టమాటా రైతుకు ధరాఘాతం

ABN , First Publish Date - 2021-01-17T06:20:43+05:30 IST

టమాటా ధర ఒక్కసారిగా పడిపోయింది. రెండు నెలల క్రితం వరకు కిలో టమాటా ధర రూ.30 నుంచి రూ.40 వరకు ఉండగా, సంక్రాంతి తర్వాత ధర తగ్గింది.

టమాటా రైతుకు ధరాఘాతం

భారీగా తగ్గిన ధర 

కిలో రూ.5 

ఉత్పతి పెరగడమే కారణం

సూర్యాపేట సిటీ, జనవరి 16: టమాటా ధర ఒక్కసారిగా పడిపోయింది. రెండు నెలల క్రితం వరకు కిలో టమాటా ధర రూ.30 నుంచి రూ.40 వరకు ఉండగా, సంక్రాంతి తర్వాత ధర తగ్గింది. టమాటా సాగు విస్తీర్ణం పెరగడం, ఒక ఎకరానికి 20 టన్నుల దిగుబడి వస్తుండటం తదితర కారణాలతో మార్కెట్లలో టమాట ధర తగ్గిందని ఉద్యనవనశాఖ అధికారులు పేర్కొంటున్నారు. కాగా, ధర తగ్గడంతో వినియోగదారులకు ఊరట లభించగా, టమాటాను సాగు చేసిన రైతులు నష్టపోతున్నారు.


పెరిగిన సాగు విస్తీర్ణం

టమాటా సాగు విస్తీర్ణం పెరగడం కూడా ధర తగ్గడానికి కారణమైంది. గతంలో సూర్యాపేట జిల్లాలో టమాటా సాగు విస్తీర్ణం 200 ఎకరాల కంటే తక్కువగా ఉండేది. ప్రస్తుతం 500 ఎకరాలకు పైగా టమాటా సాగవుతోంది. చలిగాలులు, గాలిలో తేమశాతం పెరగడం టమాటా పంటకు అనుకూలమైన వాతావరణం. దీంతో పూత రాలే అవకాశం తక్కువగా ఉండటంతో దిగుబడి పెరిగిందని ఉద్యనవన శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది సబ్సిడీపై టమాటా నారును ఉద్యనవనశాఖ అధికారులు రైతులకు పంపిణీ చేశారు. జిల్లాలో పత్తి తరువాత టమాటా సాగుకు రైతులు ఆసక్తి చూపించారు. సాఽధారణంగా ఒక ఎకరాకు 10 టన్నుల దిగుబడి వస్తుంది. అయితే ఈ ఏడాది ఎకరాకు 20 టన్నుల మేర టమాటా దిగుబడి వచ్చిందని రైతులు చెబుతున్నారు. నీటి సౌకర్యం, వాతావరణం అనుకూలంగా ఉండటంతో దిగుబడి పెరిగింది. కూరగాయల సాగు విస్తీర్ణంలో సూర్యాపేట జిల్లాలో చివ్వెంల మండలం ప్రథమ స్థానంలో ఉంది. జిల్లా వ్యాప్తంగా 900 ఎకరాల్లో కూరగాయలు సాగు అవుతుండగా, ఒక్క చివ్వెంల మండలంలో 700 ఎకరాల్లో కూరగాయలు సాగవుతున్నాయి.


నష్టం మిగ్చిలిన టమాటా

ఈ ఏడాది టమాటాను సాగు చేసిన రైతులకు ధర తగ్గడంతో పెట్టుబడులు కూడా రాని పరిస్థితి ఏర్పడింది. పంటను మార్కెట్‌కు తరలిస్తే ఆటో చార్జీలు కూడా రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంక్రాంతి పండుగకు ముందు మార్కెట్‌లో టమాటా ధర కిలో రూ.30 పలికింది. అయితే జిల్లాలోని ఇతర మండలాల నుంచి కూడా ఒకేసారి మార్కెట్లకు టమాటా రావడంతో వ్యాపారులు ధర తగ్గించి ఇస్తున్నారని రైతులు వాపోతున్నారు.


ఉత్పత్తి పెరగడమే కారణం : శ్రీధర్‌, సూర్యాపేట జిల్లా ఉద్యనవనశాఖ అధికారి

జిల్లాలో గత ఏడాదికి మించి ప్రస్తుత సీజన్‌లో టమాటా సాగు విస్తీర్ణం పెరిగింది. రైతులకు సబ్సిడీపై టమాటా నారు అందజేశాం. దీంతో చాలా మంది రైతులు టమాటా సాగుకు ముందుకు వచ్చారు. ఫలితంగా పంట విస్తీర్ణం పెరిగింది. వాతావరణం సైతం అనుకూలించడంతో దిగుబడి పెరిగింది. టమాటా ఉత్పతి పెరగడంతో ధర తగ్గింది.

Updated Date - 2021-01-17T06:20:43+05:30 IST