పనులు పూర్తికాకనే టోల్‌ బాదుడు

ABN , First Publish Date - 2021-07-21T06:35:26+05:30 IST

వాహనదారుల ఇబ్బందులను నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) అధికారులు పట్టించుకోవడం లేదు.

పనులు పూర్తికాకనే టోల్‌ బాదుడు
గాదంకి టోల్‌ ప్లాజా

అసంపూర్తిగా తిరుపతి- చిత్తూరు ఆరువరుసల రహదారి

చెన్నై- బెంగళూరు రహదారి పనులూ అసంపూర్తిగానే..

వాహనదారుల ఇబ్బందులను పట్టించుకోని ఎన్‌హెచ్‌ఏఐ


చిత్తూరు, జూలై 20 (ఆంధ్రజ్యోతి): వాహనదారుల ఇబ్బందులను నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) అధికారులు పట్టించుకోవడం లేదు. గుడిపాల మండలంలోని తమిళనాడు సరిహద్దు నుంచి గంగవరం మండలంలోని కర్ణాటక సరిహద్దు ప్రాంతం వరకు (చెన్నై- బెంగళూరు) జాతీయ రహదారి పనులు పూర్తికాకముందే మహాసముద్రం వద్ద తాత్కాలిక టోల్‌గేట్‌ను ఏర్పాటుచేసి రుసుం వసూలు చేస్తున్నారు. రహదారి నిర్మాణం 50 శాతమే పూర్తికావడం.. టోల్‌గేట్‌ వద్ద ఎలాంటి వసతులు లేకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఇటీవలే నేండ్రగుంట సమీపంలోని గాదంకి వద్ద మరో టోల్‌గేట్‌ను ఏర్పాటుచేశారు. చిత్తూరు- తిరుపతి ఆరు వరుసల జాతీయ రహదారి పనులు పూర్తికాకముందే ఇక్కడ టోల్‌గేట్‌ను ఏర్పాటు చేయడంతో వాహనదారులు ఆగ్రహావేశాలకు గురవుతున్నారు.ఈ విషయమై ఎన్‌హెచ్‌ఏఐ అధికారులను వివరణ కోరగా రహదారి నిర్మాణం పూర్తయిన వరకే టోల్‌ ధరలు నిర్ణయించామంటున్నారు.


61కి 50 కిలోమీటర్లే పూర్తి..

చిత్తూరు సమీపంలోని కుక్కలపల్లె నుంచి తిరుపతి సమీపంలోని మల్లవరం క్రాస్‌ వద్దకు 61 కిలోమీటర్ల మేర రహదారిని ఆరు వరుసలుగా అభివృద్ధి చేసేందుకు గత ప్రభుత్వ హయాంలో రూ.1800 కోట్ల కేంద్ర నిధులు మంజూరయ్యాయి. టీడీపీ హయాంలో అప్పటి కలెక్టర్‌ ప్రద్యుమ్న, జేసీ గిరీష జాతీయ రహదారుల మీద ప్రత్యేక దృష్టి పెట్టి దాదాపు భూసేకరణ పూర్తి చేయించారు.ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు తమకు అప్పగించిన భూమి వరకు రహదారి నిర్మాణాన్ని పూర్తి చేయించారు. రైల్వే శాఖతో పాటు కొన్ని చోట్ల రైతుల నుంచి భూమిని సేకరించి ఎన్‌హెచ్‌ఏఐ అధికారులకు అప్పగించడంలో తరువాత జిల్లా యంత్రాంగం విఫలమైంది. దీంతో వారు చేసేదేమీలేక 50 కిలోమీటర్లను మాత్రమే పూర్తి చేశారు.


వసతుల్లేకుండానే వసూళ్లు

చెన్నై- బెంగళూరు జాతీయ రహదారి నిర్మాణం కూడా గత ప్రభుత్వ హయాంలో అధికారుల నిత్య పర్యవేక్షణతో పరుగులు పెట్టింది.గుడిపాల మండలంలోని నంగమంగళం నుంచి బంగారుపాళ్యం మధ్య జరిగే పనులకు రూ.450 కోట్లు, బంగారుపాళ్యం నుంచి కర్ణాటక సరిహద్దు నంగిలి నడుమ జరిగే పనులకు రరూ.600 కోట్ల నిధులు విడుదలయ్యాయి. ఈ రెండింటిలో బంగారుపాళ్యం- నంగిలి హైవే పనులు చాన్నాళ్ల కిందటే పూర్తయ్యాయి. నంగమంగళం- బంగారుపాళ్యం పనులు ప్రభుత్వం మారాక నత్తనడకన సాగుతున్నాయని చెప్పడం కంటే ఆగిపోయాయి అని చెప్పవచ్చు. ఈ భాగంలో చిత్తూరు నగర సమీపంలోని కుక్కలపల్లె క్రాస్‌ నుంచి నంగమంగళం వరకు దాదాపు 25 కిలోమీటర్ల రహదారి పనులు అర్ధంతరంగా ఆగిపోయాయి. అయినా అధికారులు గతేడాది ఏప్రిల్‌లో హడావిడిగా తాత్కాలిక టోల్‌గేటును ఏర్పాటుచేసి వసూళ్లు మొదలుపెట్టేశారు.



Updated Date - 2021-07-21T06:35:26+05:30 IST