Abn logo
Jun 14 2021 @ 23:25PM

పడకేసిన పర్యాటకం

 కరోనాతో ముందుకు సాగని అభివృద్ధి పనులు

 నిధులున్నా ఖర్చు చేయలేని పరిస్థితి

 రూ.2.73 కోట్ల పనులపై నీలినీడలు

 కొత్త ప్రతిపాదనల ఊసే లేదు

(శ్రీకాకుళం-ఆంధ్రజ్యోతి)

పర్యాటక రంగాన్ని కరోనా దెబ్బతీసింది. నిధులున్నా అభివృద్ధి పనులు చేపట్టలేని పరిస్థితిని కల్పించింది. మొదటి దశ కొవిడ్‌ నుంచి కోలుకొని ప్రగతి వైపు అడుగులు వేస్తున్న సమయంలో రెండో దశ ముంచుకొచ్చింది. ఫలితంగా జిల్లాలో పర్యాటక రంగం పూర్తిగా పడకేసింది. సుమారు రూ.2.73కోట్లతో తలపెట్టిన అభివృద్ధి పనులపై నీలినీడలు కమ్ముకున్నాయి. జిల్లాను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్దఎత్తున నిధులు కేటాయించాయి. రూ.2.73కోట్ల అంచనాలతో వివిధ పనులకు అధికారులు శ్రీకారం చుట్టారు. కరోనా రెండోదశ  పుణ్యమా అని ఈ పనులు ముందుకు సాగడం లేదు. 

- సీతంపేటలో రూ.1.60 కోట్ల అంచనాలతో చేపట్టిన ట్రైబల్‌ మ్యూజియం కమ్‌ ఆర్ట్‌ గ్యాలరీ పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. కరోనా కారణంగా సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో సంబంధిత కాంట్రాక్టర్‌ ఈ పనులను అర్ధాంతరంగా వదిలేశాడు.

- రూ.30 లక్షలతో చేపడుతున్న టెక్కలి మండలం రావివలస ఎండలమల్లిఖార్జున స్వామి ఆలయ అభివృద్ధి పనులు కూడా నత్తనడకన సాగుతున్నాయి. 

- ఎచ్చెర్ల మండలం పొన్నాడ కొండపై రూ.58 లక్షల అంచనాలతో ప్రారంభించిన పనులు ముందుకు సాగడం లేదు. 

- గార మండలం మత్స్యలేశంలో శ్రీదేవి, భూదేవి సమేత ఆలయం అభివృద్ధి పనులు సైతం నిలిచిపోయాయి.  

- వజ్రపుకొత్తూరు మండలంలోని శివసాగరం బీచ్‌ వద్ద పనులు ఎప్పుడు పూర్తవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది.

- సీతంపేట అటవీప్రాంతంలో రూ.7కోట్ల అంచనాలతో ప్రారంభించిన జగతి హిల్స్‌ రిసార్ట్స్‌ పనులు కూడా పడకేశాయి. నిర్మాణ పనుల్లో అక్రమాలు జరుగుతున్నాయని విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులకు స్థానిక ఎమ్మెల్యే ఫిర్యాదు చేయడంతో ఆ పనులు జరిగే పరిస్థితి కానరావడం లేదు. 

- శ్రీకాకుళంలో బుద్దిస్ట్‌ సర్క్యూట్‌ పనులదీ ఇదే పరిస్థితి. మొత్తంగా గతేడాది మార్చి నెల నుంచి ఏడాదిన్నర కాలంగా పర్యాటక అభివృద్ధి పనులు ముందుకు సాగడం లేదు. కరోనా రెండో దశ పరిస్థితులు చక్కబడే వరకూ ఈ పనులు జరిగే పరిస్థితి లేదని సంబంధిత అధికారులే చెబుతున్నారు.


కొత్త ప్రాజెక్టులు లేవు

పాత పనులను పక్కన పెడితే కొత్త ప్రాజెక్టుల ఊసు ఎక్కడా లేదు.  అధికారులు కనీసం ప్రతిపాదనలు కూడా తయారు చేయడం లేదు. కోటి రూపాయల అంచనాతో ఇచ్ఛాపురం మండలంలో తలపెట్టిన మినీ కైలాసగిరి ఏర్పాటు కలగానే మిగులుతోంది.   రూ.1.50 కోట్ల అంచనాతో  టెక్కలి మండలం తేలినీలాపురంలోని పక్షుల విడిది కేంద్రం అభివృద్ధి,  నరసన్నపేట సూరం చెరువు పనులు, ఎస్‌ఎంపురం ట్యాంకు పనులకూ మోక్షం లభించడం లేదు.


 పనులు పూర్తి చేస్తాం...

కరోనా వల్ల పర్యాటకం రంగం పనులు ముందుకు సాగడం లేదు.  వీటికి నిధుల కొరత లేదు. మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ ఇటీవల పర్యాటక అభివృద్ధి పనులపై సమీక్షించారు. అన్ని పనులు ప్రారంభించి, గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. త్వరలోనే వాటిని పూర్తి చేస్తాం. 

- నారాయణరావు, పర్యాటకశాఖ అధికారి