Jun 14 2021 @ 23:30PM

టాలీవుడ్‌: బ్యాక్‌ టు షూట్‌!

కరోనా సెకండ్‌ వేవ్‌ ఉదృతి కాస్త తగ్గుముఖం పట్టి, కేసులు సంఖ్య తగ్గడం, అన్‌లాక్‌ ప్రక్రియ మొదలవ్వడంతో సినిమా పరిశ్రమ షూటింగ్‌లు మొదలుపెట్టడానికి సిద్ధమవుతోంది. తెలంగాణాలో లాక్‌డౌన్‌ ఉదయం ఆరు గంటల నుంచి ఒంటి గంట వరకూ పొడగించినప్పటి నుంచే కొందరు సెట్స్‌లో అడుగుపెట్టి చిత్రీకరణలు మొదలుపెట్టారు. సాయంత్రం ఆరు గంటల వరకూ పొడగించాక అనధికారంగా మరికొందరు సెట్లో అన్ని జాగ్రత్తలూ తీసుకుంటూ షూటింగ్‌లు నిర్వహించారు. అయితే ఈ సోమవారం నుంచి పలు నిర్మాణ సంస్థలు షూటింగ్‌లు మొదలుపెట్టాయని తెలుస్తోంది. కొందరు తారలు ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పోస్ట్‌లు కూడా పెట్టారు. హీరో  నితిన్ 'మాస్ట్రో'  చిత్రీకరణలో పాల్గొన్నారు  నిఖిల్‌ ‘18 పేజేస్‌’, ‘కార్తికేయ 2’ చిత్రీకరణకు సిద్ధమవుతున్నా’ ఓ ఫొటో షేర్‌ చేశారు. దీనితో  ‘సందడి మొదలవుతోంది’ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో స్టార్‌ హీరోలు సెట్‌లో అడుగు పెట్టడానికి సై అంటారా లేదా అన్నది చూడాలి.

ఆర్‌ఎఫ్‌సీలో ఆగలేదు...

రామోజీ ఫిల్మ్‌ సిటీలో షూటింగ్‌లు మాత్రం ఆగలేదని సమాచారం. అక్కడ వేసిన సెట్స్‌లో బాలీవుడ్‌ చిత్రాల షూటింగ్‌లు బాగా జరుగుతున్నాయట. మధ్యలో తాత్కాలికంగా రెండు, మూడు రోజులు షూటింగ్‌లు నిలిపేశారు. ఇప్పుడు తెలుగు సీరియళ్లు, షోలు, సినిమాలు కూడా జరుగుతున్నాయి.