నాడు ఆధిపత్యం.. నేడు జీవన్మరణం

ABN , First Publish Date - 2020-04-02T09:54:28+05:30 IST

అది రెండో ప్రపంచ యుద్ధకాలం. విశ్వమంతా భయం గుప్పిట కూరుకుపోయింది. ఆ తరుణంలో 1940లో 12వ ఒలింపిక్స్‌ను టోక్యో నిర్వహించాలి. అయితే యుద్ధం వల్ల ...

నాడు ఆధిపత్యం.. నేడు జీవన్మరణం

టోక్యో ఆతిథ్యమివ్వాల్సిన ఒలింపిక్స్‌కు ఏదో ఒక అవరోధం ఎదురవుతోంది. ఎప్పుడో ఎనిమిది దశాబ్దాల కిందట ఇప్పటిలాగే ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఒలింపిక్స్‌ నిర్వహించాలని టోక్యో భావించింది. కానీ అప్పుడు ఆధిపత్యం కోసం యుద్ధం చేయాల్సి రావడంతో ఏకంగా క్రీడలే రద్దయ్యాయి. ఈసారి కరోనా ‘యుద్ధం’తో జీవన్మరణ సమస్యగా మారి  విశ్వక్రీడలు వాయిదా పడ్డాయి.


(ఆంధ్రజ్యోతి క్రీడా విభాగం)

అది రెండో ప్రపంచ యుద్ధకాలం. విశ్వమంతా భయం గుప్పిట కూరుకుపోయింది. ఆ తరుణంలో 1940లో 12వ ఒలింపిక్స్‌ను టోక్యో నిర్వహించాలి. అయితే యుద్ధం వల్ల వాటిని ఫిన్లాండ్‌ రాజధాని హెల్సెంకీకి తరలించారు. కానీ అక్కడా సాధ్యపడకపోవడంతో మొత్తంగా ఆ ఒలింపిక్స్‌ను రద్దు చేశారు. అసలు ఆ ఒలింపిక్స్‌ ఆతిథ్యాన్ని టోక్యో చేజిక్కించుకోవడం వెనుక రెండు ప్రధాన కారణాలున్నాయి. 1923 సెప్టెంబరు 1న వచ్చిన భూకంపం.. టోక్యో, దాని పక్కనేగల పట్టణం యోకొహామాను నేలమట్టం చేసింది. లక్షన్నరమంది ఆ ప్రకృతి ప్రకోపానికి బలయ్యారు. ఈ ఉత్పాతం నుంచి కోలుకున్నామని నిరూపించుకొనేందుకు టోక్యో 1940 ఒలింపిక్స్‌కు బిడ్‌ వేసింది.  


బిడ్‌కు మరో కారణం ఇదీ...

1940 ఒలింపిక్స్‌ను నిర్వహించాలని జపాన్‌ భావించడానికి మరో కారణం కూడా ఉంది. జపాన్‌ తొలి చక్రవర్తి జిమ్ము పట్టాభిషిక్తుడై 1940కి 2600 సంవత్సరాలు అవుతుంది. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఒలింపిక్స్‌కు ఆతిథ్యమివ్వాలని తలచింది. 1932లో జపాన్‌ బిడ్‌ ప్రయత్నాలు ప్రారంభించగా.. రోమ్‌, హెల్సెంకీ కూడా పోటీ పడ్డాయి. అయితే బిడ్‌ను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న జపాన్‌ తీవ్ర స్థాయిలో లాబీయింగ్‌ చేసింది. అంతేకాదు.. తమకు మద్దతుగా బరినుంచి వైదొలగాలని నాటి ఇటలీ నియంత ముస్సోలినీని కూడా అభ్యర్థించింది. అయితే, ముస్సోలినీ ఓ షరతు విధించారు. తాము జపాన్‌కు మద్దతిస్తామని, ప్రతిగా 1944 ఒలింపిక్స్‌ బిడ్‌కు తమకు మద్ద తివ్వాలని కోరారు. తద్వారా ఇటలీ రేస్‌నుంచి నిష్క్రమించగా.. టోక్యో, హెల్సెంకీ పోటీలో నిలిచాయి. ఓటింగ్‌లో టోక్యో ఆతిథ్యాన్ని దక్కించుకుంది. ఒలింపిక్స్‌కు బిడ్‌ వేయడానికి ముందు 1931లో చైనాలోని మంచూరియా ప్రాంతాన్ని జపాన్‌ ఆక్రమించడంతోపాటు రెండేళ్ల తర్వాత నానాజాతి సమితినుంచి వైదొలగింది.


దాంతో బ్రిటన్‌, అమెరికాలు జపాన్‌పై ఆగ్రహం ప్రకటించాయి. ఆ రెండు దేశాలతో సంబంధాలు మెరుగుపరుచుకొనేందుకు ఒలింపిక్స్‌కు జపాన్‌ బిడ్‌ వేసిందని కూడా చెబుతారు. అప్పటికే ప్రపంచమంతా యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. బ్రిటన్‌, అమెరికా ఒలింపిక్స్‌ను బహిష్కరిస్తాయన్న వార్తలు బయలుదేరాయి. ఈ తరుణంలో 1937లో రెండో చైనా-జపాన్‌ యుద్ధం ప్రారంభమైంది. ఫలితంగా మిలటరీ ఆపరేషన్లకు జపాన్‌కు భారీగా డబ్బు అవసరమైంది. దాంతో ఒలింపిక్స్‌కంటే కూడా యుద్ధానికే ప్రాధాన్యమిచ్చిన జపాన్‌.. విశ్వ క్రీడల నిర్వహణనుంచి వైదొలుగుతున్నట్టు 1938లోప్రకటించింది. అలా ఆ ఒలింపిక్స్‌కు బ్రేక్‌ పడిందన్నమాట! మరి ఈసారి కంటికి కనపడని శత్రువు కరోనాపై ప్రపంచమంతా యుద్ధం చేస్తుండడంతో ఒలింపిక్స్‌ వాయిదా పడ్డాయి.

Updated Date - 2020-04-02T09:54:28+05:30 IST