Advertisement
Advertisement
Abn logo
Advertisement

తోడే(ళ్లు)స్తున్నారు

 బస్వాపూర్‌ ప్రాజెక్టు పేరుతో జోరుగా ఇసుక అక్రమ రవాణా

 బిక్కేరు వాగు నుంచి ఇసుక తరలించవద్దంటూ రైతుల ఆందోళన

ఇసుకాసురులకు మద్దతుగా రంగంలోకి పోలీసులు

 అడ్డుకున్న మహిళా రైతులు.. పోలీ్‌సస్టేషన్‌కు తరలింపు

 నిరసనగా మహిళా రైతు ఆత్మహత్యాయత్నం

 మార్గమధ్యంలో మరో రైతుకు హైబీపీతో ఫిట్స్‌.. పరిస్థితి విషమం

ఇసుకాసురులు ఆడిందే ఆట, పాడిం దే పాట అన్నచందంగా తయారైంది. కొన్ని రోజులకు అనుమతి తీసుకొ ని, మరిన్ని రోజులు ఇసుకను తోడేస్తున్నారు. ఇదేమిటని అడిగితే పోలీసులను రంగంలోకి దించి, స్టేషన్‌కు తరలిస్తున్నారు. ఎదురు తిరిగితే మహిళలని కూడా చూడకుండా కేసులు నమోదు చేస్తామంటూ హెచ్చ రిస్తున్నారు. తమ గ్రామంనుంచి ఇసుకను తరలిస్తే ఊరుకోమని బిక్కేరు వాగులోకి వెళ్లిన అడ్డగూడూరు మండలం చిర్రగూడూరు గ్రామానికి చెందిన పలువురు మహిళా రైతులను పోలీసులు అడ్డుకున్నారు.  వారిని మోత్కూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించే ప్రయత్నం చేయగా, ఓ మహిళా రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. మరో మహి ళకు ఫిట్స్‌ రావడంతో ఆస్పత్రికి తరలిం చగా, పరిస్థితి విషమించింది. 


మోత్కూరు, నవంబరు 20: చెట్టు పేరు చెప్పుకుని కాయలమ్ముకున్నట్లుగా ఇసుక వ్యాపారం సా గుతోంది. బస్వాపూర్‌ ప్రాజెక్టు పేరుతో అడ్డగూడూరు మండలం చిర్రగూడూరు బిక్కేరు వాగు నుంచి జోరుగా ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారని గ్రామస్తులు, రైతులు ఆరోపిస్తున్నారు. బిక్కేరు వాగునుంచి ఇసుక తీసుకెళ్లడానికి నెలకు అనుమతి తీసుకుని మూడు నెలలకుపైగా ఇసుక తరలిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇసుక తరలింపునకు ప్రభుత్వం నుంచి పొందిన గడువు ముగిసిందని, వెంటనే ఇసుక తరలింపును నిలివేయాలంటూ గ్రామస్తులు రెండు, మూడు రోజులుగా ఆందోళన చేస్తున్నారు. అయినా ఎవరూ పట్టించుకోకవడంతో శనివారం గ్రామస్తులు ముఖ్యంగా మహిళా రైతులు అధిక సంఖ్యలో బిక్కేరు వాగులోకి వెళ్లి ఇసుకను లారీలకు ఎత్త వద్దంటూ అడ్డుకున్నారు. దీంతో పోలీసులు సంఘట నా స్థలానికి చేరుకొని ఇసుక తరలింపునకు ప్రభుత్వ అనుమతి ఉందని అడ్డుకోవద్దని కోరారు. అయినా వారు వినకపోవడంతో పోలీసులు మహిళా పోలీసులతో సుమారు 30మంది మహిళలను వ్యాన్‌ (డీసీఎం)లోకి ఎక్కించారు. మహిళలను వ్యాన్‌ ఎక్కించడాన్ని నిరసిస్తూ మహిళా రైతు పర్రెపాటి రాములమ్మ పురుగుల మందు తాగి ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. ఆమె పురుగుల మందు తాగడానికి డబ్బాను నోటి వద్ద పెట్టుకోగానే గమనించిన పోలీసులు వెంటనే డబ్బాను లాగేశారు. అప్పటికే కొంత తాగిన ఆమె వాంతులు చేసుకుందని తోటి మహిళలు తెలిపారు. పోలీసులు ఆమె ను వెంటనే మోత్కూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా అక్కడ ప్రాథమిక చికిత్సచేసి 108లో భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. మిగతా మహిళలను వ్యాన్‌లో మోత్కూరు పోలీ్‌సస్టేషన్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మరో మహిళా రైతు కల్లెట్లపల్లి సావిత్రిమ్మకు బీపీ పెరిగి ఫిట్స్‌ వచ్చింది. వెంటనే ఆమెను కూడా మోత్కూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా పరిస్థితి విషమంగా ఉందని ఆమెను మరో 108లో భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. మిగతా మహిళలు, ఇతర గ్రామస్తులను మోత్కూరు పోలీ్‌సస్టేషన్‌కు తరలించారు. 


నిబంధనలు ఏం చెబుతున్నాయంటే...

బిక్కేరు వాగులో మూడు అడుగుల లోతు మాత్రమే ఇసుక తోడాలి. బో రు పాయింట్లకు 15 అడుగుల దూరంలో ఇసుక తీయాలి. రోజూ ఉదయం 6గంటల  నుంచి సాయంత్రం 6 గంటల వరకు రోజుకు 22లారీలు మాత్ర మే తోడాలి. తహసీల్దార్‌ పర్యవేక్షణలో ఇసుక తీయడానికి హద్దులు నిర్ణయించి స్థంభాలు నాటాలి. గ్రామ కార్యదర్శి లేదా  రెవెన్యూ సహాయకుడి పర్యవేక్షణలో ఇసుక లారీలకు ఎత్తాలి. కాగా అక్కడ నిబంధనలకు విరుద్దంగా తమ ఇష్టారీతిన ఇసుక తోడుతున్నారన్నారు. ఇసుక తీయడానికి సరిహద్దులు నిర్ణయించలేదని, 10 అడుగుల లోతు ఇసుక తీస్తున్నారని, బోర్లు కూడా పూడ్చివేస్తున్నారని, పగలు, రాత్రి అనకుండా రోజూ వంద లారీలకు పైగా ఇసుక తరలిస్తున్నారని వారు ఆరోపించారు. గ్రామ కార్యద ర్శి, వీఆర్‌ఏ పర్యవేక్షణ లేకుండా ఇష్టారాజ్యంగా ఇసుక తీసుకెళ్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. 


ఇసుక అక్రమ రవాణాను నిలిపి వేయాలి

మూడు నెలలకుపైగా సాగుతున్న ఇసుక అక్రమ రవాణాను నిలిపి వే యాలని గ్రామస్తులు డిమాండ్‌చేస్తున్నారు. ఇసుక ఇలాగే తీసుకెళ్లితే భూ గర్భజలాలు అడుగంటి తమ వ్యవసాయాలు కుంటుపడి తాము జీవనోపా ధి కోల్పోతామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా మైనింగ్‌, ఇతర ఉన్నతాధికారులు వాగులోకి వచ్చి పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.


ఒక నెల అనుమతి తీసుకుని మూడు నెలలుగా..

మోత్కూరు పోలీ్‌సస్టేషన్‌కు తరలించిన మహిళలు ఉప్పల మంజుల, పర్రెపాటి సోమలక్ష్మి, కల్లెట్లపల్లి మంగమ్మ, బీజేపీ అడ్డగూడూరు మండల అధ్యక్షుడు కడియం సోమన్న, పర్రెపాటి ఉపేందర్‌తోపాటు పలువురు మోత్కూరులో విలేకరులతో మాట్లాడారు. బస్వాపూర్‌ ప్రాజెక్టుకు ఇసుక తీసుకెళ్లడానికి తమకు ప్రభుత్వం అనుమతించిందని, ఆగస్టు 29 వరకు వరకు ఇసుకను తీసుకెళ్తామని మొదట కాంట్రాక్టర్‌ చెప్పారన్నారు. తామంతా బిక్కేరు వాగులో చేతి బోర్లు వేసుకుని వాటి ద్వారా వచ్చే నీటితో వ్యవసాయం చేసుకుంటున్నామని, ఇసుక తరలింపుతో భూగర్భ జలాలు అడుగంటి వ్యవసాయం దెబ్బతింటుందని, ఇసుక తరలించ వద్దని అభ్యంతరం చెప్పామన్నారు. గ్రామంలో ఓటు హక్కు కలిగిన ప్రతీ ఒక్కరికి రూ.2500 చొప్పున ఇస్తామని చెప్పి, ఒక నెల ఇచ్చారని, ఆ డబ్బులను గ్రామంలోని కొంతమంది తీసుకోలేదన్నారు. నెల పూర్తి కాగానే ఇసుక తరలించ వద్దంటే వినకుండా ఏం చేసుకుంటారో చేసుకోండి, అడ్డం వస్తే లారీలతో తొక్కిస్తామంటూ తమను బెదిరించి తీసుక తీసుకెళ్తున్నారన్నారు. గడువు ముగిసినప్పటి నుంచి ఒక్కో నెల గడువు పొడిగించుకుంటూ బస్వాపూర్‌ ప్రాజెక్టు పేరుతో యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్నారన్నారు. 


అనుమతి ఉన్నా అడ్డుకుంటే కేసులు నమోదు చేస్తాం :  సీహెచ్‌ మోతీరామ్‌, సీఐ, రామన్నపేట  

బస్వాపూర్‌ ప్రాజెక్టుకు ఇసుక తీసుకెళ్లడానికి ప్రభుత్వం కాంట్రాక్టర్‌కు అనుమతి ఇచ్చింది. ఈ నెల 26 వరకు అనుమతి ఉంది. ప్రభుత్వ ఉత్తర్వులకు విరుద్దంగా ఎవరైనా వ్యవహరిస్తే కేసులు నమోదు చేస్తాం. 

పోలీస్‌స్టేషన్‌లో మహిళా రైతులు


Advertisement
Advertisement