శ్రీలంక పర్యటనతో దేశ ప్రతిష్ఠ దెబ్బతింది: యజుర్వీంద్రసింగ్ సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2021-07-31T01:18:38+05:30 IST

టీమిండియా మాజీ క్రికెటర్ యజుర్వీంద్ర సింగ్ బీసీసీఐపై సంచలన విమర్శలు చేశాడు. శ్రీలంక పర్యటనకు ప్రత్యామ్నాయ భారత జట్టును

శ్రీలంక పర్యటనతో దేశ ప్రతిష్ఠ దెబ్బతింది: యజుర్వీంద్రసింగ్ సంచలన వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ క్రికెటర్ యజుర్వీంద్ర సింగ్ బీసీసీఐపై సంచలన విమర్శలు చేశాడు. శ్రీలంక పర్యటనకు ప్రత్యామ్నాయ భారత జట్టును పంపి దేశం పరువును గంగలో కలిపేశారని ఆరోపించాడు. శ్రీలంకతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను భారత జట్టు 2-1తో గెలుచుకోగా, టీ20 సిరీస్‌ను 1-2తో చేజార్చుకుంది. కృనాల్ పాండ్యాకు కరోనా సోకడం, అతడితో సన్నిహితంగా మరికొందరు మెలగడంతో చివరి రెండు టీ20ల్లో 9 మంది బెస్ట్ ప్లేయర్లు లేకుండానే భారత జట్టు బరిలోకి దిగి భంగపడింది. 


ఈ నేపథ్యంలోనే యజుర్వీంద్రసింగ్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ స్టార్లను అంతర్జాతీయ క్రికెట్‌లో ఆడించడాన్ని ఏమాత్రం సమర్థించని ఆయన.. బోర్డు చర్యతో దేశ పరువు, ప్రతిష్ఠలు ఒక్కసారిగా దెబ్బతిన్నాయన్నాడు.


‘‘ఒక జట్టును ఇంగ్లండ్‌లో టెస్టు సిరీస్‌కు పంపడం, మరో జట్టును శ్రీలంకతో పరిమిత ఓవర్ల సిరీస్‌కు పంపడం అర్థం లేనిది. ఐపీఎల్ ప్రదర్శన నైపుణ్యం ఉన్న క్రికెటర్లకు సూచికే అయినా, అంతర్జాతీయ క్రికెట్ భిన్నమైనది’’ అని యజుర్వీంద్రసింగ్  పేర్కొన్నాడు. 


‘‘నిజానికి మూడు వన్డేలు, అంతే సంఖ్యలో టీ20 సిరీస్ కోసం శ్రీలంకలో పర్యటించడం శుద్ధ దండగ. శ్రీలంక క్రికెట్ బోర్డు ఆర్థిక ఇబ్బందుల్లో ఉండడంతో ఆదుకునేందుకు బీసీసీఐ చేసిన సాయమే తప్ప మరోటి కాదు. అవసరంలో ఆదుకోవడాన్ని ఎవరైనా అభినందించాల్సిందే. అయితే, అదే సమయంలో దేశ పరువు ప్రతిష్ఠలను కూడా దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది’’ అని పేర్కొన్నాడు. 


అలాగే, జట్టులో లెక్కకు మించి మార్పులు చేసి కోచ్ రాహుల్ ద్రావిడ్ కూడా బాధితుడిగా మారాడని యజుర్వీంద్రసింగ్ అన్నాడు. అది ఇండియా ఎ జట్టు కాదన్నసంగతిని అర్ధం చేసుకోవడంలో ద్రవిడ్ విఫలమయ్యాడని పేర్కొన్నాడు. ఈ మ్యాచ్‌లు కూడా రికార్డవుతాయని, ఓటములు ఏళ్లపాటు అలాగే ఉంటాయని అన్నాడు. 68 ఏళ్ల యజుర్వీంద్రసింగ్ 1977-1980 మధ్య భారత్‌కు నాలుగు టెస్టుల్లో ప్రాతినిధ్యం వహించాడు. 

Updated Date - 2021-07-31T01:18:38+05:30 IST