కరోనాతో ఖాళీ..పట్టణాల్లో టులెట్‌ బోర్డులు ఫుల్‌

ABN , First Publish Date - 2020-09-26T10:33:19+05:30 IST

సిద్దిపేట పట్టణంలోని భారత్‌నగర్‌, శ్రీనగర్‌కాలనీ, మైత్రివనం, ఆదర్శనగర్‌, హౌజింగ్‌బోర్డు కాలనీల్లో ఇల్లు అద్దెకు

కరోనాతో ఖాళీ..పట్టణాల్లో టులెట్‌ బోర్డులు ఫుల్‌

స్వగ్రామాలకు వెళ్లడంతోనే ఈ పరిస్థితి

అద్దె తగ్గించినా ముందుకు రాని వైనం

కొత్త ఇళ్లకూ బ్రేక్‌.. షాపులపైనా ప్రభావం

యజమానుల ఆదాయానికి గండి

స్కూళ్లు తెరిస్తే కొంత ఉపశమనం


ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సిద్దిపేట, సెప్టెంబరు25: ‘సిద్దిపేట పట్టణంలోని భారత్‌నగర్‌, శ్రీనగర్‌కాలనీ, మైత్రివనం, ఆదర్శనగర్‌, హౌజింగ్‌బోర్డు కాలనీల్లో ఇల్లు అద్దెకు దొరకాలంటే నెలల తరబడిగా వేచిచూస్తారు. ఇల్లు ఖాళీ చేసిన మరుక్షణమే కొత్తవారు వాలిపోతారు. కానీ కరోనా కారణంగా పరిస్థితి తలకిందులైంది. ఆరునెలలుగా టులెట్‌ బోర్డులు దర్శనమిస్తున్నా అద్దె కోసం వచ్చేవారే కరువయ్యారు.’


‘సిద్దిపేట పట్టణంలోని హైదరాబాద్‌ రోడ్డులో వందలాది షాపులుంటాయి. పాత బస్టాండ్‌ నుంచి బ్లాక్‌ ఆఫీస్‌ వరకు ఒక్కషాపు కూడా ఖాళీగా ఉండేది కాదు. కానీ ప్రస్తుత తరుణంలో పలు షాపులను ఖాళీ చేశారు. నెలలు గడుస్తున్నా పరిస్థితిలో మార్పు లేదు.’


ఇటు ఇళ్లు, అటు షాపులపై కరోనా వైరస్‌ తీవ్రమైన ప్రభావం చూపించింది. ఫలితంగా ఇంటి యజమానులకు ప్రతీనెలా టంఛన్‌గా వచ్చే అద్దె డబ్బుకు గండిపడ్డాయి. అద్దె ఇళ్లను అప్పగించేందుకు ఎదురుచూస్తున్నా ప్రయోజనం లేదు. టులెట్‌ బోర్డులు వేలాడుతున్నా అటువైపు కన్నెత్తి చూసే నాథుడే లేకపోయాడు. 


స్వగ్రామాలకు పయనం

గత మార్చిలో కరోనా కారణంగా లాక్‌డౌన్‌ విధించారు. ఈ క్రమంలో జిల్లాలోని సిద్దిపేట, గజ్వేల్‌, హుస్నాబాద్‌, దుబ్బాక, చేర్యాల పట్టణాల్లోని అద్దె ఇళ్లలో నివాసం ఉండే వారు చాలామంది తమ స్వగ్రామాలకు వెళ్లిపోయారు. ఇళ్లలో భారీగా సామాను, వస్తువులు ఉన్నవారు మినహా చిన్నచితకా సామానుతో పట్నం బాట పట్టినవారు అద్దె భారంతోపాటు తమ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు సొంతూళ్లకు తిరుగు పయనమయ్యారు. ఇతర రాష్ర్టాలు, జిల్లాల నుంచి సిద్దిపేట, గజ్వేల్‌ పట్టణాల్లో వందలాది మంది వలస వచ్చి జీవించేవారు. ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు ఇతర కంపెనీల్లో పనిచేయడానికి వచ్చినవారు తిరిగి వెళ్లడంతో ఆ అద్దె ఇళ్లన్నీ ఖాళీ అయ్యాయి. లాక్‌డౌన్‌ ఎత్తివేసినప్పటికీ పరిస్థితిలో మార్పులేదు. అయితే పాఠశాలలు తెరిస్తే పిల్లల కోసం మళ్లీ పట్టణాలకు రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. 


ఇళ్ల యజమానులకు నష్టమే

అప్‌ కమింగ్‌ సిటీగా సిద్దిపేటకు పేరు రావడంతో ఇక్కడ తాత్కాలిక, స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకునేందుకు చాలా మంది వలస వచ్చారు. వీరి రాకతో అద్దె ఇళ్లకు డిమాండ్‌ ఏర్పడింది. ఉదాహారణకు హౌజింగ్‌ బోర్డు కాలనీలో ఓ ఇంటి యజమాని మూడంతస్తుల భవనం కట్టాడు. ఓ అంతస్తులో తన కుటుంబం, మిగితా రెండంతస్తుల్లో అద్దె ఇచ్చాడు. ప్రతీనెలా రూ.25వేల అద్దె పొందేవారు. కరోనా కారణంగా ఆ రెండంతస్తుల్లోనూ గదులు ఖాళీ అయ్యాయి. ఇలా ఎంతోమంది ప్రతీనెల వచ్చే అద్దె డబ్బులు నష్టపోయారు. రూ.8వేలు పలికిన డబుల్‌ బెడ్‌రూం ఇంటిని ఇప్పుడు రూ.6వేలకు ఇస్తామని ప్రకటించినా ఎవరూ ఆసక్తి చూపడం లేదు. రూ.2వేలకు కూడా సింగిల్‌ బెడ్‌రూం ఇస్తున్న పరిస్థితి స్థానికంగా నెలకొంది. హైదరాబాద్‌ రోడ్‌లోని రెండు మడిగెలకు కరోనాకు ముందు రూ.30వేల అద్దెను ప్రతీనెల ఇచ్చేవారు. నాలుగు నెలల క్రితం వారు ఖాళీ చేయగా టులెట్‌ బోర్డు పెడితే రూ.20వేలకు రెండు మడిగెలను అద్దెకు అడిగారు. చివరకు ఇటీవలే రూ.25 వేలకు అద్దెకిచ్చినట్లు యజమాని తెలిపాడు. 


కొత్త ఇళ్ల నిర్మాణానికి బ్రేక్‌

కొందరేమో తాము నివాసం ఉండడానికి ఇల్లు నిర్మించుకుంటారు. మరికొందరేమో అద్దెకు ఇవ్వడానికి ఇళ్లను నిర్మిస్తుంటారు. బహిరంగ మార్కెట్‌లో అద్దె ఇళ్లకు డిమాండ్‌ తగ్గడంతో కొత్తగా ఇళ్లు నిర్మించేవారు కూడా పునరాలోచనలో పడ్డారు. తమ ఇళ్ల నిర్మాణానికి బ్రేక్‌ వేస్తూ ఇంటి ప్లాన్‌లోనూ మార్పులు చేసుకుంటున్నారు. మధ్యంతరంగా నిలిచిపోయిన ఇళ్లు కూడా ఉన్నాయి. ‘‘వచ్చే కొద్ది పాటి అద్దె కోసం రూ.10లక్షలు పెట్టి అదనంగా మరో అంతస్తు కట్టాలని అనుకున్నా. కానీ ఇతరుల ఇళ్లలో టులెట్‌ బోర్డులు చూసి నా నిర్ణయాన్ని మార్చుకున్నాను. నా కుటుంబం మాత్రమే ఉండేలా ఇంటి ప్లాన్‌ను సవరించాను’’ అంటూ సిద్దిపేటలోని మైత్రి వనంలో ఇల్లు నిర్మిస్తున్న ఓ వ్యక్తి చెప్పాడు. 

Updated Date - 2020-09-26T10:33:19+05:30 IST