Abn logo
May 14 2021 @ 00:55AM

కరోనా నేర్పుతున్న కఠిన పాఠాలు

గతఒకటిన్నర సంవత్సరాలు (2019–2021) మానవాళి చరిత్రలోనే అత్యంత విషాదకరమైన రోజులు. ఎవ్వరిని పలకరించినా తాము సంతోషంగా ఉన్నామని అనడం లేదు. ఏ వ్యక్తిగత, కుటుంబ, ఆర్థిక సమస్యలు లేని వారు కూడా సంతోషంగా లేరు. బహుశా ఒక దుఃఖభరిత సమాజంలో ఒంటరి మనిషి ఆనందంగా జీవించడం సాధ్యం కాదు అనే సత్యాన్ని కరోనా మన జీవిత అనుభవంలోకి తీసుకొచ్చింది. అంతా సాఫీగా ఉన్నప్పుడు వ్యక్తికి సమాజానికి ఉండే సంబంధం గురించి ఇంత స్పష్టమైన అవగాహన ఉండేది కాదు. మనిషి జీవితానికి అర్థం చేకూర్చేది చుట్టూ ఉండే మనుషులే. సమాజంతో ప్రమేయం లేకుండా వ్యక్తిగతంగా తన జీవితానికి ఒక లక్ష్యాన్ని, అర్థాన్ని నిర్దేశించుకోవడం వ్యక్తికి సాధ్యం కాదు. ఈ జీవిత సత్యం అర్థం చేసుకోవడానికి మానవాళి ఒక సంక్షుభిత అనుభవం నుంచి ప్రయాణం చేయవలసి వచ్చింది. ఈ పాఠం అందరు నేర్చుకున్నారని కచ్చితంగా చెప్పలేము. కానీ కాస్త స్వానుభవం మీద స్పందించగలిగిన వారికి ఇది అవగాహనలోకి వచ్చి ఉంటుంది. మనుషులను కలవడం లేదని, స్నేహితులతో సమయం గడిపే అవకాశమే లేకుండా పోయిందని అందరూ ఫీల్‌ అవుతున్నారు. ఇక సమాజంలో నిరంతరం ఏదో ఒక లక్ష్యం కోసం పని చేస్తున్న సామాజిక మనుషులకు (Social beings) ఇదొక దుర్భర కాలం. సమాజంతో నిరంతరం సంభాషిస్తూ, సామాజిక సమస్యల గురించి సతమతమయ్యే వాళ్ళను కరోనా తుపాకి పట్టుకొని ఇంట్లో కూర్చోబెట్టింది. మనుషులందరినీ ఏదో ఒక ఆందోళన, భయం, అనిశ్చిత వాతావరణం కమ్ముకున్న కాలమిది. ఎన్ని సమస్యలున్నా కరోనా పూర్వకాలం గుర్తుకు తెచ్చుకుంటే మళ్ళీ అలాంటి రోజులు వస్తాయా, అలాంటి కాలం తిరిగి రావాలనే ఒక ఆకాంక్ష మనుషుల్లో మెదులుతున్నది. ఇదే బహుశా సమాజానికి వ్యక్తికి ఉండే అవినాభావ సంబంధం. ఇది ఒక తాత్విక పాఠమైతే మొత్తం అభివృద్ధి నమూనా గురించి కరోనా కొన్ని విలువైన పాఠాలనే నేర్పుతున్నది.


నియోలిబరలిజం వంటి అభివృద్ధి నమూనాలోకి ప్రభుత్వాలు ప్రవేశించాక ప్రపంచ దేశాలు తమ ఆర్థికవ్యవస్థ మీద లేదా తమ ప్రజల జీవితం మీద పట్టు కోల్పోయాయి.  రెండు మూడు దశాబ్దాలుగా రాజ్యం పాత్రను కుదించాలని (minimalist state) ప్రపంచబ్యాంకు 1997లో ప్రచురించిన ఒక విధానపరమైన డాక్యుమెంటులో చాలా బలంగా ప్రతిపాదించింది. ఆ బాట పట్టిన రాజ్యాలు ప్రభుత్వ ఉద్యోగులను లక్షల సంఖ్యల్లో తగ్గించడం, చాలా ఆర్థిక కార్యక్రమాల నుంచి తప్పుకోవడం, సంక్షేమానికి కేటాయించే బడ్జెట్ తగ్గిస్తూ, సంపదను కార్పొరేట్లకు చెందేలా పాలనా వ్యవస్థను ‘సంస్కరించారు’. కరోనా ఒక్కసారిగా దాడి చేయడంతో కార్పొరేట్లు ఆ దాడిని రాజ్యాలే ఎదుర్కోవాలని తప్పించుకున్నాయి. 


కరోనా వల్ల బాధ్యతారహితమైన రాజ్యం మీద విపరీతమైన ఒత్తిడి పెరిగింది. బల ప్రయోగానికి అలవాటు పడ్డ దేశాధినేతలు దిక్కు తెలియని స్థితిలోకి నెట్టబడ్డారు. సరిపోయినన్ని ఆసుపత్రులు లేక, డాక్టర్లు లేక, నర్సింగ్‌ యంత్రాంగం లేక, మందులు లేక, అన్నింటికీ మించి  ప్రాణప్రదమైన ఊపిరికి ఊపిరైన ప్రాణవాయువు అందుబాటులో లేక, వేలాదిమంది కళ్ళముందరే చనిపోతుంటే పాలకులు తమ మానవత్వాన్ని కోల్పోయారా అనిపిస్తోంది. ఆరోగ్యం లాంటి ఒక అత్యవసర సేవను మార్కెటుపరం చేయడం ఎంత సంక్షోభానికి దారితీసిందో సులభంగానే తెలిసిపోతోంది. వైద్యం లాంటి సేవలను ఎవ్వరు ఎంత ఒత్తిడి చేసినా ప్రైవేటీకరించకూడదని బలంగా ప్రస్తావించిన వాళ్ళు ఉన్నారు. ఆ వాదన వినడానికి పాలకులు ఏ మాత్రంగా సిద్ధంగా లేరు. ఏ మాత్రం రాజకీయ, ఆర్థికశాస్త్ర అవగాహన ఉన్న వాళ్ళకైనా ఇది చాలా సులభంగా అర్థమౌవుతుంది. అత్యంత అభివృద్ధి చెందిన దేశంగా పరిగణిస్తున్న అమెరికాలో లక్షలాది మంది చనిపోతుంటే నియోలిబరలిజం సృష్టించిన ట్రంప్‌ లాంటి నాయకులు బాధ్యాతారహితంగా ప్రవర్తించారు. నియంతృత్వ ధోరణులున్న అన్ని సమాజాల్లో ఇదే జరిగింది. నియోలిబరలిజానికి నియంతృత్వానికి చాలా దగ్గరి సంబంధముంది. శవాలు గుట్టలు గుట్టలుగా పడి ఉన్నా, నిర్బంధ చట్టాలను తమ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా ప్రయోగిస్తూ వేధించే పాలనను మనమేమందాం! నియోలిబరలిజం ప్రణాళిక అభివృద్ధిని అంగీకరించదు. బలప్రయోగం, నిర్భంధ చట్టాలు లేకుండా నియోలిబరలిజం అమలు సాధ్యం కాదు. ఈ ధోరణికి కర్మ సిద్ధాంతం బాగా దోహదపడుతుంది. కాని కరోనాలాంటి సంక్షోభానికి ప్రణాళికబద్ధ విధానాలు లేకుండా పరిష్కారాలు సాధ్యం కావు. ఏమీ తోచక లాక్‌డౌన్‌ లాంటి చర్యలు తీసుకుంటే, లక్షలాది వలస కూలీల జీవితం అస్తవ్యస్తంగా మారింది.


ఇక మూడవ పాఠం: శాస్త్రీయజ్ఞానాన్ని ఆస్తిగా మార్చి మేధోహక్కు ద్వారా మానవ జ్ఞానాన్ని ప్రైవేటుపరం చేయడం ఎలాంటి దుష్పరిణామాలకు దారితీస్తుందో చూస్తూనే ఉన్నాం. మానవచరిత్రలో 20వ శతాబ్దం ఆరంభం వరకు జ్ఞానం సర్వ మానవాళి ఉమ్మడి సంపదగా పరిగణించబడేది. నిజానికి జ్ఞానం సామాజికమే. ఏ ఒక్కరు కొత్త జ్ఞానాన్ని సృష్టించలేరు. ఒక గొప్ప ఆవిష్కరణ వెనక వేలాది శాస్త్రజ్ఞుల కృషి ఉంటుంది. ఆ కృషి పరిపక్వమై ఏదో ఒక శాస్త్రవేత్త ద్వారా ఆవిష్కరించబడుతుంది. ఈ ఉమ్మడి కృషిని ఒక శాస్త్రవేత్తకు లేదా ఏదో ఒక సంస్థకు ఆపాదించి దాని మీద మేధోపరహక్కుల పేర జ్ఞానాన్ని ఆస్తిహక్కుగా పరిగణించడం వల్ల ఇవ్వాళ కరోనాకు మందులు కనుక్కున్నా అవి మొత్తం మానవాళికి అందుబాటులోకి రాలేకపోతున్నాయి. ఆ జ్ఞానాన్ని అందరి సంపదగా పరిగణించి ఉంటే కనుక్కున్న ఔషధాన్ని అన్ని దేశాల్లో తయారు చేసుకునే సౌలభ్యం ఉండేది. భారతదేశం, దక్షిణాఫ్రికా లాంటి దేశాలు మేల్కొని దీనికి పరిష్కారాన్ని సూచిస్తే ప్రపంచ దేశాలు మెల్లమెల్లగా సానుకూలంగా స్పందిస్తున్నవి. జ్ఞానాన్ని ప్రైవేటు హక్కుగా పరిగణించడం ప్రపంచానికి ప్రమాదమని సామాజికపరంగా ఆలోచించేవారు హెచ్చరించినా దానిని పట్టించుకున్న నాథులు లేరు. ఇప్పుడు కరోనా సంక్షోభం శాస్త్రీయజ్ఞానాన్ని ఉమ్మడి సంపదగా భావించాలనే ఒక పాఠాన్ని అంతర్జాతీయ ద్రవ్య సంస్థల ముందు పెట్టింది.


కరోనా ఒక రహస్య ఏజెంటుగా ఎవరిలో దాగుందో తెలియదు. దీనికి క్రిమినల్‌ లక్షణాలున్నాయి. అందుకే ఒకరు మరొకరిని కలవడానికి భయపడుతున్నారు. అన్ని మానవ సంబంధాలు సాలెగూడులో చిక్కుకుపోయాయి. అట్లని తిరగడం లేదా అంటే బాధ్యతారహితంగా ఏ జాగ్రత్తలు తీసుకోకుండా తిరుగుతున్నవారు చాలా మందే ఉన్నారు. భయాన్ని పెంచడం తప్ప, ప్రజలలో అవగాహణ కల్పించే సుగుణం మన మీడియాకు లేనే లేదు. తన వ్యక్తిగత తప్పిదం ఇతరులకు హాని చేస్తుంది అనే ఎరుక లేకపోవడం, సామాజిక బాధ్యత అనే ఒక విలువ సమాజంలో లోపించడం వల్ల, ఎంత ప్రమాదమో మనం చూస్తున్నాం. ఆ మాటకు పాశ్చాత్య దేశాల్లో రాజ్యం చేసే సూచనలను తమ వ్యక్తిగత స్వేచ్ఛకు భంగకరమని కూడా భావిస్తున్నారు. ఇది వ్యక్తిని సమాజం నుంచి విడగొట్టడం వల్ల వచ్చిన ఉపద్రవం. వ్యక్తిని సమాజాన్ని సమ్మిళితం చేయడం ఎలా అన్నది ఒక పెద్ద సవాలుగా మారింది. మొత్తం సమాజ శ్రేయస్సు గురించి, మనుషులు అందరూ సుఖంగా జీవించడం గురించిన ఒక స్వప్నం మనుషులందరిలో వికసించకపోతే రాబోయే కాలం మరింత అమానుషంగా, అమానవీయంగా మారే ప్రమాదపు అంచున మనం చిక్కుకుపోయాం. వ్యక్తిని సమాజం నుంచి విడగొట్టడం వల్ల మానవ సమాజం చాలా మూల్యాన్ని చెల్లించుకుంటున్నది. రాబోయే తరాలన్నా ఈ అనుభవం నుంచి మానవీయ, ఉదాత్త విలువలను రంగరించి పాఠాలు నేర్చుకోకపోతే భవిష్యత్తులో కరోనా కంటే మరింత భయానక జబ్బును ప్రకృతి విసిరితే, మానవాళి మనుగడే ప్రశ్నార్థకమవుతుంది.

ప్రొఫెసర్ జి. హరగోపాల్‌

Advertisement