మీరాడితే లోకమే ఊగదా!

ABN , First Publish Date - 2021-07-23T09:36:25+05:30 IST

ఎప్పుడో రెండో ప్రపంచ యుద్ధ సమయాన తప్పితే ఒలింపిక్స్‌ క్రీడలకు ఇప్పటి వరకు ఎలాంటి ఆటంకం జరగలేదు. కానీ గతేడాది ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్‌ ప్రభావం అన్ని క్రీడా ఈవెంట్లతో పాటు ఒలింపిక్స్‌పైనా పడింది. దీంతో 2020లో జరగాల్సిన ఈ మెగా ఈవెంట్‌ 2021కి వాయిదా...

మీరాడితే లోకమే ఊగదా!

  • నేటి నుంచే టోక్యో ఒలింపిక్స్‌

వచ్చేసింది.. విశ్వక్రీడా మహోత్సవం. ఎన్నెన్నో దేశాలు.. మరెంతో మంది అథ్లెట్లు.. వీరందరినీ ఒక్క చోటికి చేర్చేది.. ప్రపంచ క్రీడా యవనికపై మహోత్క ృష్టమైనవిగా భావించే ఒలింపిక్స్‌. ప్రతీ నాలుగేళ్లకోసారి ఠంచనుగా పలకరించే ఈ ప్రతిష్ఠాత్మక క్రీడలు కరోనా దెబ్బకు ఓ ఏడాది ఆలస్యమైంది. అలాగే అంగరంగ వైభవంగా.. వేలాది మంది అభిమానుల కోలాహలం మధ్య జరగాల్సిన ఈ మెగా ఈవెంట్‌ ప్రత్యేక ఆంక్షల కారణంగా చడీచప్పుడు లేకుండానే సాగబోతోంది. అయితేనేం.. ఒలింపిక్‌ పతక  ప్రతిష్ట మాత్రం మసకబారదు. ఈ పతక సాధన ప్రతీ అథ్లెట్‌ కల. తమ నైపుణ్యాలకి పదును పెడుతూ ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఆ మహోజ్వల ఘట్టానికి మరికొద్ది గంటల్లో తెరలేవబోతోంది.


ఇక మనం చేయాల్సిందల్లా.. చేపలకే అసూయ కలిగించేలా ఈత కొలనులో స్విమ్మర్ల ఫినిషింగ్‌ను.. బుల్లెట్‌ వేగంతో చిరుతనే చిన్నబోయేలా చేసే అథ్లెట్ల పరుగులను.. ఆకాశాన్ని తాకేందుకా అన్నట్టుగా ఎగిరే పోల్‌వాల్ట్‌ వీరులను.. లక్ష్యం వైపు శర సంధానం చేసే ఆర్చర్ల విన్యాసాలను.. ప్రత్యర్థులపై పవర్‌ఫుల్‌ పంచ్‌లు విసిరే బాక్సర్లను.. గన్‌ పేల్చితే టార్గెట్‌ బద్దలవ్వాల్సిందే అన్నట్టుగా ఉండే షూటర్ల ఏకాగ్రతను అబ్బురంగా తిలకిద్దాం. అంతేకాదు.. అన్నింటికీ మించి త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించేందుకు భారత అథ్లెట్లు సాగించే ప్రదర్శనకు మద్దతు ఇద్దాం.. పతక కాంతులు వెదజల్లాలని ఆశిద్దాం.. కమాన్‌ ఇండియా!



టోక్యో: ఎప్పుడో రెండో ప్రపంచ యుద్ధ సమయాన తప్పితే ఒలింపిక్స్‌ క్రీడలకు ఇప్పటి వరకు ఎలాంటి ఆటంకం జరగలేదు. కానీ గతేడాది ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్‌ ప్రభావం అన్ని క్రీడా ఈవెంట్లతో పాటు ఒలింపిక్స్‌పైనా పడింది. దీంతో 2020లో జరగాల్సిన ఈ మెగా ఈవెంట్‌ 2021కి వాయిదా పడింది. చివరకు ఎలాగైతేనేం.. ఎన్నో సందేహాలు.. నిరసనలు.. ఆందోళనలు.. ఒడిదుడుకుల మధ్య నేటి (శుక్రవారం) నుంచి ఆగస్టు 8 వరకు ఈ అత్యున్నత క్రీడా సమరం అందరినీ అలరించేందుకు సిద్ధమైంది. ఈసారి టోక్యో గేమ్స్‌లో సరికొత్తగా ఐదు క్రీడలను జత చేశారు. దీంతో 33 క్రీడల్లో పతకాల కోసం పోటీపడే ఈవెంట్ల సంఖ్య 339కి చేరింది. ఇందులో పాల్గొనేందుకు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 11,500 మంది అథ్లెట్లు టోక్యోకు చేరుకున్నారు. వీరేకాకుండా విదేశీ అధికారులు, జర్నలిస్టులు, సహాయక సిబ్బంది కలిపి మరో 79 వేల మంది ఉన్నారు.


అంతటా  ఆంక్షలే..

కరోనా ఓవైపు భయపెడుతున్నా జపాన్‌ ప్రభుత్వం ఈ గేమ్స్‌ నిర్వహణకు మొండిగా ముందుకెళ్లింది. దీంట్లో భాగంగా అంతటా కఠిన ఆంక్షలను అమలు చేస్తోంది. నగరంలో ఆరోగ్య అత్యయిక స్థితిని ప్రకటించింది. క్రీడా గ్రామంలో ఉండే అథ్లెట్లకు ప్రతీ రోజు కరోనా టెస్టులు తప్పనిసరి చేసింది. గదుల్లో ఉన్నప్పుడు తప్పనిసరిగా కిటీకీలు తెరవాలి. అలాగే పోటీలు లేనప్పుడు విలేజిని వదిలి ఎక్కడికీ వెళ్లకూడదు. రెస్టారెంట్లు, బార్లకు వెళ్లడం నిషేధం. అయినా ఇక్కడికి వచ్చింది మొదలు ప్రతి రోజూ కేసులు వెలుగు చూస్తూనే ఉన్నాయి. అలాగే అథ్లెట్ల అద్భుత విన్యాసాలను తిలకించేందుకు విదేశాల నుంచి కూడా ఎంతోమంది వస్తుంటారు. కానీ కొవిడ్‌ వారి ఆశలపై నీళ్లు చల్లింది. చరిత్రలో తొలిసారిగా స్టేడియాల్లో ప్రేక్షకులు లేకుండానే ఒలింపిక్‌ పోటీలు జరుగబోతున్నాయి. స్థానికులు కూడా టీవీల్లోనే పోటీలను వీక్షించాల్సిందిగా అధికారులు కోరుతున్నారు. ఇక విజేతలకు అందజేసే పతకాలను కూడా అథ్లెట్లు ఎవరికి వారే తమ మెడలో వేసుకోవాలని సూచించారు. 


పర్యావరణహితంగా..

మొదటిసారిగా ఒలింపిక్‌ గేమ్స్‌ పర్యావరణానికి అనుకూలంగా జరుగబోతున్నాయి. దీంట్లో భాగంగా సౌర శక్తి ద్వారా వచ్చే విద్యుత్‌ను వినియోగించబోతున్నారు. అంతటా ఎల్‌ఈడీ లైట్ల వినియోగమే ఉంటుంది. అలాగే క్రీడా గ్రామంలో అథ్లెట్లు పడుకునే మంచాలు కట్టెతో కాకుండా అట్టముక్కలతో చేశారు. అలాగే సముద్రంలోని ప్లాస్టిక్‌ను రీసైకిల్‌ చేసిన దానితో పోడియాలు సిద్ధం చేయగా.. పాడైపోయిన 6.2 మిలియన్‌ మొబైల్స్‌తో పతకాలను తయారు చేయించారు. లండన్‌ గేమ్స్‌లో 3.3 మిలియన్‌ టన్నుల కార్బన్‌ డై ఆక్సైడ్‌ ఉత్పత్తి కాగా ప్రస్తుత చర్యలతో టోక్యోలో ఈసారి 2.93 మిలియన్‌ టన్నులు మాత్రమే విడుదల కానుంది.


నలుగురు బాక్సర్లకు బై

భారత స్టార్‌ బాక్సర్‌, ప్రపంచ నెంబర్‌ వన్‌ అమిత్‌ పంగల్‌ (52 కేజీలు)కు తొలి రౌండ్‌లో బై లభించింది. గురువారం వెల్లడించిన బాక్సింగ్‌ డ్రాలో అతడితోపాటు సతీశ్‌ కుమార్‌ (+91 కేజీ), ఆశిష్‌ చౌదరి (75 కేజీ), మనీశ్‌ కౌశిక్‌ (63 కేజీ)లకు  బై లభించింది. మహిళా బాక్సర్లలో సిమ్రన్‌జిత్‌ కౌర్‌ (60 కేజీ), లవ్లీనా బొర్గోహైన్‌ (69 కేజీ)లకు కూడా బై లభించింది. 


రెండువేల దిశగా కేసులు

టోక్యోలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. గురువారం 1979 కేసులు నమోదయ్యాయి. జనవరి 15న అత్యధికంగా 2044 పాజిటివ్‌ కేసులు రాగా.. ఆ తర్వాత పెద్ద సంఖ్య లో కేసులు వెలు గుచూడడం ఇదే తొలిసారి. మరోవైపు ఒలింపిక్‌ గ్రామంలో చెక్‌రిపబ్లిక్‌కు చెందిన బీచ్‌ వాలీబాలర్‌, డచ్‌ తైక్వాండో క్రీడాకారిణి పాజిటివ్‌గా తేలారు. దాంతో విలేజ్‌లో కొవిడ్‌ బారినపడిన వారి సంఖ్య పదికి చేరింది. 


వైదొలిగిన గినియా 

టోక్యోలో కొవిడ్‌ కేసులు వేగంగా పెరుగుతున్న తరుణంలో తమ అథ్లెట్ల ఆరోగ్య భద్రతను దృష్టిలో పెట్టుకొని ఒలింపిక్స్‌కు దూరంగా ఉంటున్నామని ఆఫ్రికా దేశమైన గినియా వెల్లడించింది. ఉత్తర కొరియా తర్వాత విశ్వక్రీడల్లో పాల్గొనడం లేదని ప్రకటించిన రెండో దేశం గినియానే. ఈ దేశం నుంచి ఐదుగు రు అథ్లెట్లు టోక్యోలో పాల్గొనాలి. కానీ, తాజా నిర్ణయంతో గినియా జట్టు సభ్యుల్లో ఒకరైన రెజ్లర్‌ తమ దేశ ప్రభుత్వ నిర్ణయంపై అసహనం వ్యక్తం చేసింది.



పోటీలు జరిగే రోజులు -    17

పాల్గొంటున్న దేశాలు - 204

పోటీలు జరిగే క్రీడలు - 33

పోటీలు జరిగే వేదికలు -   43

మొత్తం అథ్లెట్లు -      11,500

భారత్‌ తరఫున అథ్లెట్లు - 127

కొత్తగా ప్రవేశపెట్టిన క్రీడలు - 5

మొత్తం పతకాంశాలు - 339

అమెరికా తరఫున పాల్గొంటున్న అథ్లెట్లు - 613

రోజూ చేయనున్న కొవిడ్‌ పరీక్షలు - 80,000


భారత అథ్లెట్లపై  అంచనాలు

ఎన్నడూలేని రీతిలో ఈసారి భారత అథ్లెట్లపై భారీగానే అంచనాలు నెలకొన్నాయి. 127 మంది బృందం నుంచి అభిమానులు ఎక్కువగానే పతకాలు ఆశిస్తున్నారు. రియో గేమ్స్‌లో కేవలం సింధు, సాక్షి మాలిక్‌ మాత్రమే దేశం గర్వపడేలా చేశారు. కానీ ఈసారి యువ అథ్లెట్ల ప్రవేశంతో అందరికీ ఆశలు చిగురించాయి. ముఖ్యంగా ఆర్చరీ, షూటింగ్‌లో కచ్చితంగా పతకాలు వస్తాయని భావిస్తున్నారు. వ్యక్తిగతంగా చూస్తే.. సింధు (బ్యాడ్మింటన్‌), బజ్‌రంగ్‌ పూనియా, వినేశ్‌ ఫొగట్‌ (రెజ్లింగ్‌), అమిత్‌ పంగల్‌, మేరీ కోమ్‌ (బాక్సింగ్‌), మీరాబాయి చాను (వెయిట్‌ లిఫ్టింగ్‌), నీరజ్‌ చోప్రా (జావెలిన్‌ త్రో), సౌరభ్‌ చౌధరి, మనూ భాకర్‌ (షూటింగ్‌), దీపికా కుమారి, అతాను దాస్‌ (ఆర్చరీ)లపై భారత అభిమానులు గంపెడాశలు పెట్టుకున్నారు. వీరితో పాటు ఊహించని విధంగా కొత్త తారలు కూడా వెలిగిపోవాలని కోరుకుందాం.


టోక్యోలో నేడు (భారత్‌)

ఆర్చరీ (ఉ. 5.30 నుంచి):  మహిళల వ్యక్తిగత క్వాలిఫికేషన్‌ రౌండ్‌ (దీపికా కుమారి)

మిక్స్‌డ్‌ టీమ్‌ క్వాలిఫికేషన్‌ రౌండ్‌ (అతాను దాస్‌, ప్రవీణ్‌ జాదవ్‌, తరుణ్‌దీప్‌)

- ఉ. 9.30 నుంచి



Updated Date - 2021-07-23T09:36:25+05:30 IST