Abn logo
May 21 2020 @ 12:33PM

మమ్మల్ని కాదు.. వాళ్లను దృష్టిలో ఉంచుకోండి: మెగా మీటింగ్‌లో చిరంజీవి

తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో ఇండస్ట్రీకి చెందిన పెద్దలందరూ సమావేశం అయ్యారు. ఇప్పటికే పలు రాష్ట్ర ప్రభుత్వాలు సినిమా షూటింగ్స్‌కు అనుమతి ఇవ్వడంతో.. టాలీవుడ్‌ పరిస్థితేంటి..? అనేదానిపై ప్రభుత్వంతో చర్చించడానికి ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో అక్కినేని నాగార్జున, దర్శకధీరుడు రాజమౌళి, నిర్మాత దిల్ రాజు, హీరో నాని, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, జెమిని కిరణ్, అల్లు అరవింద్, కొరటాల శివ, సి కళ్యాణ్, రవి కిషోర్, త్రివిక్రమ్, నిర్మాత రాధాకృష్ణ, నిర్మాత నాగ వంశీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు పరిస్థితి విన్నవించారు.


‘‘ఈ రోజు మనందరం ఇక్కడ సమావేశం అవడానికి ప్రధాన కారణం షూటింగ్ ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది?.. థియేటర్లు ఎప్పటి నుంచి పున:ప్రారంభమవుతాయి అనే విషయాలపై ప్రభుత్వం నుంచి ఏదో ఒక సమాధానం రావాలి అనే దానిపై మనం ఈ మీటింగ్ ఏర్పాటు చేశాము.


లాక్‌డౌన్ ముగుస్తున్న సందర్భంలో ఆయా రంగాలకు ప్రభుత్వం షరతులతో కూడిన సడలింపులు ఇస్తోంది. ఇలాంటి తరుణంలో సినీ రంగం భవిష్యత్తు ఏంటి అనే మీమాంస ప్రతి ఒక్కరిలోనూ ఉంది. షూటింగ్‌లు ప్రారంభించేందుకు మనకు ఎవరి పర్మిషన్ అక్కర్లేదు. కానీ, ఇలాంటి ప్రత్యేక పరిస్థితుల్లో కరోనా వ్యాప్తికి మనం కారణం కాకూడదనే చిన్న గిల్ట్‌తో ప్రభుత్వం సహకారంతో వారి నియమ నిబంధనలకు లోబడి మన షూటింగ్స్‌ను అత్యంత జాగ్రత్తగా చేసుకుందాం.


విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాల కోసమే లేక షూటింగ్ మధ్యలో ఉన్న సినిమాల దర్శకనిర్మాతల కోసమో చేస్తున్న వినతి కాదు. రెక్కాడితే గానీ, డొక్కాడని పరిస్థితిలో ఉన్న 14 వేల మంది రోజువారీ సినీ కార్మికులను దృష్టిలో ఉంచుకుని చేస్తున్న విన్నపం. ఈ 14 వేల మంది పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని సినిమాటోగ్రఫీ మంత్రిగారికి, ముఖ్యమంత్రిగారికి నేను విన్నవిస్తున్నా.’’ అంటూ చిరంజీవి ప్రసంగించారు.


అనంతరం అక్కినేని నాగార్జున మాట్లాడుతూ..‘‘ఆల్రెడీ థాయిలాండ్‌లో షూటింగ్స్ మొదలయ్యాయి. థాయ్‌లాండ్ ప్రభుత్వం ఇచ్చిన గైడ్‌లైన్స్ చూసుకుని మనం కూడా సినిమా షూటింగ్స్ స్టార్ చేయాలి. చాలామంది ఆర్టిస్టులు ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నారు కాబట్టి సరిహద్దుల్లో ఆంక్షలు అన్నీ క్లియర్ అవ్వాలి.’’ అన్నారు.


సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ..‘‘ఈ దేశంలోని సినిమా ఇండస్ట్రీల్లో మనదే బెస్ట్ ఉండాలనేది సీఎం గారి కోరిక. బెస్ట్ పాలసీని తీసుకురావాలని సీఎం గారితో చర్చలు జరుపుతున్నాం. సీఎంగారితో చర్చించి త్వరలోనే మంచి సినిమా పాలసీని ప్రకటిస్తాం.’’ అని తెలిపారు.


Advertisement
Advertisement
Advertisement