ములకలచెరువుకు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ టమోటా

ABN , First Publish Date - 2021-11-29T06:23:23+05:30 IST

ములకలచెరువు మార్కెట్‌కు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల నుంచి టమోటాలు దిగుబడి అవుతున్నాయి. ఆదివారం టమోటా మార్కెట్‌కు వెయ్యికిపైగా బాక్సులు వచ్చాయి.

ములకలచెరువుకు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ టమోటా
ములకలచెరువు మార్కెట్‌కు విక్రయానికి వచ్చిన టమోటాలు

30 కిలోల బాక్సు రూ.1500


టమోటా పంటల్లో పడుతున్న దొంగలు


ములకలచెరువు, నవంబర్‌ 28: ములకలచెరువు మార్కెట్‌కు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల నుంచి టమోటాలు దిగుబడి అవుతున్నాయి. ఆదివారం టమోటా మార్కెట్‌కు వెయ్యికిపైగా బాక్సులు వచ్చాయి. వరుస తుఫాన్ల కారణంగా టమోటా పంట దెబ్బతినింది. దీంతో స్ధానిక మార్కెట్‌కు గతంలో 50 లారీలకుపైగా కాయలు విక్రయానికి వచ్చేవి. ఈ క్రమంలో  వర్షాల కారణంగా 15 లారీల కాయలు కూడా రావడం లేదు. పంట దిగుబడి భారీగా తగ్గిపోవడంతో పాటు తమిళనాడు రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు అక్కడ టమోటా పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో ఇక్కడి టమోటాలకు డిమాండ్‌ భారీగా పెరగడంతో ఒక్కసారిగా ధరలు ఆకాశాన్నంటాయి. ఈ నేపథ్యంలో ములకలచెరువు మార్కెట్‌లో కిలో టమోటా రూ.100 పైగా పలికింది. వర్షాలకు పంటలు దెబ్బతినడంతో డిమాండ్‌ను బట్టి టమోటాలు ఈ ప్రాంతం నుంచి రాకపోవడంతో వ్యాపారులు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. బయటి రాష్ట్రాల నుంచి టమోటాలు దిగమతి చేసుకుంటుడడంతో ధరలు కూడా భారీగా తగ్గాయి. రూ.100 వరకు పలికిన ధర క్రమంగా తగ్గుతూ రూ.35కు చేరింది. ప్రస్తుతం మళ్ళీ వర్షాలు కురుస్తుండడంతో మార్కెట్‌కు విక్రయానికి టమోటాలు తక్కువగా రావడంతో ఆదివారం ధరలు మళ్లీ పెరిగాయి.  30 కిలోల బాక్సు అత్యధికంగా రూ.1500 పలికింది. నాణ్యతను బట్టి రూ.700 నుంచి రూ.1500 వరకు పలికింది. 


పొలాల్లో దొంగలు


టమోటా ధరలు పెరగడంతో రాత్రి వేళల్లో  దొంగలు పొలాల్లోకి చొరబడుతున్నారు. రాత్రి ఒంటి గంట తరువాత వెళ్లి టమాటాలను కోసుకుంటున్నారు. నాయనిచెరువుపల్లె రోడ్డులో ఓ రైతు సాగుచేసిన టమోటా పంటలోకి ఇద్దరు దొంగలు చొరబడి ప్రతి రోజు ఐదు బాక్సుల కాయలు కోసుకెళ్లేవారు. కాయల దిగుబడి తగ్గుతుండడంతో రైతు రాత్రంతా పంట వద్ద కాపుకాచి ములకలచెరువుకు చెందిన ఇద్దరు టమోటా దొంగలకు దేహశుద్ధి చేశారు. అలాగే పీటీఎం రోడ్డులో కూడా టమోటాలను దొంగలిస్తుండడంతో రైతులు పంటల వద్ద కాపలాకాస్తున్నారు. 

Updated Date - 2021-11-29T06:23:23+05:30 IST