అడుగడుగునా ఆంక్షలు

ABN , First Publish Date - 2021-07-07T06:35:56+05:30 IST

కొవిడ్‌ మహమ్మారి కారణంగా టోక్యో విశ్వక్రీడల వీక్షణకు అడుగడుగునా ఆంక్షలు ఎదురవుతున్నాయి. తా జాగా ఒలింపిక్స్‌ మారథాన్‌ జరిగే మార్గంలో ప్రజలు భారీగా గుమిగూడే అవకాశం ఉండడంతో...

అడుగడుగునా ఆంక్షలు

  • మారథాన్‌కు ప్రేక్షకులు దూరం
  • ప్రారంభోత్సవానికి వచ్చే వీఐపీల సంఖ్యలోనూ కోత
  • కొవిడ్‌ నిబంధనల గుప్పిట్లో ఒలింపిక్స్‌ 
  • ఒలింపిక్స్‌ మరో 16 రోజుల్లో

టోక్యో: కొవిడ్‌ మహమ్మారి కారణంగా టోక్యో విశ్వక్రీడల వీక్షణకు అడుగడుగునా ఆంక్షలు ఎదురవుతున్నాయి. తా జాగా ఒలింపిక్స్‌ మారథాన్‌ జరిగే మార్గంలో ప్రజలు భారీగా గుమిగూడే అవకాశం ఉండడంతో నిర్వాహకులు వారిని రేసుకు దూరంగా ఉండాల్సిందిగా కోరారు. వైరస్‌ వ్యాపించే అవకాశాలు ఎక్కువగా ఉండడంతో మారథాన్‌, రేస్‌వాక్‌ను చూసేందుకు రావద్దని ప్రకటన విడుదల చేశారు. 

వీఐపీలకూ తప్పని ఆంక్షలు..: ఒలింపిక్స్‌ ప్రారంభోత్సవాలను తిలకించేందుకు దాదాపు పది వేల మంది వీఐపీలకు అవకాశం కల్పించేందుకు తొలుత నిర్వాహకులు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. అయితే, ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఈ సంఖ్యను మరింత తగ్గించేందుకు కసరత్తు చేస్తున్నారట. స్టేడియాల సామర్థ్యంలో 50 శాతం లేదా పది వేల మందిని మాత్రమే పోటీలను వీక్షించేందుకు అనుమతించనున్నామని నిర్వాహకులు ఇప్పటికే ప్రకటించారు.


విజృంభిస్తున్న వైరస్‌: ఒలింపిక్స్‌కు సమయం దగ్గరపడుతుండడంతో నిర్వాహకుల్లో ఆందోళన మొదలైంది. ఇటీవలి కాలంలో జపాన్‌లో మళ్లీ కొవిడ్‌ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతుండడమే దీనికి కారణం. మరోవైపు వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ఆశించిన రీతిలో సాగడం లేదు. జపాన్‌లో ఇప్పటివరకూ 13.8 శాతం మందికి మాత్రమే కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేశారు. 




పూవమ్మ స్థానంలో ధనలక్ష్మి

టోక్యో వెళ్లే 4X400 మిక్స్‌డ్‌ రిలేనుంచి గాయంతో వైదొలగిన పూవమ్మ స్థానంలో తమిళనాడు అథ్లెట్‌ ధనలక్ష్మిని భారత అథ్లెటిక్స్‌ సమాఖ్య ఎంపిక చేసింది. 



Updated Date - 2021-07-07T06:35:56+05:30 IST