండ్‌ హైజీన్‌ డే.. చేతులు కడగండి... ప్రాణాలు కాపాడుకోండి!

కొవిడ్‌ -19 కాలంలో కనీసం 20 సెకన్ల పాటు చేతులను శుభ్రంగా కడుక్కోవడం ద్వారా వైరస్‌ బారిన పడకుండా కాపాడుకోవచ్చన్నది ఎంత నిజమో... ఓ హెల్త్‌కేర్‌ వర్కర్‌ అదే 20 సెకన్ల పాటు చేతులను శుభ్రంగా ఉంచుకోవడానికి చేసే ప్రయత్నం కొన్ని లక్షల మంది ప్రాణాలు కాపాడుకోవడంలో తోడ్పడుతుందన్నది కూడా అంతే నిజం.


హైదరాబాద్‌ : ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారమే హాస్పిటల్‌ ఎక్వైర్డ్‌ ఇన్‌ఫెక్షన్‌ (హెచ్‌ఏఐ) కారణంగా 1.4 మిలియన్ల మంది ఇబ్బంది పడుతున్నారు. ఏటా 80 వేల మంది నోసోకోమియల్‌ ఇన్‌ఫెక్షన్ల కారణంగా మరణిస్తున్నారు. హాస్పిటల్‌లో పేషెంట్‌లను పరీక్షించుకుంటూ వెళ్లిపోయే డాక్టర్లు, వారిని అనుసరిస్తూ ఉండే నర్సులలో ఎంత మంది ప్రతిసారీ చేతులను సబ్బు లేదా ఆల్కహాల్‌ ఆధారిత శానిటైజర్లను వినియోగిస్తున్నారంటే... ప్రశ్నార్థకమే. ఈ కారణం చేతనే హ్యాండ్‌ హైజీన్‌ పట్ల అవగాహన కల్పించేందుకు ఇంటర్నేషనల్‌ హ్యాండ్‌ హైజీన్‌ డేను మే 5వ తేదీన నిర్వహిస్తోంది డబ్ల్యూహెచ్‌ఓ. ఏటా వినూత్న నేపథ్యంతో హెల్త్‌కేర్‌ రంగ నిపుణులు, రోగులు, వారి కుటుంబసభ్యులకు, సామాన్యులకు అవగాహన కల్పించేందుకు కృషి చేస్తోంది.


తక్కువ ఖర్చు... ఎక్కువ ఫలితం...!

అతి తక్కువ ఖర్చులో అందరికీ మెరుగైన ఆరోగ్యం ప్రసాదించాలంటే, స్వచ్ఛత నుంచే ఆరంభం కావాలన్నది అధ్యయనాల మాట. చాలా వరకూ అంటువ్యాధులకు కారణం... పరిశుభ్రత పాటించకపోవడమే. యునైటెడ్‌ నేషన్స్‌ గుర్తించిన, అత్యవసర సవాళ్లలో ఒకటి క్లీన్‌ హెల్త్‌కేర్‌. తమ చేతులను కడుక్కోవడమనేది డు ఇట్‌ యువర్‌సెల్ఫ్‌ వాక్సిన్‌ లాంటిదని డాక్టర్లంటున్నారు. చేతులను శుభ్రంగా కడుక్కోవడం ద్వారా డయేరియా, న్యుమోనియా బారిన పడే పిల్లల సంఖ్యను, వారి మరణాల సంఖ్యను తగ్గించుకునే అవకాశాలున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. అపోలో హాస్పిటల్స్‌లో సీనియర్‌ కన్సల్టెంట్‌ సైకియాటిస్ట్‌ భరత్‌కుమార్‌ రెడ్డి  మాట్లాడుతూ ‘హాస్పిటల్‌ సెట్టింగ్‌లో నోసోకోమియల్‌ ఇన్‌ఫెక్షన్లు రాకుండా హ్యాండ్‌ హైజీన్‌ కాపాడుతుంది. మత బోధనలలో కూడా హ్యాండ్‌ హైజీన్‌ గురించి ఉంది’’ అని అన్నారు.


హాస్పిటల్‌ నుంచే ఆరంభం... 

ప్రపంచ ఆరోగ్యసంస్థ లెక్కల ప్రకారం ఇండియా లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలలో శస్త్రచికిత్స చేయించుకున్న ప్రతి 100 మంది రోగులలో 11.8 మంది హెల్త్‌-కేర్‌ అసోసియేటెడ్‌ ఇన్‌ఫెక్షన్‌ (హెచ్‌సీఏఐ) బారిన పడుతున్నారు. ఐసీయూ రోగులు ఈ ఇన్‌ఫెక్షన్‌ బారిన పడడానికి రెండు-మూడు రెట్లు ఎక్కువ అవకాశాలు ఉన్నాయట. హ్యాండ్‌ హైజీన్‌తో ఈ ముప్పు తగ్గించుకోవచ్చు. నిన్న మొన్నటి వరకూ చేతుల పరిశుభ్రతపై ఎవరికీ పెద్దగా పట్టింపు ఉండేది కాదు కానీ.. కొవిడ్‌ యుగంలో ప్రతి ఒక్కరికీ దాని ఆవశ్యకత తెలిసింది. 2020వ సంవత్సరాన్ని ఇయర్‌ ఆఫ్‌ ద నర్స్‌ అండ్‌ మిడ్‌వై్‌ఫగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించడానికి హాస్పిటల్స్‌ ద్వారా వచ్చే అంటువ్యాధులను నివారించాలనే ఆలోచనే కారణం.  మే5న హ్యాండ్‌ హైజీన్‌ డే జరపడానికి కూడా ఓ కారణం ఉంది. అదేమిటంటే సంవత్సరంలో ఐదవ నెల ఐదవ తేదీ... మన రెండు చేతులకూ ఉన్న ఐదేసి వేళ్లకు ప్రతీకగా భావిస్తే, వాటిని సరిగా వినియోగించమని సూచించడమే. 


అనారోగ్యం బారిన పడకుండా...

చేతులపై క్రిమికీటకాలను పోగొట్టడంలో, అనారోగ్యం బారిన పడకుండా, అంటు వ్యాధులు ప్రబలకుండా హ్యాండ్‌ హైజీన్‌ ఎంతగానో తోడ్పడుతుంది. సాధారణ జలుబు మొదలు అత్యంత తీవ్రమైన అనారోగ్యాలైనటువంటి హెపటైటిస్‌ ఏ, కలరా, గ్యాస్ట్రో ఇంటెస్టినల్‌, టైఫాయిడ్‌ తాజాగా కొవిడ్‌-19 లాంటి ఇన్‌ఫెక్షన్లు రాకుండా కాపాడుతుంది. సీడీసీ హ్యాండ్‌ హైజీన్‌ లేదా హ్యాండ్‌ వాష్‌ కారణంగా 23-40ు డయేరియా, శ్వాససంబంధిత అనారోగ్యాలు 16-20% తగ్గే అవకాశాలున్నాయి. - డాక్టర్‌ శ్యామలా అయ్యంగార్‌, సీనియర్‌ కన్సల్టెంట్‌ ఇంటర్నల్‌ మెడిసిన్‌, అపోలో హాస్పిటల్స్‌, హైదర్‌గూడ


శుభ్రత లేకపోతే దుష్పరిణామాలే...

ఒకరికి వైద్య సేవలను అందించిన తర్వాత మరో రోగి దగ్గరకు వెళ్లేటప్పుడు హ్యాండ్‌ శానిటైజర్‌ స్ర్పే తప్పనిసరిగా వాడతాం. రెండు మూడు నెలల నుంచి దానిని మరింత కఠినంగా అమలు చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. మా దగ్గరకు ఎక్కువ మంది కీమో థెరపీ కోసం వస్తుంటారు. ఇలాంటి వారికి వ్యక్తిగత శుభ్రత, సరైన ఆహారం తీసుకోవడం అవసరం. - శ్రీవాణి, నర్సింగ్‌ సూపరింటెండెంట్‌, బసవతారకం ఇండో-అమెరికన్‌ కేన్సర్‌ హాస్పిటల్‌


అవగాహన మెరుగుపడాలి. 

హాస్పిటల్‌ స్టాఫ్‌ అంటువ్యాధులు ప్రబలడానికి మూలం కాకుండా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. డాక్టర్‌, అతని సహాయకులు కచ్చితంగా హ్యాండ్‌ శానిటైజర్‌ వాడిన తర్వాతే రోగిని తాకాలి. రోగులతో పాటుగా హాస్పిటల్‌ సిబ్బందికి కూడా దీనిపై అవగాహన మెరుగుపడాల్సి ఉంది. తప్పనిసరిగా నిబంధనలు పాటించాలి. -డాక్టర్‌ కల్పన, ఫ్యామిలీ ఫిజీషియన్‌, అపోలో క్లినిక్స్‌


మెరుగైన కొవిడ్‌ నివారణ మార్గం..

కొవిడ్‌ -19ను దృష్టిలో పెట్టుకుంటే, హ్యాండ్‌ హైజీన్‌ అనేది అతి తక్కువ ఖర్చులో మెరుగైన నివారణ మార్గంగా నిలుస్తోంది. ఎలాంటి అంటు వ్యాధులనైనా శుభ్రత చాలా వరకూ కాపాడుతుంది. ప్రివెంటివ్‌ మెడిసన్‌లో అతి ముఖ్యమైనది హ్యాండ్‌ వాష్‌. రెస్పిరేటరీ మాత్రమే కాదు గ్యాస్ట్రో తదితర సమస్యలకు ఇది నివారణగా తోడ్పడుతుంది. మరీ ముఖ్యంగా పిల్లల్లో న్యుమోనియా, డయేరియా ప్రబలకుండా హ్యాండ్‌ హైజీన్‌ తోడ్పడుతుంది. - డాక్టర్‌ షర్మిళ, పిడియాట్రిషియన్‌, అపోలో క్రాడెల్‌, జూబ్లీహిల్స్‌.

Updated Date - 2020-05-05T13:26:27+05:30 IST