పా‘కల..గా టూరిజం’

ABN , First Publish Date - 2021-06-24T04:23:36+05:30 IST

పాకల బీచ్‌ అభివృద్ధి కలగా మిగిలిపోయింది. పాలకుల అలివిమాలిన నిర్లక్ష్యానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచింది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన అభివృద్ధి పనులను కొనసాగించేందుకు ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం ఇష్టపడడం లేదు.

పా‘కల..గా టూరిజం’
అర్థంతరంగా నిలిచిపోయిన టూరిస్ట్‌ రెస్టారెంట్‌ భవనం

టీడీపీ హయాంలో రూ.4 కోట్లతో 

రెస్టారెంట్‌ పనులు ప్రారంభం

వైసీపీ ప్రభుత్వం వచ్చాక అర్ధంతరంగా ఆపేసిన పనులు

తుప్పుబట్టిపోతున్న ఇనుప సామగ్రి

శిథిలావస్థకు చేరుతున్న నిర్మాణాలు

సింగరాయకొండ, జూన్‌ 23 : పాకల బీచ్‌ అభివృద్ధి కలగా మిగిలిపోయింది. పాలకుల అలివిమాలిన నిర్లక్ష్యానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచింది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన అభివృద్ధి పనులను కొనసాగించేందుకు ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం ఇష్టపడడం లేదు. వివరాల్లోకెళ్తే... పాకలను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యే స్వామి ప్రత్యేక దృష్టి సారించారు. అందులో భాగంగా తీర ప్రాంతాన టూరిస్ట్‌ రెస్టారెంట్‌ నిర్మాణానికి రూ.4 కోట్ల అంచనాతో 2018లో పనులను ప్రారంభించారు. సార్వత్రిక ఎన్నికల వరకు పనులు వేగంగా జరిగాయి. వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు కావడంతో పనులను ఆపేశారు. రెండేళ్లు దాటినా వాటిల్లో ఏమాత్రం కదిలికలేదు. కోట్ల రూపాయలు వెచ్చించి ప్రారంభించిన రెస్టారెంట్‌ నిర్మాణ సామగ్రి తుప్పుపట్టి శిథిలావస్థకు చేరుతున్నాయి.

సహజ సిద్ధ అందాలు పాకలకు సొంతం

ప్రకృతి ప్రసాదించిన సహజ సిద్ధమైన అందాలు, విశాలమైన సముద్ర తీరప్రాంతం, ఆహ్లాదకర వాతావరణం, పురాతనమైన శివాలయం, జాతీయ రహదారి నుంచి 5 కి.మీ దూరంలో ఉండటం ఇవన్నీ పాకల బీచ్‌ ప్రత్యేకతలు. వీటి దృష్ట్యా బీచ్‌కి పర్యాటకులు తాకిడి ఎక్కువుగా ఉంటుం ది. కొండపి, కనిగిరి, కందుకూరు, ఒంగోలు నాలుగు నియోజకవర్గాలలోని పర్యాటకులు తరుచూ వస్తుంటారు. హైవేకి దగ్గరిలో ఉండటం వలన టూరి్‌స్టల సందర్శన కూడా అధికంగా ఉంటుం ది. ప్రతి ఆదివారం సందర్శకుల కోలాహలం నడుమ బీచ్‌ కళకళలాడుతుంటుంది. సందర్శకుల తాకిడి ఎక్కువుగా ఉన్నా సరైన వసతులు లేవు. పర్యాటకంగా అభివృద్ధి చెందడానికి పుష్కల అవకాశాలు ఉన్న బీచ్‌ అభివృద్ధికి ఆమడ దూరంలోనే ఆగిపోయింది. 

గత టీడీపీ హయాంలో జరిగిందిలా...

అభివృద్ధికి నోచుకోని పాకల బీచ్‌పై టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యే స్వామి ప్రత్యేక దృష్టిపెట్టారు. అప్పటి కలెక్టర్‌ వినయ్‌చంద్‌తో పలుమార్లు చర్చించారు. బీచ్‌ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేశారు. మొదటిగా లోకల్‌ టూరిజం ప్రాజెక్టు కింద రూ.40 లక్షలు మంజురయ్యాయి. నందమూరి తారకరామారావు, దామచర్ల ఆంజనేయలు పర్యాటక కేంద్రంగా నామకరణం చేసి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ నిధులు వెచ్చించి బీచ్‌ ఒడ్డున సిమెంట్‌ రోడ్డును నిర్మించారు. రోడ్డుకి ఆనుకొని సైడ్‌ వాల్‌ను నిర్మించి దానిపై సెంటర్‌ లైటింగ్‌ ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా ఉన్న ఈ లైటింగ్‌ సందర్శకులను ఆకర్షించడంతో పాటు వేటకు వెళ్లే మత్స్యకారులకు ఉపయుక్తంగా ఉంటుంది. రెండో దశలో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబుని ఎమ్మెల్యే స్వామి కలసి పాకల పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందడానికి ఉన్న అవకాశాలు వివరించారు. పాకల్లో టూరిజం రెస్టారెంట్‌ నిర్మాణానికి ఏపీటీఏ ద్వారా రూ.4 కోట్ల మంజూరు చేయించారు. వీటి నిర్వహణ పనులను భవానీ ఐలాండ్‌ టూరిజం కార్పొరేషన్‌ చేపట్టింది.

ప్రస్తుత దుస్థితి

గత సార్వత్రిక ఎన్నికల నాటికి దాదాపు రూ.రెండు కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయి. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ పనులు అర్ధంతరంగా ఆగిపోయాయి. రెండేళ్లు దాటినా పాలకులు పట్టించుకున్న పాపానపోలేదు. వారి నిర్లక్యం వలన ఐరన్‌తో నిర్మించిన పైకప్పు తుప్పుబట్టి అక్కడక్కడా లేచిపోయింది. అంతే కాకుండా రెస్టారెంట్‌ చుట్టూ ఐరన్‌తో నిర్మించిన కాంపౌండ్‌ వాల్‌ గిల్స్‌ తుప్పుపట్టి నేలపై పడిపోయాయి. కొన్ని శిథిలావస్థకు చేరుకున్నాయి. వీటి దుస్థితిపై గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోట్ల రూపాయల ప్రభుత్వ సొమ్ము గంగపాలవుతోందని వాపోతున్నారు. రెండేళైన పనులు ముందుకు సాగకపోవడంతో  అధికారులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  

నూతన సాంకేతిక పరిజ్ఞానంతో పనులు ప్రారంభం

సముద్ర ఒడ్డున టూరిజం రెస్టారెంట్‌ను నూతన సాంకేతిక పరిజ్ఞానంతో సుమారు 2 ఏకరాల విస్తీర్ణంలో నిర్మాణ పనులను టీడీపీ ప్రభుత్వంలో ప్రారంభించారు. ఐరన్‌ స్ట్రక్చర్‌తో పైకప్పును నిర్మించారు. దానిపై వీబోర్డులు ఏర్పాటు చేసి, మంగుళూరు టైల్స్‌తో సుందరంగా తీర్చిదిద్దడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. రెస్టారెంట్‌ లోపల సెంట్రల్‌ ఏసీ, రెస్టారెంట్‌ చుట్టూ గ్లాస్‌తో నిర్మాణం చేపట్టడానికి ప్రణాళికలు ఉన్నాయి. చుట్టూ ఐరన్‌ గిల్స్‌తో కాంపౌండ్‌ వాల్‌ని నిర్మించారు.

ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతాం

టి. సంగీతరాజ్‌, బీఐటీసీ ఏఈ

పాకల బీచ్‌ అభివృద్ధికి నిఽధులు కోరుతూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతాం. ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్‌లో నిధుల కేటాయించగానే పనులను పునఃప్రారంభించి పర్యాటకులకు అందుబాటులోకి తెస్తాం. 

అభివృద్ధి చేస్తే వ్యాపారాలు బాగుంటాయి

గోపి మోషే, చికెన్‌ పకోడి బండి నిర్వాహకుడు

పాకలను పర్యాటకం కేంద్రంగా తీర్చిదిద్దితే, మా వ్యాపారం వృద్ధి చెందడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. పాకలను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలి.

అన్ని వసతులూ కల్పించాలి

సింగోతు రాము, కూల్‌ డ్రింక్‌ దుకాణం 

పాకల పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందితే గ్రామంలో చాలా మందికి ఉపాధి అవకాశాలు ఉంటాయి. ఆగిపోయిన టూరిజం రెస్టారెంట్‌ పూర్తికి అధికారులు చొరవ చూపాలి.





Updated Date - 2021-06-24T04:23:36+05:30 IST