Abn logo
May 22 2020 @ 16:49PM

తెలంగాణ సీఎంను కలవబోతోన్న సినీ పెద్దలు

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కబలిస్తున్న కష్టకాలంలో యావత్ భారతదేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ నడుస్తున్న విషయం విదితమే. ప్రస్తుతం 4.0 లాక్‌డౌన్ నడుస్తుండగా.. ఈ సారి మాత్రం మునుపటితో పోలిస్తే చాలా వాటికి సడలింపులు ఇచ్చారు. అయితే అటు కేంద్రం కానీ.. ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు సినీ ఇండస్ట్రీకి మాత్రం అస్సలు సడలింపులు ఇవ్వనే లేదు. కొన్ని సడలింపుల్లో భాగంగా ఏపీలో సినిమా, సీరియల్స్ షూటింగ్ చేసుకోవచ్చని ఇప్పటికే వైఎస్ జగన్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను సైతం జారీ చేసింది. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం నో చెప్పేశారు. ఏపీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా త్వరలోనే శుభవార్త చెప్పొచ్చని దర్శకనిర్మాతలు, టాలీవుడ్ పెద్దలు వేయి కళ్లతో వేచి చూస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో మెగాస్టార్ ఇంట్లో సినీ పెద్దలు చర్చలు జరిపిన విషయం తెలిసిందే.


అసలు సినిమా షూటింగ్స్‌పై.. రిలీజ్‌లపై ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి..? ప్రభుత్వాలను ఎలా సంప్రదించాలి..? ఏమేం డిమాండ్ చేయాలి..? అనేదానిపై టాలీవుడ్ పెద్దలు ఓ నిర్ణయానికి వచ్చారట. సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు‌ను కలిసి తీసుకున్న నిర్ణయాలను తెలియజేసేందుకు సినీ ప్రముఖులు చిరంజీవి, నాగార్జున, రాజమౌళి, త్రివిక్రమ్, ఎన్. శంకర్, అల్లు అరవింద్, దిల్ రాజు, రాధాకృష్ణ, సి. కళ్యాణ్, సురేష్ బాబు, కొరటాల శివ, జెమిని కిరణ్, మెహర్ రమేష్, ప్రవీణ్ బాబు తదితరులు సిద్ధమవుతున్నారు. లాక్‌డౌన్ నిబంధనలకు అనుగుణంగా షూటింగ్‌లకు అనుమతులు, థియేటర్స్ ఓపెనింగ్ తదితర అంశాలపై కేసీఆర్‌తో వీరు చర్చించనున్నారు.

Advertisement
Advertisement
Advertisement