ఆస్టిన్‌ పర్యటన

ABN , First Publish Date - 2021-03-19T10:12:15+05:30 IST

అమెరికా రక్షణమంత్రి లాయిడ్‌ ఆస్టిన్‌ మూడురోజుల భారత పర్యటనలో, రక్షణరంగంలో ఉభయదేశాల సహకారంతో పాటు...

ఆస్టిన్‌ పర్యటన

అమెరికా రక్షణమంత్రి లాయిడ్‌ ఆస్టిన్‌ మూడురోజుల భారత పర్యటనలో, రక్షణరంగంలో ఉభయదేశాల సహకారంతో పాటు, అఫ్ఘానిస్థాన్‌లో భారత్‌ పాత్ర పెంచే విషయంలోనూ మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉన్నది. అమెరికా రక్షణమంత్రులు ఎవరూ ఇంతవరకూ తమ తొలి విదేశీ పర్యటనలో భారతదేశాన్ని చేర్చింది లేదు. క్వాడ్‌ సదస్సుకు కొనసాగింపుగా, చైనాకు ముకుతాడు వేసే అమెరికా లక్ష్యాల్లో భారత్‌ పాత్రను మరింత పెంచేందుకు ఆస్టిన్‌ పర్యటన ఉపకరిస్తుంది. 


‍‍భారత్‌తో బంధాన్ని మరింత హెచ్చవేయాలన్నదే తన పర్యటన లక్ష్యమని అమెరికా నుంచి బయలుదేరేముందు సెనేట్‌ కమిటీకి ఆస్టిన్‌ చెప్పారు. ఇప్పటికే గూఢచర్యం నుంచి ఆధునిక ఆయుధాలవరకూ అన్నింటినీ పంచుకొనే, భారత్‌కు అతిపెద్ద ఆయుధ విక్రేతగా అమెరికా అవతరించే స్థాయికీ ఈ స్నేహం వచ్చింది కనుక, దానిని మరోమెట్టు ఎక్కించి, చైనాకు చెక్‌పెట్టడంమీద ఈ పర్యటనలో ఆయన మంతనాలు జరుపుతారు. ఐదేళ్ళక్రితం అతిపెద్ద రక్షణభాగస్వామిగా భారత్‌ను గుర్తించినప్పటినుంచి ఉభయదేశాల ఆయుధస్నేహం అనేకరెట్లు పెరుగుతూ, తదనుగుణంగా హోదాలూ హెచ్చిన విషయం తెలిసిందే. అలాగే, అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌, భారత ప్రధాని నరేంద్రమోదీ మధ్య వ్యక్తిగత స్నేహం కూడా ఎన్నికల వేళ భారీ బహిరంగ సభలతో పరస్పరం ఇచ్చిపుచ్చుకొనేవరకూ విస్తరించింది. చైనా కట్టడికి ట్రంప్‌ కంటే ఎక్కువగా బైడెన్‌ భారత్‌ను వినియోగించుకోవచ్చునని విశ్లేషకులు అంచనావేస్తున్నారు.


ఈ పర్యటనలో అఫ్ఘానిస్థాన్‌ వ్యవహారంలో భారత్‌కు ఉన్న సంశయాలు, అనుమానాలు కూడా నివృత్తి అవుతాయని అంటున్నారు. గత ఏడాది ఫిబ్రవరిలో దోహాలో తాలిబాన్‌తో డొనాల్డ్‌ ట్రంప్‌ కుదర్చుకున్న ఒప్పందం మేరకు మే 1వతేదీకల్లా అమెరికా సైనికులు అఫ్ఘానిస్థాన్‌నుంచి నిష్క్రమించాల్సి ఉంది. జో బైడెన్‌ ప్రభుత్వం ఆ మాటకే కట్టుబడతానని అంటోంది కానీ, ట్రంప్‌ ఒప్పందంమీద దానికి కొన్ని అనుమానాలున్నాయి. అది అంత చక్కని, చిక్కని ఒప్పందమేమీ కాదని బైడన్‌ ఒక ఇంటర్వ్యూలో తేల్చేశారు. అమెరికా సైనికులను వెనక్కురప్పించడం ఖాయమే కానీ, గడువు కూడా వెనక్కు జరగవచ్చునని చెప్పేశారు. ఈ ప్రకటనమీద తాలిబాన్‌ మండిపడి, ఇచ్చిన హామీకి కట్టుబడని పక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరికలు కూడా చేసింది. మాస్కోలో నేడు రష్యా, చైనా, అమెరికా, పాకిస్థాన్‌ల మధ్యవర్తిత్వంలో, తాలిబాన్‌, అఫ్ఘాన్‌ ప్రభుత్వ ప్రతినిధుల మధ్య చర్చలకు సరిగ్గా ఒకరోజు ముందు బైడెన్‌ ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం. అధికారంలోకి రాగానే ఒప్పందాన్ని తిరగదోడాలని నిర్ణయించుకోవడమే కాక, ఇప్పుడు ఒప్పందం సరిగ్గా లేదనీ, ఉపసంహరణకు మరింత సమయం పట్టవచ్చుననీ బైడెన్‌ అంటున్నారు. అఫ్ఘాన్‌ ప్రభుత్వంతో శాంతిచర్చలకూ, అహింసకూ అంగీకరించిన తాలిబాన్‌, అనతికాలంలోనే ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ హెచ్చుస్థాయిలో హింసకు పాల్పడింది. అల్‌కాయిదాతో సంబంధం తెంపుకోవాలన్న నియమాన్నీ లక్ష్యపెట్టలేదు. అఫ్ఘాన్‌నుంచి అమెరికా తొలగిపోగానే, అధికారంలో నామమాత్రంగా ఉన్న ప్రభుత్వం పనిపడతామని కూడా అది స్పష్టంచేసింది. అఫ్ఘాన్‌లో గతంలో కంటే ఆల్‌కాయిదా మరింత బలపడిందని అమెరికా నిఘావర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, ఒప్పందాన్ని హడావుడిగా అమలుచేసే ఉద్దేశంలో బైడెన్‌ లేరు. చర్చల్లో ఇప్పటికే భాగస్వాములుగా ఉన్న దేశాలతో భారత్‌, ఇరాన్‌ ప్రతినిధులను కూడా చేర్చి శాంతికోసం ఓ సమగ్ర ప్రయత్నం చేయవవలసిందిగా ఆయన ఐక్యరాజ్యసమితికి విజ్ఞప్తిచేశారు. టర్కీని రంగంలోకి దించి దానికీ కొన్ని బాధ్యతలు అప్పగించారు. అఫ్ఘాన్‌ విషయంలో బైడెన్‌ ప్రభుత్వం ఆలోచన ఏమిటో ఆస్టిన్‌ ఈ పర్యటనలో మన పాలకులకు వివరించవచ్చు. ఈ సందర్భంగా మన భద్రత, ప్రయోజనాలతో పాటు, భారత్‌ పాత్ర విషయంలోనూ స్పష్టత సాధించాలి. మధ్యవర్తులుగా ఉన్న మిగతావారికి అక్కడి ఖనిజవనరులు ముఖ్యమేమో కానీ, మనకు అది పక్కలో బల్లెంలాగా పరిణమించకపోవడం ప్రధానం. తాలిబాన్‌, అల్‌కాయిదా జోడీ, పాకిస్థాన్‌ లోపాయికారీ మద్దతు అత్యంత ప్రమాదకరం.

Updated Date - 2021-03-19T10:12:15+05:30 IST