Abn logo
Jul 26 2021 @ 03:19AM

సింధు చకచకా..

టోక్యో ఒలింపిక్స్‌లో ఆదివారం భారత్‌కు పతక భాగ్యం దక్కలేదు. షూటింగ్‌లో జరిగిన రెండు మెడల్‌ ఈవెంట్స్‌లోనూ నిరాశే ఎదురైంది. యువ షూటర్‌ మను బాకర్‌ పిస్టల్‌లో లోపం తలెత్తడంతో విలువైన సమయం కోల్పోయి  ఫైనల్స్‌కు దూరమైంది. పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ ఈవెంట్‌లోనూ మనోళ్లు ఫైనల్స్‌కు అర్హత సాధించలేకపోయారు. ఇక భారత్‌ స్వర్ణ పతక ఆశలను మోస్తున్న స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు, వెటరన్‌ బాక్సర్‌ మేరీ కోమ్‌ శుభారంభం చేశారు. టేబుల్‌ టెన్నిస్‌లో మనికా బాత్రా ప్రపంచ 32వ ర్యాంకర్‌ను మట్టికరిపిస్తూ మూడో రౌండ్‌లో అడుగుపెట్టింది. మిగతా పోటీల్లోనూ భారత్‌కు నిరాశే ఎదురైంది.


తొలి మ్యాచ్‌లో తెలుగుతేజం గెలుపు

మేరీ, మనికా ముందంజ

సానియా జోడీ ఇంటికి

నిరాశపరిచిన భారత షూటర్లు


 బ్యాడ్మింటన్‌    సింధు శుభారంభం (3)

వరల్డ్‌ చాంపియన్‌ పీవీ సింధు తన పతక పోరును జోరుగా ఆరంభించింది.   గ్రూప్‌ జెలో భాగంగా సెనియా పొలికర్పోవా (ఇజ్రాయెల్‌)తో జరిగిన తొలి మ్యాచ్‌లో 21-7, 21-10 తేడాతో సునాయాసంగా నెగ్గింది. తన క్రాస్‌ కోర్టు స్మాషెస్‌, డ్రాప్స్‌తో ప్రత్యర్థికి అవకాశమివ్వలేదు. రెండో గేమ్‌లోనైతే వరుసగా 13 పాయింట్లతో బెంబేలెత్తించింది. తదుపరి మ్యాచ్‌లో హాంగ్‌కాంగ్‌కు చెందిన చెంగ్‌ గన్‌ ఈతో తలపడనుంది. 


  బాక్సింగ్‌    మేరీ బోణీ ( 3)

మహిళల 51కేజీ ఫ్లయ్‌వెయిట్‌ బాక్సింగ్‌లో మేరీ కోమ్‌ ప్రీ క్వార్టర్స్‌లో ప్రవేశించింది. తొలి రౌండ్‌లో మిగ్వెలినా హెర్నాండెజ్‌ గార్సియా (డొమినికా)తో జరిగిన పోరులో తను 4-1తేడాతో స్పష్టమైన ఆధిక్యం ప్రదర్శించింది. క్వార్టర్స్‌లో చోటు కోసం గురువారం తదుపరి బౌట్‌లో తలపడుతుంది. ఇక పురుషుల 63కేజీ విభాగంలో మనూ కౌశిక్‌ తొలి రౌండ్‌లోనే నిష్క్రమించాడు. మెక్‌కోర్మాక్‌ (బ్రిటన్‌)తో జరిగిన బౌట్‌లో గట్టి పోటీనే ఇచ్చినా చివరి మూడు నిమిషాల్లో ప్రత్యర్థి పంచ్‌లకు సమాధానమివ్వలేకపోయాడు.


సెయిలింగ్‌ డబుల్‌ స్కల్స్‌లో  సెమీస్ కు  (3)

పురుషుల లైట్‌వెయిట్‌ డబుల్‌ స్కల్స్‌లో అర్జున్‌లాల్‌, అరవింద్‌ సింగ్‌ సెమీ్‌సకు అర్హత సాధించారు. ఇక సెయిలింగ్‌ మహిళల వ్యక్తిగత లేజర్‌ రేడియల్‌లో నేత్ర కుమనన్‌ రెండు రేసుల తర్వాత 27వ స్థానంలో నిలిచింది. ఇక పురుషుల లేజర్‌ ఈవెంట్‌ తొలి రేసులో విష్ణు శరవణన్‌ 14వ స్థానంలో నిలిచాడు. రెండో రేసు నేటికి వాయిదా పడింది.


 టీటీ బాత్రా ముందుకు (3)

టేబుల్‌ టెన్నిస్‌ మహిళల సింగిల్స్‌ రెండో రౌండ్‌లో 62వ ర్యాంకర్‌ మనికా బాత్రా అద్భుత ప్రదర్శన కనబరిచింది. తనకన్నా మెరుగైన క్రీడాకారిణి మార్గరీటా పెసోస్కా (ఉక్రెయిన్‌)పై తొలి రెండు సెట్లను కోల్పోయినా ఆ తర్వాత పుంజుకుని షాక్‌ ఇచ్చింది. చివరకు 4-3 (4-11, 4-11, 11-7, 12-10, 8-11, 11-5, 11-7) తేడాతో చిత్తు చేసి మూడో రౌండ్‌కు చేరింది. అయితే పురుషుల సింగిల్స్‌లో సాథియన్‌ 3-4 (7-11, 11-7, 11-4, 11-5, 9-11, 10-12, 6-11)తో సూ హాంగ్‌ (హాంకాంగ్‌) చేతిలో ఓడాడు.


హాకీ చిత్తు చిత్తుగా (5)

భారత పురుషుల హాకీ జట్టుకు గ్రూప్‌ ‘ఎ’ రెండో మ్యాచ్‌లో దారుణ పరాభవం ఎదురైంది. ఆస్ట్రేలియాపై 1-7తో చిత్తుగా ఓడింది. తమ ఒలింపిక్స్‌ చరిత్రలోనే భారత హాకీ జట్టు ఇంత తేడాతో ఎన్నడూ ఓడిపోలేదు. దిల్‌ప్రీత్‌ సింగ్‌ జట్టుకు ఏకైక గోల్‌ అందించాడు.


టెన్నిస్‌  పోరాడినా.. (5)

మహిళల డబుల్స్‌ తొలి రౌండ్‌లో సానియా మీర్జా-అంకిత రైనా 0-6, 6-7 (8/10)తో నడియా-కిచెనోక్‌ (ఉక్రెయిన్‌)పై పోరాడి ఓడారు. రెండో సెట్‌లో 5-3 ఆధిక్యంతో మ్యాచ్‌ సర్వీస్‌ చేసిన భారత జోడీకి అనూహ్యంగా పోటీ ఎదురై టైబ్రేక్‌ వరకు వెళ్లింది. ఇక్కడ 1-8తో వెనుకబడిన దశలో వరుసగా ఏడు పాయింట్లు సాధించినా చివర్లో తడబడ్డారు.


జిమ్నాస్టిక్స్‌  ప్రణతికి నిరాశ (5)

భారత్‌ నుంచి ఏకైక జిమ్నాస్ట్‌ ప్రణతి నాయక్‌ ఆర్టిస్టిక్‌ జిమ్నాస్టిక్స్‌ ఫైనల్స్‌కు అర్హత సాధించలేకపోయింది. నాలుగు విభాగాల్లో తను 42.565 స్కోరు సాధించి 29వ స్థానంలో నిలిచింది.


స్విమ్మింగ్‌  ఇద్దరికీ నిరాశే (5)

స్విమ్మర్లు శ్రీహరి నటరాజ్‌, మానా పటేల్‌ తమ విభాగాల్లో హీట్స్‌ దశలోనే వెనుదిరిగారు. పురుషుల 100మీ. బ్యాక్‌స్ట్రోక్‌ హీట్‌లో శ్రీహరి 54.31సెకన్లలో పూర్తి చేసి ఓవరాల్‌గా 27వ స్థానంలో నిలిచాడు. మహిళల 100మీ. బ్యాక్‌స్ట్రోక్‌ హీట్‌1లో మానా పటేల్‌ (1:05.20సె.) 39వ స్థానంలో నిలిచి నిరాశపరిచింది.