‘టోక్యో’కు ఈ స్టార్లు దూరం

ABN , First Publish Date - 2021-05-29T08:51:34+05:30 IST

టోక్యో ఒలింపిక్స్‌కు మరో రెండు నెలలు కూడా లేదు. కరోనాతో ఏడాది వాయిదా పడిన ఈ విశ్వక్రీడల ప్రారంభ సంరంభం జూలై 23నుంచి జరగాల్సి ఉంది.

‘టోక్యో’కు  ఈ స్టార్లు దూరం

టోక్యో ఒలింపిక్స్‌కు మరో రెండు నెలలు కూడా లేదు. కరోనాతో ఏడాది వాయిదా పడిన ఈ విశ్వక్రీడల ప్రారంభ సంరంభం జూలై 23నుంచి జరగాల్సి ఉంది. అయితే జపాన్‌లో కొవిడ్‌ పరిస్థితులు చూస్తే మెగా ఈవెంట్‌ జరుగుతుందా.. అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. క్రీడలకు ఆతిథ్యమిస్తున్న టోక్యోతోపాటు ఒసాక తదితర ప్రముఖ నగరాల్లో కరోనా కోరలు చాస్తోంది. దాంతో జపాన్‌లోని పలు ప్రధాన నగరాలు, పట్టణాలలో అత్యయిక పరిస్థితి అమలవుతోంది. మరోవైపు మెజార్టీ జపాన్‌ ప్రజలు కుదిరితే ఒలింపిక్స్‌ను రద్దు చేయడమో లేదంటే వాయుదా వేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. కానీ జపాన్‌ ప్రధాని యొషిహిడే సుగా, అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓఏ) చీఫ్‌ థామస్‌ బాచ్‌ పోటీల నిర్వహణకు పట్టుదలగా ఉన్నారు. మెగా ఈవెంట్‌ను జరపడం ద్వారా సమష్టితత్వంతో కరోనాను తరిమికొట్టగలమని నిరూపించాలని వారిద్దరు వాదిస్తున్నారు.


పలు దేశాల్లో కొవిడ్‌ వాక్సినేషన్‌ ప్రారంభమైంది. దిగ్గజ ఔషధ సంస్థలు ఫైజర్‌, బయోఎన్‌టెక్‌ విశ్వక్రీడల్లో పాల్గొనే అథ్లెట్లకు ఉచితంగా వ్యాక్సిన్‌ అందించేందుకు ముందుకొచ్చాయి. అంటే..ఒలింపిక్స్‌లో పాల్గొనే క్రీడాకారులు, అధికారులంతా వ్యాక్సిన్‌ వేసుకోనున్నారన్నమాట. కరోనా దరిమిలా విశ్వక్రీడలకు విదేశీ ఫ్యాన్స్‌కు అనుమతి నిరాకరించారు. జపాన్‌ ప్రజలు స్టేడియాల్లోకి ఎంట్రీ విషయమై వచ్చేనెలలో నిర్ణయం తీసుకోనున్నారు. ఇలా మెగా ఈవెంట్‌ను దిగ్విజయంగా నిర్వహించేందుకు ఆతిథ్య జపాన్‌ సకల యత్నాలు చేస్తోంది. ఇకపోతే ఒలింపిక్స్‌ బరిలోకి దిగడం ప్రతి ఒక్క అథ్లెట్‌ కల. అలాంటి విశ్వక్రీడలకు ఈసారి నలుగురు స్టార్‌ ప్లేయర్లు, ఒక దేశం దూరం కానున్నాయి.


ఫెడరర్‌, మారిన్‌ డౌట్‌ 

టోక్యో ఒలింపిక్స్‌పై కొనసాగుతున్న సందిగ్ధానికి తెరదించాలని టెన్నిస్‌ గ్రేట్‌ రోజర్‌ ఫెడరర్‌ నిర్వాహకులను కోరాడు. మెగా ఈవెంట్‌ జరుగుతుందో లేదో తెలియక పోవడంతో అందులో పోటీపడాలో వద్దో అనే విషయాన్ని తాను తేల్చుకోలేకపోతున్నానని 20 గ్రాండ్‌స్లామ్‌ల విజేత రోజర్‌ అన్నాడు. 2008 బీజింగ్‌ ఒలింపిక్స్‌లో డబుల్స్‌ స్వర్ణం నెగ్గిన ఫెడెక్స్‌..లండన్‌ గేమ్స్‌లో సింగిల్స్‌లో రజత పతకం అందుకున్నాడు. 


డిఫెండింగ్‌ చాంప్‌కు మోకాలి గాయం

స్పెయిన్‌ బ్యాడ్మింటన్‌ స్టార్‌, డిఫెండింగ్‌ చాంపియన్‌ కరోలినా మారిన్‌ ఈసారి టోక్యో ఒలింపిక్స్‌కు దూరమయ్యే అవకాశముంది. శుక్రవారం ప్రాక్టీస్‌ సందర్భంగా ఆమె ఎడమ మోకాలికి గాయమైంది. వెంటనే  పరీక్షలు చేసిన వైద్యులు మారిన్‌కు సర్జరీ చేయాలని సూచించారు. సింగిల్స్‌లో ప్రపంచ నాలుగో ర్యాంకరైన మారిన్‌ 2016 రియో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించింది.


డేవిడ్‌ రుడీషా 

కెన్యాకు చెందిన డేవిడ్‌ రుడీషా డిస్టెన్స్‌ రన్నింగ్‌ రారాజు. 800 మీటర్ల పరుగులో రెండుసార్లు డిఫెండింగ్‌ ఒలింపిక్‌ చాంపియన్‌. కానీ గాయాలతో అతడు ఈసారి మెగా ఈవెంట్‌లో పాల్గొనడంలేదు. 2012 ఒలింపిక్స్‌ 800 మీ. ఫైనల్లో రుడీషా 1 నిమిషం 40.91 సెకన్ల టైమింగ్‌తో వరల్డ్‌ రికార్డు నెలకొల్పడం విశేషం. 2019లో కారు ప్రమాదానికి గురవడంతో అతడు చాలాకాలంగా ఆటకు దూరంగా ఉన్నాడు. 

 

ఉత్తర కొరియా బహిష్కరణ

కరోనాతో టోక్యో క్రీడలలో పాల్గొనడంలేదని ప్రకటించిన తొలి దేశం ఉత్తర కొరియా. 1988 తర్వాత విశ్వక్రీడలకు ఆ దేశం దూరంకావడం ఇది తొలిసారి. కోల్డ్‌ వార్‌ సమయంలో సియోల్‌లో జరిగిన ఆ విశ్వక్రీడలను నార్త్‌కొరియా బహిష్కరించింది. 


క్రిస్టియన్‌ కోల్‌మన్‌ 

ప్రపంచ 100 మీ. విజేత క్రిస్టియన్‌ కోల్‌మన్‌ కూడా టోక్యో బరిలో దిగడంలేదు. సమాచారం ఇవ్వకుండా డోప్‌ పరీక్షలకు అతడు అందుబాటులో లేకపోవడంతో అథ్లెటిక్స్‌ ఇంటిగ్రిటీ యూనిట్‌ కోల్‌మన్‌పై రెండేళ్ల నిషేధం విధించింది. దాంతో విశ్వక్రీడలకు అతడు అనర్హుడయ్యాడు. 

Updated Date - 2021-05-29T08:51:34+05:30 IST