మళ్ళీ హింస!

ABN , First Publish Date - 2021-10-09T06:35:15+05:30 IST

కశ్మీర్‌లో ఉగ్రవాదులు సామాన్యులను లక్ష్యంగా చేసుకోవడం, వరుస హత్యలతో భయానక వాతావరణాన్ని సృష్టించడం ఆందోళన కలిగిస్తున్నది. ఇటీవల స్థానికంగా మంచిపేరున్న డెబ్బయ్యేళ్ళ ఫార్మాసిస్టు సహా ముగ్గురిని...

మళ్ళీ హింస!

కశ్మీర్‌లో ఉగ్రవాదులు సామాన్యులను లక్ష్యంగా చేసుకోవడం, వరుస హత్యలతో భయానక వాతావరణాన్ని సృష్టించడం ఆందోళన కలిగిస్తున్నది. ఇటీవల స్థానికంగా మంచిపేరున్న డెబ్బయ్యేళ్ళ ఫార్మాసిస్టు సహా ముగ్గురిని హత్యచేసిన ఉగ్రవాదులు, కొద్ది గంటల వ్యవధిలోనే ఓ ప్రభుత్వ పాఠశాలలోకి చొరబడి దాని ప్రిన్సిపాల్‌, టీచర్‌ను హత్య చేశారు. కశ్మీరీ సిక్కు, కశ్మీరీ పండిట్‌, డోగ్రా, బిహారీ కార్మికుడు ఇలా చూసినప్పుడు ఉగ్రవాదులది ఉన్మాదం కాదనీ, ఘాతుకం వెనుక చిక్కని వ్యూహం ఉన్నదని అనిపిస్తుంది. 


వరుస హత్యల ప్రభావం లోయలో లేకుండా పోలేదు. వేర్పాటువాద హురియత్‌ సహా అన్ని పక్షాలూ ఈ ఘాతుకాన్ని తీవ్రంగా ఖండించాయి. కశ్మీరియత్‌కు చెడ్డపేరు తేవద్దని కొందరన్నారు. ప్రధానంగా కశ్మీరీ పండిట్లు ఏమాత్రం భయపడనక్కరలేదనీ, ఎక్కడికీ పోవద్దనీ ఒమర్‌ అబ్దుల్లా వంటి నాయకులు విజ్ఞప్తులు చేసినప్పటికీ, మైనారిటీలు ఆత్మరక్షణార్థం అక్కడనుంచి తరలిపోవడమన్నది మాత్రం జరిగిపోతోంది. హత్యలు మిగల్చిన భయం అనుకున్నకంటే ఎక్కువే ఉన్నదన్న విశ్లేషణలను అటుంచితే, వలసలు తాత్కాలికమే కావచ్చును కానీ, ఉగ్రవాదులు ఆశించినట్టుగానే సాగుతున్నాయి. భద్రతాదళాలకు బదులు పౌరులనూ, అందునా పండిట్ల వంటి వారిపై ఉగ్రవాదులు తుపాకులు గురిపెట్టడంతో మూడుదశాబ్దాలనాటి పరిస్థితులు పునరావృతమవుతున్నాయన్న అనుమానం కలుగుతోంది. ఈ ఘాతుకాల వెనుక స్థానిక ఉగ్రవాదులే ఉన్నారన్న వార్తలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. అదే నిజమైతే సరిహద్దులు చొచ్చివచ్చిన ఉగ్రవాదం కంటే మరింత ప్రమాదకరమైన పరిస్థితులు లోయలో తలెత్తబోతున్నాయని అర్థం. చొరబాటుదారులే ఈ ఘాతుకానికి పాల్పడ్డారన్న సర్వసాధారణమైన వాదన కూడా సరైనదే అనుకున్నా, రాబోయే వేసవిలో పరిస్థితి మరింత దిగజారబోతున్నదని అర్థం. లోయలో అంతా సవ్యంగా ఉందనీ, మా గుప్పిట్లోనే ఉందని పాలకులు అంటున్నప్పుడు ఈ ఘటనలు ఎలా జరిగాయన్నది ప్రశ్న. పైగా కేంద్రమంత్రులు కొందరు తొమ్మిదివారాలపాటు జనంతో మమేకమయ్యే కార్యక్రమంలో ఉండగా ఈ ఘాతుకం జరగడం విచిత్రం. రాబోయే రోజుల్లో హోంమంత్రి అమిత్‌ షా కూడా రాబోతున్న నేపథ్యంలో ఈ ఉగ్రదాడి అక్కడి భద్రతను ప్రశ్నిస్తున్నది, కేంద్రాన్ని సవాలు చేస్తున్నది.


మూడుదశాబ్దాల క్రితం కశ్మీర్‌ను వదిలిపోయిన పండిట్లకు తిరిగి ఆశ్రయం కల్పించే క్రమంలో, అక్కడి ప్రభుత్వం ఆగస్టులో ఓ ఆన్‌లైన్ పోర్టల్‌ ఆరంభించి, అందులో వారు దురాక్రమణకు గురైన తమ స్థిరాస్తులపై ఫిర్యాదు చేసేందుకు ఓ అవకాశం కల్పించింది. ఈ విషయంలో ప్రభుత్వం దూకుడుగా పనిచేస్తూ, ఆక్రమణదారులనుంచి ఆస్తులను స్వాధీనం చేసుకుంటూ కనీసం వెయ్యి కేసులు పరిష్కరించిందనీ, ఉగ్రవాదుల దాడికి ఇది కూడా ఓ కారణం కావచ్చునని అంటారు. తాలిబాన్‌ అధీనంలోకి అఫ్ఘానిస్థాన్‌ పోగానే పాకిస్థాన్‌కు ఎక్కడలేని శక్తీ సమకూరడంతో అందరూ కశ్మీర్‌ గురించే భయపడ్డారు. ఈ వెలుపలివాతావరణానికి సమర్థనగానే లోపలిపరిస్థితులూ ఉన్నాయి. రాజకీయపక్షాలన్నింటినీ కేంద్రం నిర్వీర్యం చేసింది. ప్రత్యేక ప్రతిపత్తి రద్దు నిర్ణయం మీద ప్రజల్లో ఉన్న ఆగ్రహమో, ఆవేదనో బయటకు రానివ్వకుండా, శ్రీనగర్‌కూ ఢిల్లీకీ మధ్య సంధానకర్తలుగా ఉపకరించే ఆ కొద్దిమంది నాయకులను సైతం జైళ్ళలో కుక్కి ఒక నిర్బంధ వాతావరణాన్ని కేంద్రం సుదీర్ఘకాలం కొనసాగించింది. స్థానికత నిర్వచనాన్ని సైతం తమకు సానుకూలంగా రాసుకొని, అక్కడి భూముల క్రయవిక్రయాలు, పెట్టుబడులు, స్థానికేతరుల ఉపాధి ఇత్యాది అంశాల్లో చేసిన నిర్ణయాలు మిగతాదేశంతో కశ్మీర్‌ను అనుసంధానించేకంటే స్థానికుల్లో ఎక్కువ ఆగ్రహం కలిగించిందని అంటారు. ఈ ఉగ్రదాడుల లక్ష్యం స్థానికేతరులకు ఏమాత్రం చోటులేదని చెప్పడం. దెబ్బకు దెబ్బ, రక్తానికి రక్తం అంటూ నాయకులు ఏవో ప్రతిజ్ఞలు చేస్తున్నారు. ప్రతీకారం పేరిట స్థానికులకు ఏమాత్రం అన్యాయం జరగనిచ్చినా అంతిమంగా ఉగ్రవాదుల వ్యూహమే నెగ్గుతుంది.

Updated Date - 2021-10-09T06:35:15+05:30 IST