కేంద్ర నిధులతో పర్యాటకాభివృద్ధి

ABN , First Publish Date - 2021-10-22T08:03:32+05:30 IST

కేంద్ర ప్రభుత్వ నిధులతో తెలంగాణలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తామని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు.

కేంద్ర నిధులతో పర్యాటకాభివృద్ధి

  • ఇప్పటికే రాష్ట్రంలో పలుచోట్ల పనులు ప్రారంభం.. 
  • రామప్పకు యునెస్కో గుర్తింపు దేశానికే గర్వకారణం
  • ఆలయాన్ని సందర్శించిన కిషన్‌రెడ్డి
  • వేయి స్తంభాల గుడి ఈవోపై ఆగ్రహం


ములుగు, హనుమకొండ, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వ నిధులతో తెలంగాణలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తామని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. ఇప్పటికే పలుచోట్ల పనులుసాగుతున్నాయని తెలిపారు. ములుగు జిల్లాలోని రామప్ప దేవాలయాన్ని రాష్ట్ర పర్యాటక, పురావస్తు శాఖ మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌తో కలిసి గురువారం ఆయన సందర్శించారు. యునెస్కో గుర్తింపు లభించిన తర్వాత తొలిసారి రామప్పకు వచ్చిన కిషన్‌రెడ్డి రామలింగేశ్వర స్వామికి పూజలు చేసి, ఆలయ శిల్పాలను తిలకించారు. యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం దేశానికే గర్వకారణమని కొనియాడారు. గుర్తింపును సూచించే శిలాఫలకంతో పాటు రామప్పలో మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. యునెస్కో నిబంధనలకు అనుగుణంగా ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామన్నారు. రామప్పకు ప్రపంచస్థాయి గుర్తింపు తీసుకురావడం వెనుక కాకతీయ హెరిటేజ్‌ ట్రస్టు పాండురంగరావు, పాపారావు, కేంద్రప్రభుత్వ ప్రతినిధులు, కేంద్ర పురావస్తు డైరెక్టర్‌ జనరల్‌ విద్యావతి, యునెస్కోలో భారత ప్రతినిధి విశాల్‌శర్మ కృషి ఎంతో ఉందని ప్రశంసించారు. కరోనా కారణంగా దేశంలో పర్యాటకరంగం కుంటుపడిందని, తిరిగి గాడిలో పెట్టే ప్రయత్నం జరుగుతోందని వివరించారు. విదేశీ పర్యాటకుల రాక ఇప్పుడిప్పుడే పెరుగుతోందన్నారు. దేశీయ పర్యాటకులకు విమాన చార్జీలలో రాయితీ కల్పించాలని యోచిస్తున్నామన్నారు. 


వరంగల్‌లో విమానాశ్రయాన్ని అభివృద్ధి చేస్తామని, దీనివల్ల విదేశీ పర్యాటకుల రాక పెరిగే అవకాశముందని వివరించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో నిర్వహిస్తున్న ‘ఆజాదీకా అమృత్‌’ కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా 75 చారిత్రక ప్రదేశాలను ఎంపిక చేసి, ఆయా రాష్ర్టాల సహకారంతో అభివృద్ధి చేస్తున్నామని కిషన్‌రెడ్డి తెలిపారు. శ్రీనివా్‌సగౌడ్‌ మాట్లాడుతూ ఏడేళ్లక్రితం వరకు కరువు, వలస ప్రాంతంగా ఉన్న తెలంగాణ...ఇప్పుడు దేశానికే ఆదర్శంగా మారిందని పేర్కొన్నారు. రామప్పకు యునెస్కో గుర్తింపు రావడంతో తెలంగాణకు ప్రపంచస్థాయి ఖ్యాతి వచ్చిందన్నారు. కాకతీయ టూరిజం సర్క్యూట్‌ను ఏర్పాటు చేసి యాదాద్రి నుంచి బొగత జలపాతం వరకు పర్యాటక స్థలాలను అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. రామప్ప సమగ్రాభివృద్ధికి యాక్షన్‌ప్లాన్‌ సిద్ధమైందని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సీతక్క కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరను జాతీయపండుగగా గుర్తించాలని కోరారు. రామప్పకు యునెస్కో గుర్తింపు కోసం కృషిచేసిన పాండురంగారావుతో పాటు పలువురు ఆర్కియాలజీ అధికారులను ఈ సందర్భంగా జ్ఞాపికలతో సత్కరించారు. 


విద్యుత్‌ తీగలు ఇలా వేలాడితే ఎలా?

రామప్ప ఆలయాన్ని సందర్శించిన తర్వాత కిషన్‌రెడ్డి హనుమకొండలోని వేయిస్తంభాల గుడికి చేరుకున్నారు. పెద్దసంఖ్యలో భక్తులు వచ్చే ఈ ఆలయ ప్రవేశమార్గంలో కరెంట్‌ తీగలు అస్తవ్యస్తంగా ఉండడంతో ఈవో వేణుగోపాల్‌పై ఆగ్రహం వ్యక్తంచేశారు. వెంటనే సరిచేయాలని ఆదేశించారు. గర్భగుడి ప్రధాన ద్వారం వద్ద అపరిశుభ్రతపై కిషన్‌రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. తలుపులు శుభ్రంగా లేకపోవడం, కుంకుమ, విబూది పడి ఉండడాన్ని ప్రధాన అర్చకుడు గంగు ఉపేంద్రశర్మ దృష్టికి తీసుకెళ్లారు. రెండు నెలల కిందట తాను ఆదేశించినా ఆలయ మండపం పనులు పూర్తి కాకపోవడాన్ని ప్రశ్నించారు. వంద రోజుల్లో పూర్తయ్యేలా చూడాలని అక్కడిక్కడే ఆదేశించారు. 

Updated Date - 2021-10-22T08:03:32+05:30 IST