అంతకన్నా పెద్ద పోరాటం ఏముంటుంది?

ABN , First Publish Date - 2021-06-09T05:30:00+05:30 IST

ఇద్దరు పిల్లలతో రోడ్డున పడి, దిక్కుతోచక అల్లాడిన అయోమయం నుంచి... బాలీవుడ్‌లో అగ్రశ్రేణి స్టంట్‌ఉమన్‌గా ఎదిగిన గీతా టండన్‌ది ఒక స్ఫూర్తిమంతమైన ప్రయాణం

అంతకన్నా పెద్ద పోరాటం ఏముంటుంది?

ఇద్దరు పిల్లలతో రోడ్డున పడి, దిక్కుతోచక అల్లాడిన అయోమయం నుంచి...

బాలీవుడ్‌లో అగ్రశ్రేణి స్టంట్‌ఉమన్‌గా ఎదిగిన గీతా టండన్‌ది ఒక స్ఫూర్తిమంతమైన ప్రయాణం.

జీవితం కన్నా ఎక్కువ భయపెట్టేది మరేదీ లేదంటున్న గీత కథ ఆమె మాటల్లోనే...


‘‘మా అమ్మ నాకు భౌతికంగా దూరమయ్యేవరకూ నాది కూడా అందరిలాంటి బాల్యమే! నాకు తొమ్మిదేళ్ళ వయసులో మా అమ్మ మరణించింది. మా నాన్నలో స్థిరత్వం అంతంత మాత్రం. మా బంధువుల్లో చాలామంది నా బాధ్యత తీసుకోవడానికి ముందుకురాలేదు. కొందరు నన్ను వారి ఇళ్ళకు తీసుకు వెళ్ళినా... ఇంటి పని పూర్తిగా నా మీదే మోపేవాళ్ళు. పేడ ఎత్తడం, పిడకలు చెయ్యడం, వంట కోసం కట్టెలు ఏరుకు రావడం, దుస్తులు ఉతకడం... ఇలా అన్ని పనులూ చేసేదాన్ని. అయితే ఆటల్లో బాగా చురుగ్గా ఉండేదాన్ని. నాకు పదిహేనేళ్ళ వయసున్నప్పుడు... నాకు పెళ్ళి చెయ్యాలని నాన్న, మా బంధువులు నిర్ణయించారు. బాల్య వివాహం నేరమనే సంగతి కూడా అప్పట్లో నాకు తెలీదు. అయితే నాకూ ఒక ఇల్లు దొరుకుతుందనీ, మా అమ్మలా సంసారాన్ని చక్కదిద్దుకోవాలనీ కలలు కన్నాను. కానీ అవి కలలుగానే మిగిలాయి. నా పెళ్ళయిన రెండో రోజు నుంచీ నా భర్త నన్ను కొట్టడం ప్రారంభించాడు.


వంట బాలేదంటూ ముఖం మీద విసిరేవాడు. నన్ను ఒక సెక్స్‌ యంత్రంలా చూసేవాడు. నన్ను నానా మాటలూ అనేవాడు. పెళ్ళయితే బతుకు ఇలా ఉంటుందని నాకు తెలీదు. అన్నిటినీ పళ్ళ బిగువున భరించాను. పదహారేళ్ళకే మొదటి బిడ్డ పుట్టాడు. కొన్నాళ్ళు నా భర్త బాగానే ఉన్నాడు. మళ్ళీ పరిస్థితి మొదటికొచ్చింది. ఎప్పుడూ కొడుతూ ఉండేవాడు. రెండో బిడ్డ... అమ్మాయి పుట్టింది. నా పిల్లల్ని ఆ వాతావరణంలో పెంచితే వాళ్ళ భవిష్యత్తు కూడా నాలాగే తయారవుతుందనిపించింది. నా భర్త హింస రానురానూ ఎక్కువ కావడంతో... ఇరవయ్యేళ్ళ వయసులో అత్తవారి ఇంటి నుంచీ పిల్లల్ని తీసుకొని బయటకు వచ్చేశాను. 


అది నిరూపించాలన్నదే నా ప్రయత్నం...

కాస్త గుర్తింపు వచ్చాక, పెద్ద హీరోయిన్లతో పని చేసే అవకాశాలు దొరికాయి. ‘చెన్నై ఎక్స్‌ప్రె్‌స’లో దీపికా పదుకొనేతో, ‘ఉడ్తా పంజాబ్‌’లో కరీనా కపూర్‌తో పని చేయడంతో మంచి గుర్తింపు వచ్చింది. హిందీ సినిమా ‘సింఘం’తో పేరు సంపాదించుకున్నాను. పరిణితి చోప్రా, శశీ తన్వర్‌ లాంటి నటులు మంచి ప్రోత్సాహం అందించారు. దాంతో బాలీవుడ్‌లో ఎక్కువమంది ప్రిఫర్‌ చేసే స్టంట్‌ ఉమన్‌గా మారాను. ఈ వృత్తిలో ఒక మహిళకు ఎన్నో సవాళ్ళు ఉంటాయి. కేబుల్‌ వైర్ల మీద వేలాడడం, ఎత్తైన భవనాల నుంచీ, కదులుతున్న కారు నుంచీ దూకడం, నిప్పుల్లో నడవడం... ఇలాంటి విన్యాసాల వల్ల శరీరం బాగా అలసిపోతుంది. అదృష్టవశాత్తూ చాలామంది స్టంట్‌ మాస్టర్లు నాకు సాయపడ్డారు. ఈ వృత్తిలో మెలకువలు నేర్పారు. ఎంత నేర్చుకుంటే అంత సంపాదన ఉంటుందని తెలుసుకున్నాను. ఈ వృత్తిలో వివక్ష ఉందని నేను అనుకోవడం లేదు. మన పనితీరు ఆకట్టుకొనే విధంగా ఉంటే అందరూ మెచ్చుకుంటారు. మరోసారి అవకాశం ఇస్తారు. కానీ కొన్ని స్టంట్స్‌ పురుషులే చెయ్యగలరనే అభిప్రాయం కూడా ఉంది. మహిళలు ఏదైనా చెయ్యగలరని నిరూపించాలని ప్రయత్నిస్తూ ఉంటాను.  


వాళ్ళే నా బలం...

ఒక మహిళగా సినీరంగంలో అనుభవాల విషయానికొస్తే.... నేను కలిసిన వారిలో చాలా మంచివాళ్ళూ, ఎంతో చెడ్డవాళ్ళూ ఉన్నారు. మనం మంచిగా ఉంటే పరిశ్రమ కూడా మన పట్ల మంచిగా ఉంటుంది. ఏదైనా నచ్చకపోతే ఆ విషయం స్పష్టంగా చెప్పగలిగి ఉండాలి. ‘‘స్టంట్‌ ఉమన్‌గా అంత రిస్క్‌ తీసుకుంటావ్‌. భయం వెయ్యదా?’’ అనే ప్రశ్న నన్ను తరచూ అడుగుతూ ఉంటారు. ఎందుకు వెయ్యదూ? కానీ జీవితం కన్నా నన్ను భయపెట్టే విషయం మరేదీ లేదు. బతుకు కన్నా పెద్ద పోరాటం మరొకటి ఉండదు. నా పిల్లలే నాకు పెద్ద బలం. మా కోసం సొంత ఇల్లు ఉండాలని ఎంతో తపన పడ్డాను. చివరకు ముంబయిలో నాలుగు గదుల అపార్ట్‌మెంట్‌ కొనుక్కోగలిగాను. నా పిల్లలకు మంచి భవిష్యత్తు అందించాలి. ఆ లక్ష్యం నన్ను అన్ని భయాలనూ దాటి ముందుకు నడిపిస్తోంది. ధైర్యంగా నిలబడి పోరాడేలా చేస్తోంది.’’


డ్యాన్సర్‌ నుంచి స్టంట్‌ ఉమన్‌గా...

బాధలో, రోషంతో ఆ నిర్ణయం తీసుకున్నాను కానీ, రోడ్డెక్కిన తరువాత లోకం ఎలా ఉంటుందో తెలిసింది. కనిపించిన వారందరినీ పని ఇప్పించండని అడిగాను. కానీ ఎవరూ సాయం చెయ్యలేదు. చాలా రోజులు పరిచయస్థుల దగ్గర తల దాచుకున్న తరువాత... బతకడానికి నేనే ఏదో దారి ఎంచుకోవాలని నిర్ణయించుకున్నాను. నేను నివసించే ప్రదేశంలో మహిళల బృందం ఒకటి ఉంది. వాళ్ళు పెళ్ళిళ్ళలో భంగ్రా నృత్యం చేస్తారు. నేనూ చేస్తానని వారి వెంట పడ్డాను. చివరకు వాళ్ళు నన్ను చేర్చుకున్నారు. మొదట్లో బృందంలో అందరికన్నా వెనుక ఉండేదాన్ని. ప్రాక్టీస్‌ చేశాక మెరుగుపడ్డాను. చిన్న చిన్న సినిమాలకు గ్రూప్‌ డ్యాన్సర్లు అవసరమైనప్పుడు... ఆ బృందాన్ని పిలిచేవాళ్ళు.


అలా బాలీవుడ్‌లో ప్రవేశం దొరికింది. ఒకసారి ఓ సినిమా షూటింగ్‌ సమయంలో హెయిర్‌ డ్రెస్సర్‌ ఒకరు పరిచయం అయ్యారు. అప్పట్లో నేను జుట్టు బాగా దగ్గరకు కత్తిరించుకొని, అబ్బాయిలా కనిపించేదాన్ని. నా డ్యాన్స్‌ చూసిన తరువాత... ఆ హెయిర్‌ డ్రెస్సర్‌ ఓ సలహా ఇచ్చారు, ‘‘డ్యాన్సర్లు చాలా మందే ఉంటారు. యాక్షన్‌, స్టంట్స్‌లో ట్రై చెయ్యి’’ అని. ఆలోచించాక అదే మంచిదనిపించింది. ప్రయత్నాలు మొదలు పెట్టాను. ఆరంభంలో ప్రోత్సాహం పెద్దగా లభించలేదు. మెల్లగా చిన్న చిన్న అవకాశాలు వచ్చాయి. పూర్తి స్థాయి స్టంట్‌ లడఖ్‌లో చేశాను. మంటల్లో ఫైట్‌ అది. చాలా గాయాలు తగిలాయి. కోలుకోవడానికి కొన్నాళ్ళు పట్టింది. మరోసారి ముఖం మీద కాలిన గాయాలయ్యాయి. ఇంకోసారి వెన్నుకు పెద్ద దెబ్బ తగిలింది. ప్రతిసారీ మానేద్దామనుకొనేదాన్ని. కానీ అదే నా బతుకుతెరువు అయిపోయింది. 

Updated Date - 2021-06-09T05:30:00+05:30 IST