బస్వాపూర్‌ వద్ద టూరిస్ట్‌ స్పాట్‌

ABN , First Publish Date - 2021-11-28T05:50:03+05:30 IST

అంతర్జాతీయస్థాయి ఆధ్మాత్మికక్షేత్రంగా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయం రూపుదిద్దుకుంటుంది.

బస్వాపూర్‌ వద్ద టూరిస్ట్‌ స్పాట్‌
ఉన్నతాధికారుల ఏరియల్‌ సర్వే(ఫైల్‌)

 యాదాద్రి క్షేత్రానికి వచ్చే భక్తులకోసం విడిది

 450ఎకరాల్లో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు

 స్టార్‌హోటళ్లు, కన్వెన్షన్‌,ఫంక్షన్‌ హాళ్ల నిర్మాణం

 ఇప్పటికే పలు సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్న టూరిజం శాఖ 

 బస్వాపూర్‌ నుంచి యాదాద్రి వరకు కేబుల్‌ బ్రిడ్జీ...?

 ప్రభుత్వానికి నివేదిక పంపిన ఉన్నతాధికారులు 


 అంతర్జాతీయస్థాయి ఆధ్మాత్మికక్షేత్రంగా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయం రూపుదిద్దుకుంటుంది. కొండపైన ప్రధానాలయ నిర్మాణం తుదిదశకు చేరుకుంటు న్న నేపథ్యంలో ఆలయ పరిసరాలను అభివృద్ధి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా క్షేత్రానికి సమీపంలోని బస్వాపూర్‌ రిజర్వాయర్‌ వద్ద టూరిస్ట్‌ స్పాట్‌ ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు. ఇప్పటికే పలు సంస్థలతో ఒప్పందం చేసుకున్న టూరిజం శాఖ ఆ దిశగా అడుగులు వేస్తోంది. 


యాదాద్రి, నవంబరు 27(ఆంధ్రజ్యోతి): మహిమాన్విత స్వ యంభు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి గర్భాలయ దర్శనాలకు ముహూర్తం ముంచుకొస్తోంది. ఇటీవల ఆలయాన్ని సందర్శించిన కేసీఆర్‌ మార్చి 28న పునఃప్రారంభించనున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్‌ నగరానికి అత్యంత చేరువలో తిరుమలస్థాయిలో దేశంలోనే అద్భుత ఆలయంగా యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులు తుదిదశకు చేరుకున్నాయి. కొద్ది నెలల్లోనే ఆలయ ఉద్ఘాటన తర్వాత యాదాద్రి ఆలయాన్ని దేశ, విదేశాలకు చెందిన వేలాదిమంది భక్తులు సందర్శించనున్నారు. అయితే యాదాద్రి ఆలయాన్ని సందర్శించే భక్తులకు ఆహ్లాదం కల్పించడానికి ఆలయ పరిసరాను అంతర్జాతీయస్థాయిలో అభివృద్ధి చేయాలని సీఎం కేసీఆర్‌ సంకల్పించారు. ఈనేపథ్యంలో భక్తుల అవసరాల కోసం అంతర్జాతీయస్థాయి ప్రమాణాలతో సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోంది. కొండపైన కేవలం ప్రధానాలయంతోపాటు అతిథిగృహం, ఆలయ ఈవో అధికారి కార్యాలయం మాత్రమే ఉంటాయి. ఆలయ ప్రాంగణంలో విష్ణుపుష్కరిణి మినహా ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదు. అదేవిధంగా ఆలయ ప్రాంగణం, చుట్టుపక్కల మద్యం, మాంసంపై నిషేధాన్ని విధిస్తున్నారు. అయితే తలనీలాలు, మొక్కులు తీర్చుకునేందుకు కుటుంబసమేతంగా వచ్చే భక్తులు సరదాగా గడిపేందుకు ప్రధానాలయానికి ఆరుకిలోమీటర్ల దూరంలోని బస్వాపూర్‌(నృసింహస్వామి) ప్రాజెక్టు సమీపంలో టూరి్‌స్టస్పాట్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. బస్వాపూర్‌లో 450ఎకరాల్లో టూరిజంశాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ స్థాయిలో స్టార్‌ హోటళ్లు, కన్వెన్షన్‌ సెంటర్లు, పార్కులు, పెళ్లిళ్లు కూడా చేసుకునేలా ఫంక్షన్‌, బంకెట్‌హాళ్లను నిర్మించేందుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధంచేసింది. అంతర్జాతీయ ప్రమాణాలతో వీటిని నిర్మించనున్నారు. ఉన్నత, మధ్య తరగతి వారు బస చేయడంతోపాటు ఆహ్లాదంగా గడిపేలా సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. టూరిజంశాఖ నేతృత్వంలో ప్రైవేట్‌సంస్థలతో వీటిని ఏర్పాటు చేసేందుకు నిర్ణయించింది. ఈ మేరకు పలు సంస్థలతో అధికారులు సంప్రదింపులు ప్రారంభించారు. ఆలయ సమీపంలో రూ.100కోట్ల పెట్టుబడితో దిపార్క్‌ హోటల్‌ ఏర్పాటుకానుంది. లక్ష్మీనివాసం, జోన్‌ కనెక్ట్‌పేరుతో రెండున్నర ఎకరాల స్థలంలో 400 గదులతో ఫోర్‌ స్టార్‌ హోటల్‌ను నిర్మించేందుకు దిపార్క్‌, లక్ష్మీ నివాసం సంస్థలు ఒప్పందం చేసుకున్నాయి. ఈ ఫోర్‌స్టార్‌ హోటల్‌ను వచ్చే ఏడాది మార్చి 20వతేదీలోగా అందుబాటులోకి తేనున్నట్లు ప్రకటించా యి. ఈహోటల్‌తోపాటు దేశంలోని ప్రముఖ హోటల్‌ యాజమాన్యాలు కూడా యాదాద్రి ఆలయ సమీపంలో అంతర్జాతీయస్థాయి ప్రమాణాల తో  కన్వెన్షన్‌ సెంటర్లను, పిల్లల పార్కులను నిర్మించేందుకు ముందుకు వస్తున్నట్లు సమాచారం. మార్చి 28న ఆలయ ఉద్ఘాటన నేపథ్యంలో భక్తులకు పలు రకాల సౌకర్యాలు కల్పించేందుకు ముందుకొచ్చే సంస్థలతో ఒప్పందాలు చేసుకునేందుకు చర్యలు తీసుకుంటున్నారు.


యాదాద్రి వరకు కేబుల్‌ బ్రిడ్జి ?

యాదాద్రి క్షేత్రాన్ని సందర్శించే భక్తులకు ఆహ్లాదాన్ని అందించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా భువనగిరి మండలం బస్వాపూర్‌ వద్ద నిర్మిస్తున్న రిజర్వాయర్‌ నుంచి యాదాద్రి దివ్యక్షేత్రం వరకు కేబుల్‌ బ్రిడ్జీని ఏర్పాటు చేయనుంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు జనవరిలో సీఎంవో కార్యదర్శి స్మితాసబర్వాల్‌, నీటిపారుదల ముఖ్య కార్యదర్శి రజత్‌కుమార్‌తోపాటు ముగ్గురు ఈఎన్‌సీలు బస్వాపూర్‌ రిజర్వాయర్‌ పరిసరాలను పరిశీలించారు. హెలీకాప్టర్‌ ద్వారా బస్వాపూర్‌ రిజర్వాయర్‌తోపాటు ఆలయ పరిసరాలను సందర్శించారు. ఏరియల్‌ వ్యూ ద్వారా సర్వే చేపట్టారు. యాదాద్రి నుంచి బస్వాపూర్‌ వరకు ఎంత దూరం ఉంటుందని అంచనా వేశారు. యాదాద్రి సన్నిధిలోని పెద్దగుట్ట మీదుగా గండి చెరువు వరకు బస్వాపూర్‌ బ్రిడ్జీవరకు ఏరియల్‌ డిస్టెన్స్‌ దాదాపు 3కి.మీ వరకు కేబుల్‌ బ్రిడ్జి నిర్మాణానికి అవకాశాలను పరిశీలించారు. ఈమేరకు ప్రభుత్వానికి నివేదిక పంపినట్లు సమాచారం. పర్యాటక శాఖ ఉన్నతాధికారులతో సమీక్షించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 11.39 టీఎంసీల సామర్థ్యంతో నిర్మాణమవుతున్న బస్వాపూర్‌ రిజర్వాయర్‌ వద్ద మైసూర్‌లోని బృందావన్‌ గార్డెన్‌ స్థాయిలో ఽథీమ్‌ పార్క్‌ను అభివృద్ధి చేయడానికి పర్యాటక శాఖ సన్నాహాలు ప్రారంభించింది. భక్తులకు ఈ ఽథీమ్‌ పార్క్‌ ప్రధాన ఆకర్శణగా నిలిచేలా రూపొందిస్తున్నారు.  

Updated Date - 2021-11-28T05:50:03+05:30 IST