Abn logo
Oct 18 2021 @ 00:18AM

మన్యంలో కళకళలాడుతున్న పర్యాటక ప్రాంతాలు

జి.మాడుగుల మండలం కొత్తపల్లి జలపాతంలో పర్యాటకుల సందడి


పాడేరురూరల్‌/జి.మాడుగుల, అక్టోబరు 17: మన్యం అందాలు పర్యాటకుల మనస్సులను దోచుకుంటున్నాయి. ఉదయం పొగమంచు అందాలను  ఆస్వాదిస్తున్నారు. దీంతో పర్యాటక ప్రాంతాలు కళకళలాడాయి. మండలంలోని వంజంగి మంచుకొండలు, జి.మాడుగుల మండలం కొత్తపల్లి జలపాతానికి పర్యాటకుల తాకిడి పెరిగింది. ఆదివారం వంజంగి మంచు కొండలను తిలకించేందుకు అధిక సంఖ్యలో పర్యాటకులు తరలివచ్చారు. అలాగే జి.మాడుగుల మండలం కొత్తపల్లి జలపాతానికి వందలాది మంది పర్యాటకులు వచ్చారు. వర్షాలకు జలపాతంలో నుంచి నీరు ప్రవహించడంతో స్నానాలు చేసేందుకు పర్యాటకులు ఉత్సుకత చూపించారు.

లంబసింగి,చెరువులవేనంలకు తాకిడి

చింతపల్లి: పర్యాటక ప్రాంతాలైన లంబసింగి, చెరువులవేనం గ్రామాలకు పర్యాటకుల తాకిడి పెరిగింది. శీతాకాలం సమీపించడంతో ప్రకృతి అందాలను వీక్షించేందుకు ఆదివారం పెద్ద సంఖ్యలో పర్యాటకులు తరలి వచ్చారు. ఉదయం 6 గంటల నుంచి లంబసింగి, చెరువులవేనం, తాజంగి రిజర్వాయర్‌ వద్ద పర్యాటకుల సందడి నెలకొంది. మంచు అందాలను ఆస్వాదిస్తూ ఫొటోలు తీసుకునేందుకు పర్యాటకులు పోటీ పడ్డారు.

అరకులోయలో సందడి

అరకులోయ: అందాల అరకులోయలో పర్యాటకుల సందడి కొనసాగుతున్నది. వీకెండ్‌, దసరా సెలవులు కావడంతో పర్యాటకులు పెద్ద ఎత్తున అరకులోయను సందర్శించారు. శనివారం రాత్రి రిసార్టులు, లాడ్జీలు ఖాళీ లేవు. రూంలు లభించకపోవడంతో కొందరు పర్యాటకులు వెనుదిరిగారు. ఆదివారం సందర్శిత ప్రాంతాలైన మ్యూజియం, పద్మాపురం గార్డెన్‌, కాఫీ మ్యూజియం, కాఫీహౌస్‌లలో పర్యాటకులు సందడి చేశారు.