మలయాళీ రీమేక్.. హాట్ కేక్!

ABN , First Publish Date - 2020-07-12T05:30:00+05:30 IST

మలయాళ సినిమాలకు మళ్లీ ఇప్పుడు తెలుగులో మాంచి డిమాండ్‌ ఏర్పడింది. కేరళలో విడుదలైన సినిమాలు హిట్టవ్వడమే ఆలస్యం... తెలుగులో రీమేక్‌ రైట్స్‌ హాట్‌ కేకుల్లా అమ్ముడు అవుతున్నాయి...

మలయాళీ రీమేక్.. హాట్ కేక్!

మలయాళ సినిమాలకు మళ్లీ ఇప్పుడు తెలుగులో మాంచి డిమాండ్‌ ఏర్పడింది. కేరళలో విడుదలైన సినిమాలు హిట్టవ్వడమే ఆలస్యం... తెలుగులో రీమేక్‌ రైట్స్‌ హాట్‌ కేకుల్లా అమ్ముడు అవుతున్నాయి. తెలుగు హీరోలు, దర్శక-నిర్మాతలు ఈ మధ్య మలయాళీ సినిమాలపై మరింత మోజు పడ్డారు. త్వరలో సుమారు పది మలయాళ సినిమాల వరకూ తెలుగులో రీమేక్‌ కానున్నట్టు భోగట్టా. ఆ జాబితాలో చిరంజీవి, రవితేజ, రానా తదుపరి సినిమాలు ఉన్నాయి. రీమేక్‌ అంటే అక్కడి సినిమాను ఉన్నది ఉన్నట్టుగా ఇక్కడ తీయడం కాదు. కథలో ఆత్మను పట్టుకుని, మన తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు తీయాలి. అదే పనిలో దర్శకులు ఉన్నారు. తెలుగులో రీమేక్‌ కానున్న మలయాళ సినిమాలపై ఒక లుక్‌ వేద్దామా?


‘లూసిఫర్‌’, ‘అయ్యప్పనుమ్‌ కోషియమ్‌’, ‘కప్పెల’, ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ చిత్రాలు అఫీషియల్‌గా అనౌన్స్‌ చేసిన రీమేక్స్‌. ఇవి కాకుండా ‘హెలెన్‌’ను పీవీపీ సంస్థ రీమేక్‌ చేయడానికి సన్నాహాలు చేస్తోందని సమాచారం. మలయాళ సినిమా ‘పడయోట్టం’ ఆధారంగా సుశాంత్‌ ఓ గ్యాంగ్‌స్టర్‌ డ్రామా చేస్తున్నట్టు వినికిడి. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ హీరోగా నటించిన ‘డ్రైవింగ్‌ లైసెన్స్‌’ను పవన్‌కల్యాణ్‌ హీరోగా రీమేక్‌ చేయడానికి ఓ అగ్ర నిర్మాత సన్నాహాలు చేస్తున్నారని గుసగుస. అయితే, తర్వాత దానిపై ఎటువంటి వార్త రాలేదు. ఇవి కాకుండా మరికొన్ని సినిమాలు చర్చలో దశలో ఉన్నాయట.




‘మెగా’ రీమేక్‌!

చిరంజీవి సినిమా అంటే ఫైటులు, కామెడీ సీన్లు, హీరోయిన్‌తో పాటలు కంపల్సరీగా ఉండాల్సిందే. ఆయన్నుంచి అభిమానులు ఆశిస్తారు కూడా! అయితే, హీరోయిన్‌ అంటూ ఎవరూ లేని ఓ మలయాళ సినిమా రీమేక్‌లో నటించడానికి మెగాస్టార్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. అదే ‘లూసిఫర్‌’ సిన్మా. రాష్ట్ర రాజకీయాలు, రాజకీయ పార్టీలు ఎత్తుకు పైఎత్తులు వేయడం, డ్రగ్‌ మాఫియా నేపథ్యంలో సినిమా సాగుతుంది. ఇందులో హీరోయిన్‌ లేకపోవచ్చు. కానీ, హీరోయిజమ్‌ కావలసినంత ఉంది. అందుకే, మనసు పడ్డారేమో! మలయాళంలో మోహన్‌లాల్‌ హీరోగా నటించారు. హీరో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ దర్శకుడిగా పరిచయమయ్యారు. తెలుగులో ‘రన్‌ రాజా రన్‌’, ‘సాహో’ ఫేమ్‌ దర్శకుడు సుజీత్‌ దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం స్ర్కిప్ట్‌ వర్క్‌ జరుగుతోంది. చిరంజీవి ‘ఆచార్య’ చిత్రాన్ని పూర్తి చేసిన తర్వాత ఈ చిత్రంలో నటించనున్నారని తెలిసింది. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ పతాకంపై రామ్‌చరణ్‌ సినిమా నిర్మిస్తారట. అన్నట్టు... మెగాస్టార్‌ హిట్‌ సినిమాలలో ఒకటైన ‘హిట్లర్‌’ మలయాళీ రీమేకే. మంచి కథలు, తన ఇమేజ్‌కి సూటవుతుందని అనిపించిన తమిళ, హిందీ సినిమాలను సైతం చిరంజీవి రీమేక్‌ చేశారు.


మల్టీస్టారర్‌ రీమేక్‌!

రవితేజ, రానా దగ్గుబాటి కలిసి ఓ సినిమా చేస్తున్నారు. టైటిల్‌ ఇంకా ఖరారు చేయలేదు. అయితే, అదే కథతో మలయాళంలో ‘అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌’ సినిమా వచ్చింది. నిజం చెప్పాలంటే... ఈ హీరోలు ఇద్దరూ చేస్తున్నది ఆ సినిమా రీమేక్‌. మల్టీస్టారర్‌ సినిమాలు చేయడానికి రానా ఎప్పుడూ రెడీయే. గతంలో ఆయన కొన్ని సినిమాలు చేశారు కూడా! ‘శంభో శివ శంభో’, ప్రయోగాత్మక చిత్రం ‘దొంగల ముఠా’... మల్టీస్టారర్‌ సినిమాల విషయంలో రవితేజ ఆచితూచి వ్యవహరిస్తారు. పైగా, రీమేక్‌ కథలకు కాస్త దూరంగా ఉంటారు. రానాతో సహా ఆయనను సైతం ‘అయ్యప్పనుమ్‌ కోషియమ్‌’ మెప్పించిందంటే... కథలో సమ్‌ఽథింగ్‌ స్పెషల్‌ ఉన్నట్టే కదా! నిజాయతీగా వ్యవహరించే ఓ పోలీస్‌ అధికారి, అవమాన భారంతో రగిలిపోయే మాజీ ఆర్మీ అధికారి మధ్య సంఘర్షణే చిత్రకథాంశం. ఎవరూ ఎక్కువా కాదు... ఎవరూ తక్కువా కాదు అన్నట్టు ఉంటుంది. దీనికి సాగర్‌ చంద్ర దర్శకత్వం వహించనున్నారు. గతంలో ‘అయ్యారే’, ‘అప్పట్లో ఒకడుండేవాడు’ సినిమాలకు ఆయన దర్శకత్వం వహించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది.


‘ఫలక్‌నుమా దాస్‌’ చెంతకు ‘కప్పెల’?

విష్వక్‌ సేన్‌కు కథానాయకుడిగా, దర్శకుడిగా పేరు తీసుకొచ్చిన సినిమా ‘ఫలక్‌నుమా దాస్‌’. అది మలయాళ సినిమా ‘అంగమలై డైరీ్‌స’కి రీమేక్‌. ఆ సినిమా తర్వాత ‘హిట్‌: ది ఫస్ట్‌ కేస్‌’ చేశారు విష్వక్‌. ప్రస్తుతం అతని చేతిలో ‘హిట్‌’ సీక్వెల్‌, ‘పాగల్‌’ సినిమాలు ఉన్నాయి. అవి రెండూ కాకుండా మరో మలయాళ సినిమా రీమేక్‌లో నటించే అవకాశాలు ఉన్నాయని ఫిల్మ్‌నగర్‌ టాక్‌. ‘అయ్యప్పనుమ్‌ కోషియమ్‌’ను రీమేక్‌ చేస్తున్న సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ, ఈ ఏడాది మలయాళంలో చిన్న సినిమాగా విడుదలై మంచి విజయం సాధించిన ‘కప్పెల’ రీమేక్‌ రైట్స్‌నూ కొనుగోలు చేసింది. అందులో ఓ హీరో పాత్రకు విష్వక్‌ సేన్‌ను సంప్రదించారని సమాచారం. అతడూ అంగీకరించాడట. ఓ పల్లెటూరు యువతికి ఫోనులో ఆటో డ్రైవర్‌ పరిచయమవుతాడు. అజ్ఞాత వ్యక్తిని గుడ్డిగా నమ్మడం వల్ల ఆమె ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొందనేది చిత్రకథ.


ఇంతకు ముందు...

తెలుగులో మలయాళ సినిమాలు రీమేక్‌  సంస్కృతి కొత్తగా వచ్చిందేమీ కాదు. ఎప్పట్నుంచో ఉంది. మూడేళ్ల క్రితం నాగార్జున నటించిన ‘రాజు గారి గది 2’, మలయాళ సినిమా ‘ప్రేతమ్‌’కి రీమేక్‌. గతేడాది మలయాళ సినిమా ‘ఎబిసిడి’ని అదే పేరుతో అల్లు శిరీష్‌, అంతకు ముందు ‘ప్రేమమ్‌’ను అక్కినేని నాగచైతన్య అదే టైటిల్స్‌తో రీమేక్‌ చేశారు. వెంకటేశ్‌ ‘దృశ్యం’, ‘బాడీగార్డ్‌’ సినిమాలు, జగపతిబాబు ‘పెద్దరికం’, ‘హనుమాన్‌ జంక్షన్‌’, రాజశేఖర్‌ ‘మనసున్న మారాజు’, తరుణ్‌ ‘నువ్వే కావాలి’, సునీల్‌ ‘పూలరంగడు’ సహా ‘మాతృదేవో భవ’ సైతం మలయాళీ రీమేక్‌ సినిమాలే. చెప్పుకొంటూ వెళితే ఇంతకు ముందు చేసిన రీమేక్స్‌ చాలా ఉన్నాయి.


ఓటీటీకి  మలయాళీ కేక్‌!

విమర్శకుల ప్రశంసలు, ప్రేక్షకుల అభినందనలు అందుకున్న ‘కేరాఫ్‌ కంచెరపాలెం’ చిత్రం తర్వాత వెంకటేశ్‌ మహా దర్శకత్వం వహించిన సినిమా ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’. తొలి చిత్రానికి సొంత కథను ఎంచుకున్న ఈ దర్శకుడు, మలి చిత్రానికి మలయాళీ కథను తీసుకోవడం విశేషం. అయితే, ఫ్రేమ్‌ టు ఫ్రేమ్‌ జిరాక్స్‌ కాపీలా తీయకుండా... తనదైన శైలిలో తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు తెరకెక్కించారట. ఇందులో సత్యదేవ్‌ హీరోగా నటించారు. సినిమాలో అతనో ఫొటోగ్రాఫర్‌. సాఫ్ట్‌ పర్సన్‌. సాఫీగా చింతలేకుండా సాగుతున్న అతని జీవితంలో అనుకోని ఘటన ఉగ్ర రూపం దాల్చేలా చేస్తుంది. ప్రతీకార నేపథ్యంలో సాగే ఈ సినిమాలో చక్కటి భావోద్వేగాలు ఉన్నాయని తెలిసింది. ఏప్రిల్‌ 17న చిత్రాన్ని విడుదల చేయాలనుకున్నారు. కానీ, కరోనా అడ్డుపడింది. ఇప్పుడీ సినిమాను ఓటీటీలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇది ‘మహేశింటే ప్రతీకారం’ చిత్రానికి రీమేక్‌.


Updated Date - 2020-07-12T05:30:00+05:30 IST