వీరి భవిత కంప్యూటర్‌లో భద్రం

ABN , First Publish Date - 2020-07-05T05:30:00+05:30 IST

థియేటర్‌లో తెర మీద బొమ్మ పడి వంద రోజులు దాటింది. ఇవాళో రేపో థియేటర్లు ఓపెన్‌ అవుతాయని ఇంకా ఆశగా కొంతమంది నిర్మాతలు ఎదురుచూస్తూనే ఉన్నారు. పూర్తయిన సినిమాను విడుదల చేయలేక, అప్పు...

వీరి భవిత కంప్యూటర్‌లో భద్రం

థియేటర్‌లో తెర మీద బొమ్మ పడి వంద రోజులు దాటింది. ఇవాళో రేపో థియేటర్లు ఓపెన్‌ అవుతాయని ఇంకా ఆశగా కొంతమంది నిర్మాతలు ఎదురుచూస్తూనే ఉన్నారు. పూర్తయిన సినిమాను విడుదల చేయలేక, అప్పు తీసుకొన్న డబ్బుకు వడ్డీలు కట్టలేక ఇక వేచి చూసే ఓపిక లేక కొందరు నిర్మాతలు ఓటీటీ వైపు అడుగులు వేస్తున్నారు. అయితే మనసులో బాధను భరిస్తూనే పైకి మాత్రం నిబ్బరంగా ఉంటూ థియేటర్‌లోనే తమ సినిమాను విడుదల చేస్తామంటున్నారు ఇంకొందరు నిర్మాతలు. సినిమా వ్యాపారం సాధారణ స్థాయికి రావడానికి మరి కొన్ని నెలలు పట్టవచ్చని అంటున్నారు. ఇప్పటికే తమిళంలో, బాలీవుడ్‌లో కొందరు నిర్మాతలు ఓటీటీకి ఓటేయడంతో ఈ నెల్లో చాలా చిత్రాలు అమెజాన్‌ ప్రైమ్‌, నెట్‌ఫ్లిక్స్‌ వంటి ఓటీటీ వేదికలలో స్ట్రీమింగ్‌ కానున్నాయి. ఇవన్నీ చూశాక మీడియం రేంజ్‌ బడ్జెట్‌లో సినిమాలు తీసిన నిర్మాతల్లో కూడా కొత్త ఆలోచనలు మొదలవుతున్నాయి. వారి సంగతి అలా ఉంచితే భవిష్యత్‌ గురించి ఎన్నో ఆలోచనలతో, ఆశలతో ఉన్న కొంతమంది నటులు, దర్శకులను కరోనా బాగా దెబ్బతీసిందనే చెప్పాలి. సినిమా పూర్తయినా కూడా ప్రేక్షకుల ముందుకు వెళ్లలేని పరిస్థితి వారిది. భవిష్యత్‌ను అలా  కంప్యూటర్లలో భద్రంగా ఉంచుకొన్న వారి మీద ఓ లుక్‌ వేద్దామా! 


నిశ్శబ్దం

థియేటర్లు తెరిస్తే తమ కొత్త చిత్రాలతో సందడి చేసేందుకు పలువురు దర్శక నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు. అలా ముస్తాబైన చిత్రాల్లో అనుష్క నటించిన ‘నిశ్శబ్దం’ కూడా ఉంది. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే థియేటర్లలో కాకుండా ఓటీటీలోకి వస్తుందని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. అమెజాన్‌ ప్రైమ్‌తో డీల్‌ సెటిల్‌ అయిందనీ, అగ్రిమెంట్‌ చేయాల్సి ఉందని కూడా అంటున్నారు. అయుతే వారం రోజుల్లో తొలి కాపీ వస్తుందని కనుక అప్పుడే విడుదల విషయంలో నిర్ణయం తీసుకొంటామని నిర్మాతలు అంటున్నారు.


హేమంత్‌ మధుకర్‌ ఈ  చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇంతకుముందు ఆయన  2011లో ‘వస్తాడు నా రాజు’ చిత్రానికి దర్శకత్వం వహించారు. మధ్యలో ఒకటి రెండు హిందీ చిత్రాలకు దర్శకత్వం వహించినా, తొమ్మిదేళ్ల అనంతరం తెలుగులో చేస్తున్న చిత్రం ‘నిశ్శబ్దం’. అందుకే ‘నిశ్శబ్దం’ చిత్రం ఆయనకు  కీలకం. గతంలో రామవిజేత బేనరుపై పలు చిత్రాలకు దర్శకత్వం వహించిన కె.బాబూరావు తనయుడే ఈ హేమంత్‌. తండ్రిలాగా ఎక్కువ సినిమాలకు దర్శకత్వం వహించాలనే కోరిక హేమంత్‌కు ఉంది. 




ఉప్పెన

థియేటర్లు ఎప్పుడు ఓపెన్‌ చేస్తారా! అని అందరి కంటే ఎక్కువగా మెగా కుటుంబం ఎదురు చూస్తోంది. ఎందుకంటే  హీరో సాయితేజ్‌ తమ్ముడు పంజా వైష్ణవ్‌ తేజ్‌ ‘ఉప్పెన’ సినిమాతో కథానాయకుడిగా పరిచయమవుతున్నారు.నిజానికి ఈ సినిమా షూటింగ్‌ ఎప్పుడో పూర్తయింది. ఏప్రిల్‌ 2న విడుదల చేయాలనుకున్నారు కూడా. అయితే కరోనా కారణంగా ప్లాన్‌ అంతా తల్లకిందలైంది. సినిమాలో ఇటీవల విడుదల చేసిన రెండు పాటలకు అద్భుతమైన స్పందన రావడంతో ‘ఉప్పెన’ మీద అంచానాలు భారీగా పెరిగాయి. తన తమ్ముడు నటించిన ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని సాయితేజ్‌ చాలా సార్లు చెప్పారు. సినిమా థియేటర్లు ఎప్పుడు ఓపెన్‌ చేస్తారో తెలియని అనిశ్చిత పరిస్థితులు ఏర్పడడంతో ఒక దశలో చిత్రనిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్‌ ఓటీటీలో విడుదల చేద్దామా అని ఆలోచన చేసింది. అయితే మెగా ఫ్యామిలీ నుంచి వ్యతిరేకత ఎదురైందని తెలిసింది. కొత్త హీరో సినిమా థియేటర్లో కాకుండా ఇలా ఓటీటీలో విడుదల చేయడం అతని కెరీర్‌కు మంచిది కాదని చెప్పడంతో చిత్రనిర్మాణ సంస్థ వెనుకడుగు వేసింది. థియేటర్లు ఎప్పుడు ఎదురుచూస్తున్నారా అని అందరితో పాటు ఎదురుచూస్తున్నారు వైష్ణవ్‌తేజ్‌.




30 రోజుల్లో ప్రేమించడం ఎలా?

టీవీ యాంకర్‌గా బాగా పాపులర్‌ అయిన ప్రదీప్‌ మాచిరాజును హీరోగా పరిచయం చేస్తూ ఎస్వీ బాబు నిర్మించిన సినిమా ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’. అమృతా అయ్యర్‌ కథానాయిక. నిజం చెప్పాలంటే ప్రదీ్‌పకు ఇదే తొలి సినిమా కాదు. ఇంతకుముందు కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించారు. అయితే హీరోగా నటించిన తొలి సినిమా మాత్రం ఇదే. అందుకే రిజల్ట్‌ ఎలా ఉంటుందా అని ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు ప్రదీప్‌ ఆయన అభిమానులు  కూడా ‘30 రోజుల్లో ఎలా?’ చిత్రం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. 


ఈ సినిమాలో మూడే మూడు పాటలు ఉన్నాయి. వాటిల్లో ‘నీలి నీలి ఆకాశం ’ పాట ను సోషల్‌ మీడియా వేదికగా విడుదల చేయగా,ఇప్పటివరకూ దాదాపు 200 మిలియన్ల మంది ఆ పాటను చూశారట! 

మార్చి 25నే ఈ సినిమా విడుదల కావాలి. కానీ కరోనా కారణంగా థియేటర్లు మూసెయ్యడంతో ఇప్పటికీ విడుదలకు నోచుకోలేదు. ఈ సినిమాతో మున్నా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఎలాగూ ఆలస్యమైంది కనుక థియేటర్లలోనే ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు చిత్ర నిర్మాత ఎస్వీ బాబు.




సోలో బ్రతుకే సో బెటర్‌

ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులు హీరోలుగా నటించిన రెండు చిత్రాలు అంతా రెడీ అయ్యాక కూడా కరోనా కారణంగా ఆగిపోయాయంటే దాని పవర్‌ ఏమిటో అర్ధం చేసుకోవచ్చు. సాయితేజ్‌ హీరోగా నటించిన ‘సోలో బ్రతుకే సో బెటర్‌’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. థియేటర్లు ఎప్పుడు ఓపెన్‌ చేస్తారా అని నిర్మాత బి.వి.ఎ్‌స.ఎన్‌.ప్రసాద్‌ ఎదురుచూస్తున్నారు. 


ఇక ఈ సినిమాతో సుబ్బు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కరోనా లేకపోతే ఈ పాటికే (మే ఒకటిన)  ఈ చిత్రం విడుదలై సుబ్బుకు మరిన్ని మంచి అవకాశాలు తెచ్చి ఉండేది. కాస్త లేట్‌ అయినా చిత్ర విజయం మీద సుబ్బు కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. యువతరానికి మంచి సందేశం ఇచ్చే ఇతివృత్తంతో ఈ సినిమా రూపుదిద్దుకొందని సమాచారం.


వినాయకరావు

Updated Date - 2020-07-05T05:30:00+05:30 IST