అమ్మ ఫోన్‌తో లక్షల షాపింగ్ చేసిన రెండేళ్ల బుడతడు.. అదెలా చేశాడంటే..

ABN , First Publish Date - 2022-01-26T06:11:18+05:30 IST

ఒక రెండేళ్లు కూడా నిండని బుడ్డోడు(22 నెలలు) అమ్మ ఫోన్‌తో ఆడుకుంటూ అందులోని ఒక ఆన్‌లైన్ షాపింగ్ యాప్ ద్వారా రూ.1.5 లక్షల షాపింగ్ చేసేశాడు...

అమ్మ ఫోన్‌తో లక్షల షాపింగ్ చేసిన రెండేళ్ల బుడతడు.. అదెలా చేశాడంటే..

కరోనా పుణ్యమా అని చాలా మంది టెక్నాలజీకి చేరువయ్యారు. పెద్దలే కాదు పిల్లలు కూడా ఇంట్లో నుంచి బయటికి పోకుండా కాలక్షేపం కోసం ఆన్ లైన్ గేమ్స్, చాటింగ్, వీడియో కాల్స్, అన్‌లైన్ క్లాసులు పేరిట వ్యసనపరులవుతున్నారు. ఇంట్లో తల్లిదండ్రులు కూడా పిల్లలకు తమ స్మార్ట్ ఫోన్ ఇచ్చి అలవాటు చేస్తున్నారు. నెలల వయసు ఉన్న చిన్నపిల్లలు కూడా స్మార్ట్ ఫోన్ ఆపరేట్ చేస్తున్నారంటే.. ఇళ్లో టెక్నాలజీ ఏ స్థాయిలో వినియోగిస్తున్నారో అర్థమవుతోంది. తాజాగా ఒక రెండేళ్లు కూడా నిండని బుడ్డోడు(22 నెలలు) అమ్మ ఫోన్‌తో ఆడుకుంటూ అందులోని ఒక ఆన్‌లైన్ షాపింగ్ యాప్ ద్వారా రూ.1.5 లక్షల షాపింగ్ చేసేశాడు.


వివరాల్లోకి వెళితే.. అమెరికాలో స్థిరపడిన భారతీయ దంపతులు ప్రమోద్ కుమార్, మధు ఇంటికి ఇటీవల వాల్మార్ట్ నుంచి ఫర్నీచర్ డెలివరీ అయింది. అది ఎవరు ఆర్డర్ చేశారో వారికి అర్థం కాలేదు. ఇంట్లో వారిద్దరు కాకుండా వారి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. ఇద్దరు పెద్ద పిల్లలు స్కూలు వెళుతుండగా.. మూడో అబ్బాయి అయాన్ష్ కుమార్(22 నెలలు) ఇంట్లోనే ఆడుకుంటూ ఉంటాడు. ఇద్దరు పెద్ద పిల్లలని ప్రశ్నించగా.. వారు తమకేమీ తెలయదన్నారు. అప్పుడు ఆ షాపింగ్ ఆర్డర్ డేట్ చూస్తే ఆ రోజు మధు ఫోన్ అయాన్ష్ వద్దనే ఉంది. దీంతో వారు చిన్నారి అయాన్ష్ ఇదంతా చేశాడా! అని ఆశ్చర్యపోయారు. 


ఈ విషయం వాల్మార్ట్ వారికి తెలియజేయడంతో వారు డెలివరీ చేసిన ఐటెమ్స్‌ని రిటర్న్ తీసుకునేందుకు ఒప్పుకున్నారు. అమెరికా మీడియా సంస్థ ఎన్బీసీ ఈ విచిత్ర వార్త ప్రచురించే ముందు ప్రమోద్ కుమార్‌ను వివరాలను అడిగింది. ప్రమోద్ ఈ ఆన్‌లైన్ షాపింగ్ గురించి మాట్లాడుతూ.. తన చిన్న కొడుకు అయాన్ష్ కరోనా మహమ్మారి మొదలైన సమయంలో జన్మించాడని తెలిపారు. అప్పటి నుంచి ఆ బుడతడు ఇంట్లో అందరినీ అనుసరిస్తూ చలాకీగా ఉంటాడని.. పైగా స్మార్ట్ ఫోన్ విషయంలో చాలా ఫాస్ట్ అని చెప్పాడు. ఇటీవల అయాన్ష్ తల్లి మధు ఒక ఆన్‌లైన్ షాపింగ్ యాప్‌లో కొన్ని ఫర్నిచర్ ఐటెమ్స్ సెలెక్ట చేసుకొని ఆన్ లైన్ కార్ట్‌లో సేవ్ చేసి పెట్టింది. ఆ ఐటెమ్స్ తరువాత తీరిక సమయంలో చూసి కొందామని భావించింది. కానీ ఇంతలోనే అయాన్ష్ తన తల్లి ఫోన్ తీసుకొని ఆడుకుంటూ ఆ ఆన్‌లైన్ కార్ట్‌లో ఉన్న అన్ని ఐటెమ్స్‌ని ఆర్డర్ చేసేశాడు.


అయాన్ష్ ఇంకా కాంటాక్ట్స్ తీయడం, ఈ మెయిల్ చేయడం వంటివి చేయగలడని ప్రమోద్ చెప్పారు. ఇప్పుడు అయాన్ష్ మరోసారి ఇలాంటి తప్పు చేయకుండా ఫోన్‌లో కొన్ని యాప్స్‌కి లాక్ చేశామని కూడా ఆయన చెప్పారు.


Updated Date - 2022-01-26T06:11:18+05:30 IST