Dhoni కోసం దాదాని ఒప్పించడానికి 10 రోజులు పట్టింది: మాజీ సెలక్టర్

ABN , First Publish Date - 2021-06-02T22:51:09+05:30 IST

మహేంద్ర సింగ్ ధోనీ.. టీమిండియాను అన్ని ఫార్మాట్లలోనూ నెంబర్ వన్‌గా నిలిపిన అత్యుత్తమ కెప్టెన్.

Dhoni కోసం దాదాని ఒప్పించడానికి 10 రోజులు పట్టింది: మాజీ సెలక్టర్

మహేంద్ర సింగ్ ధోనీ.. టీమిండియాను అన్ని ఫార్మాట్లలోనూ నెంబర్ వన్‌గా నిలిపిన అత్యుత్తమ కెప్టెన్. ప్రపంచపు అత్యుత్తమ ఫినిషర్లలో ఒకడు. భారత్ తరఫున నెంబర్ వన్ వికెట్ కీపర్/బ్యాట్స్‌మెన్. ఈ ఝార్ఖండ్ డైనమైట్‌ను తెర పైకి తీసుకురావడంలో మాజీ సెలక్టర్ కిరణ్ మోరేదే కీలక పాత్ర. ధోనీ ఎంపికకు సంబంధించిన విశేషాలను కిరణ్ మోరే తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్‌తో పంచుకున్నారు. 


`2003 వన్డే ప్రపంచకప్ అనంతరం ఓ వికెట్ కీపర్/బ్యాట్స్‌మన్‌ను జట్టులోకి తీసుకోవాలనుకున్నాం. అప్పటికి కీపింగ్ చేస్తున్న రాహుల్ ద్రవిడ్‌‌పై ఒత్తిడి తగ్గించడంతో పాటు మంచి ఫినిషర్ అయి ఉండాలని భావించాం. 6, 7 స్థానాల్లో బ్యాటింగ్ వచ్చి వేగంగా 40-50 పరుగులు చేసే పవర్ హిట్టర్ కావాలనుకున్నాం. ఆ సమయంలో నా సహచరుల ద్వారా ధోనీ గురించి తెలుసుకున్నా. అతడి ఆట చూసేందుకు ఒక మ్యాచ్‌కు వెళ్లాను. జట్టు స్కోర్ 170 అయితే ధోనీ ఒక్కడే 130 పరుగులు చేశాడు. అతడి ఆటతీరు నాకు బాగా నచ్చింది. బౌలర్లందరినీ చితకబాదేశాడ`ని చెప్పాడు. 


`2003-04 దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఈస్ట్‌జోన్ తరఫున ధోనీ చేత కీపింగ్ చేయించాలనుకున్నాం. అప్పటికి ఆ టీమ్ తరఫున దీప్ దాస్ గుప్తా కీపర్‌గా ఆడుతున్నాడు. ధోనీ గురించి దీప్ దాస్, గంగూలీతో తీవ్రంగా చర్చించాం. వారిద్దరూ కోల్‌కతాకు చెందినవారు. అప్పటికి టీమిండియాకు ఆడుతున్నారు. ఈస్ట్‌జోన్ తరఫున దీప్ దాస్ స్థానంలో ధోనీని తీసుకునే విషయంలో గంగూలీని ఒప్పించేందుకు పది రోజుల సమయం పట్టింది. ఆ మ్యాచ్‌లో ధోనీ తొలి ఇన్నింగ్స్‌లో 21 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 60 పరుగులు చేశాడు. అతడిలో మాకు మ్యాచ్ విన్నర్ కనిపించాడు. ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలుస`ని మోరే చెప్పాడు. 

Updated Date - 2021-06-02T22:51:09+05:30 IST