పర్యాటకం ప్రచార ఆర్భాటం

ABN , First Publish Date - 2021-09-18T05:36:22+05:30 IST

రాష్ట్ర పర్యాటక శాఖ అధికారుల తీరు విచిత్రంగా ఉంది. చెబుతున్న దానికి, చేస్తున్న దానికి పొంతన ఉండడం లేదు.

పర్యాటకం ప్రచార ఆర్భాటం

సొంత రెస్టారెంట్ల నిర్వహణే ప్రైవేటు సంస్థలకు అప్పగింత

బయట హోటళ్లు తీసుకుని నిర్వహిస్తామంటూ ప్రకటనలు

సిబ్బందికి శిక్షణ కూడా ఇస్తారట...

ఎర్రమట్టి దిబ్బల వద్ద రెండేళ్లుగా ఖాళీగా ఉన్న కంటెయినర్‌ రెస్టారెంట్‌

వారం కిందట ప్రైవేటు సంస్థకు కేటాయింపు

అరకులోయలో నిరుపయోగంగా డ్రైవ్‌ ఇన్‌ రెస్టారెంట్‌

అసంపూర్తిగా ‘ఈట్‌ స్ర్టీట్‌’ నిర్మాణం

లంబసింగిలో కాటేజీలదీ అదే పరిస్థితి


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)


రాష్ట్ర పర్యాటక శాఖ అధికారుల తీరు విచిత్రంగా ఉంది. చెబుతున్న దానికి, చేస్తున్న దానికి పొంతన ఉండడం లేదు. ఇప్పటివరకు పర్యాటక కేంద్రాల్లో రకరకాల వసతులతో పర్యాటక శాఖ నిర్మాణాలు చేపట్టి, ఆంధ్రప్రదేశ్‌ పర్యాటక అభివృద్ధి సంస్థ(ఏపీటీడీసీ)కు అప్పగిస్తోంది. వారు కొన్నింటిని సొంతంగా నిర్వహిస్తూ, మిగిలిన వాటిని టెండర్ల ద్వారా ప్రైవేటు సంస్థలకు అద్దెకు ఇస్తున్నారు. ఎప్పటి నుంచో ఈ విఽధానం నడుస్తోంది. అయితే, తాజాగా రాష్ట్ర ప్రభుత్వం అనేక వ్యాపార రంగాల్లోకి ప్రవేశిస్తామని ప్రకటనలు చేస్తోంది. పర్యాటక రంగంలో కూడా మరింత దూసుకు వెళతామని, రాష్ట్రంలో ఖాళీగా వున్న హోటళ్లు, రెస్టారెంట్లు తామే తీసుకుని నిర్వహిస్తామని తాజాగా ప్రకటించింది. వాటిని వ్యాపార సరళిలో నిర్వహించడానికి ప్రత్యేక శిక్షణ కూడా ఇస్తామని పేర్కొంది. రుషికొండ ఐటీ పార్కులోని స్టార్టప్‌ విలేజ్‌లో హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వహణపై శిక్షణ ఇస్తామని వివరించింది. అది చూసి ఆ శాఖ అధికారులే ముక్కున వేలేసుకుంటున్నారు.


నిర్వహించలేక అద్దెకు...

వాస్తవానికి పర్యాటక శాఖ ప్రభుత్వ నిధులతో నిర్మించిన వాటినే సొంతంగా నిర్వహించలేక ప్రైవేటు సంస్థలకు అద్దెకు ఇస్తోంది. కొన్నిచోట్ల అద్దెకు తీసుకోవడానికి కూడా ఎవరూ ముందుకు రాకపోవడంతో ఆ నిర్మాణాలు కళావిహీనమవుతున్నాయి. రెండేళ్ల క్రితం భీమిలి సమీపాన ఎర్రమట్టి దిబ్బల వద్ద సుమారుగా రూ.2 కోట్లతో కంటెయినర్‌ రెస్టారెంట్‌ నిర్మించి, ఏపీటీడీసీకి అప్పగించారు. ఆసక్తి కలిగినవారు ఎవరైనా ముందుకువస్తే అద్దెకు ఇస్తామని టెండర్లు పిలిచారు. ధర ఎక్కువగా వుండడంతో ఎవరూ ఆసక్తి చూపలేదు. దాంతో రెండేళ్లు ఖాళీగా ఉంది. తాజాగా ‘మెర్లిన్‌ కే’ అనే సంస్థకు అద్దెకు ఇచ్చారు. వారం క్రితమే అక్కడ రెస్టారెంట్‌ ప్రారంభించారు. ప్రైవేటు సంస్థల దగ్గర వున్న రెస్టారెంట్లు, హోటళ్లు తీసుకుంటామని చెబుతున్న అధికారులు మరి ఈ కంటెయినర్‌ రెస్టారెంట్‌ను ఎందుకు అద్దెకు ఇచ్చారో చెప్పాలి.


అరకులోయలో ప్రారంభం కాని డ్రైవ్‌ ఇన్‌ రెస్టారెంట్‌ 

ప్రముఖ పర్యాటక కేంద్రమైన అరకులోయలో పర్యాటకులు నేరుగా వాహనాల్లో కూర్చుని రుచికరమైన వంటకాలు ఆరగించేందుకు ‘డ్రైవ్‌ ఇన్‌ రెస్టారెంట్‌’ నిర్మించారు. రెండేళ్లు అయినా దానిని ప్రారంభించలేదు. స్వయంగా నిర్వహించే ఉద్దేశం లేకపోవడంతో టెండర్ల ద్వారా అప్పగించే ప్రయత్నం చేశారు. ధరలు ఎక్కువగా వున్నాయని ఎవరూ ముందుకురాలేదు. ఇప్పుడు స్థానిక గిరిజన యువకులనే సంఘంగా ఏర్పడి, నిర్వహించాల్సిందిగా కోరుతున్నారు. అయినా ఎవరూ ఆసక్తి చూపడం లేదు.


నిలిచిన ‘ఈట్‌ స్ర్టీట్‌’ నిర్మాణం

అలాగే అరకు సమీపాన కొత్తవలసలో ‘ఈట్‌ స్ర్టీట్‌’ పేరుతో మరో నిర్మాణం చేపట్టారు. దానిని నిధులు లేక మధ్యలో ఆపేశారు. ఇవన్నీ చూస్తుంటే...‘తినడానికి తిండి లేదు..మీసాలకు సంపెంగ నూనె’ సామెతలా పర్యాటక శాఖ అధికారులు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. వారి సొంత ఆస్తులనే నిర్వహించలేక వేరే వారికి అద్దెకు ఇవ్వడానికి నానా పాట్లు పడుతుండగా, ప్రైవేటు రెస్టారెంట్లు, హోటళ్లు తీసుకొని...కార్పొరేట్‌ శైలిలో నిర్వహిస్తామని, దానికి సిబ్బందికి శిక్షణ కూడా ఇస్తామని ఉన్నతాధికారులు చేస్తున్న ప్రకటనలు చూసి అంతా నవ్వుకుంటున్నారు. 


లంబసింగిలో పూర్తికాని కాటేజీలు

చింతపల్లి సమీపాన లంబసింగిలో పర్యాటకుల కోసం రూ.4 కోట్లతో కాటేజీల నిర్మాణం చేపట్టారు. తాను చేపట్టిన పనులకు బిల్లు (సుమారు రూ.1.5 కోట్లు) ఇవ్వడం లేదని రెండేళ్ల క్రితమే కాంట్రాక్టర్‌ పనులు ఆపేశారు. అప్పటి నుంచి అవి అలాగే ఉండిపోయాయి.

Updated Date - 2021-09-18T05:36:22+05:30 IST