ఉల్లి, టమాటో ధరల జోరు

ABN , First Publish Date - 2021-10-17T23:37:45+05:30 IST

గత కొన్నిరోజులుగా నిలకడగా ఉన్న కూరగాయల ధరలకు ఒక్క సారిగా రెక్కలు వస్తున్నాయి. గత కొన్నిరోజులుగా సామాన్యులను కంగుతినిపిస్తున్నటమాటా ధరలు రోజురోజుకూ పైకి పోతున్నాయి.

ఉల్లి, టమాటో ధరల జోరు

హైదరాబాద్‌: గత కొన్నిరోజులుగా నిలకడగా ఉన్న కూరగాయల ధరలకు ఒక్క సారిగా రెక్కలు వస్తున్నాయి. గత కొన్నిరోజులుగా సామాన్యులను కంగుతినిపిస్తున్నటమాటా ధరలు రోజురోజుకూ పైకి పోతున్నాయి. తాజాగా ఉల్లిగడ్డ ధరలుకూడా మళ్లీ పెరుగుతున్నాయి. నిన్న మొన్నటి వరకూ వంద రూపాయలకు 5 నుంచి 6 కేజీలు పలికిన ఉల్లిగడ్డ తాజాగా రిటైల్‌ మార్కెట్‌లో కిలో 40 నుంచి 50రూపాయలకు చేరింది. వంద రూపాయలకు 2 నుంచి రెండున్నకిలోలు మాత్రమే అమ్ముతున్నారు. దీంతో సామాన్య ప్రజలు మళ్లీ కూరగాయల ధరలు పెరిగిపోతున్నాయంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ జిల్లాల నుంచి హైదరాబాద్‌కు తరలి వస్తున్న టమాటా సరఫరా బాగా తగ్గిపోయిందని వ్యాపారులు చెబుతున్నారు. అకాల వర్షాల వల్ల పంట నష్టం రావడం వల్ల డిమాండ్‌కు తగ్గట్టుగా సరఫరా కావడం లేదు.


ప్రస్తుతం రిటైల్‌ మార్కెట్‌లో కిలో టమాటా 60 నుంచి 70 రూపాయలు పలుకుతోంది. అదీ నాణ్యత అంతంత మాత్రంగానే ఉంటోంది. హైదరాబాద్‌ మార్కెట్‌లకు సాధారణరోజుల్లో రోజుకు 150 నుంచి 180 లారీల టమాటా దిగుమతి అవుతుంది. కానీ ప్రస్తుతం పంటనష్టాల వల్ల రోజుకు 80లారీలు కూడా సరిగ్గా రావడం లేదని వ్యాపారులు చెబుతున్నారు. దీంతో ధరలు పెరుగుతున్నట్టు చెబుతున్నారు. ఇక ఉల్లి పంట కూడా అకాల వర్షాల వల్ల పాడైపోవడంతోనే ధరలు పెరిగినట్టు వ్యాపారులు తెలిపారు. పైగా మహారాష్ట్ర నుంచి కూడా సరఫరా బాగా తగ్గిందని అంటున్నారు. తెలంగాణ జిల్లాల్లో పంటే పంట వర్షాల కారణంగా పాడైపోయిందని చెబుతున్నారు. మరో నెల రోజుల పాటు పరిస్థితి ఇలాగే ఉంటుందని వ్యాపారులు చెబుతున్నారు. 

Updated Date - 2021-10-17T23:37:45+05:30 IST